
కొత్తపేట ఆర్‌బీకే గోడౌన్‌లో ఎరువులు
● జిల్లాలో 1.74 లక్షల ఎకరాల్లో
వరి సాగు లక్ష్యం
● అవసరమైన విత్తనాలు, ఎరువులు సిద్ధం
● రైతు భరోసా కేంద్రాల్లో
రాయితీపై సరఫరా
కొత్తపేట: అన్నదాతల కష్టం తెలిసిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ముందస్తుగానే వ్యవసాయానికి తోడ్పాటు అందించేలా చర్యలు తీసుకుంది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లేలా ఇరిగేషన్, వ్యవసాయ శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. పంట దిగుబడిలో కీలకమైన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించేందుకు చర్యలు చేపట్టింది. ముందుగానే రైతులకు అందించేందుకు విత్తనాలు, ఎరువులను రైతు భరోసా కేంద్రాలకు చేరవేసింది. ముందుగా నారుమడులు పోసుకోవడానికి, వెదజల్లు పద్ధతిలో సాగు చేసే రైతులు ఇబ్బంది పడకుండా సాయపడాలని ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆ మేరకు గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ముందస్తు ఖరీఫ్ (తొలకరి) సీజన్‌కు సంబంధించి ఈ నెల ఒకటో తేదీన ప్రధాన పంట కాలువలకు గోదావరి నీరు విడుదల చేసింది.
జిల్లాలో పరిస్థితి ఇలా..
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి వ్యవసాయశాఖ అంచనా ప్రకారం 1,74,271 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. ఆ మేరకు 35,277 క్వింటాళ్ల విత్తనాలు అవసరం కాగా ఇప్పటికి 22,119 క్వింటాళ్ల విత్తనాలు, రైతుల వద్ద, ప్రైవేట్ డీలర్ల వద్ద అందుబాటులో ఉన్నాయి. రైతు భరోసా కేంద్రాల్లో 815 క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉండగా కేజీ రూ.5 రాయితీపై సరఫరా చేస్తున్నారు. ఈ ఖరీఫ్‌కు 45,775 మెట్రిక్ టన్నుల వివిధ రకాల ఎరువులు అవసరం. ఎరువుల కొరత పరిస్థితి తలెత్తకుండా దిగుమతి చేస్తున్నారు. ప్రస్తుతం ప్రైవేట్ డీలర్ల వద్ద 40,720 మెట్రిక్ టన్నుల ఎరువులు ఉన్నాయి. రైతు భరోసా కేంద్రాల ద్వారా 13,632 మెట్రిక్ టన్నుల ఎరువులను పంపిణీ చేయాలని వ్యవసాయ శాఖ నిర్దేశించింది. ఆర్‌బీకేల్లో ఎరువులు సిద్ధంగా ఉంచారు.
కొరత లేకుండా చర్యలు
ఖరీఫ్ సీజన్‌కు ముందుగానే విత్తనాలు, ఎరువులు ప్రణాళికాబద్ధంగా సిద్ధం చేశాం. జిల్లాలో ప్రస్తుతం 152 ఎకరాల్లో నారుమడులు వేశారు. మిగతా విస్తీర్ణంలో ఎండలు తగ్గాక వేయనున్నారు. ఆర్‌బీకేల్లో విత్తనాలతో పాటు దశల వారీగా అవసరమైన ఎరువులను సరఫరా చేస్తున్నాం.
– వి.బోసుబాబు, జిల్లా వ్యవసాయ
అధికారి, కోనసీమ జిల్లా
జిల్లాలో ఎరువుల నిల్వలు
రకం ప్రైవేట్ డీలర్ల వద్ద ఆర్‌బీకేల్లో (మెట్రిక్ టన్నుల్లో)
యూరియా 10,273 7,618
కాంప్లెక్స్ 24,240 3,691
డీఏపీ 4,184 1,058
ఎంఓపీ 889 900
సూపర్ 1,134 365
మొత్తం 40,720 13,632
