
ఇంటర్ విద్యలో సంస్కరణలపై అవగాహన
అమలాపురం టౌన్: ఇంటర్ విద్యలో చేపడుతున్న సంస్కరణల్లో భాగంగా జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల్లో ఓరియెంటేషన్ ప్రోగామ్‌లు శనివారం నుంచి మొదలయ్యాయని డీఐఈఓ వనుము సోమశేఖరరావు తెలిపారు. ఇందులో భాగంగా అమలాపురం ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో శనివారం జరిగిన గణితం ఓరియెంటేషన్ ప్రోగామ్‌లో ఆయన మాట్లాడారు. రాజోలు ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకుడు కె.గణేశ్వరరావు జిల్లాలోని గణిత అధ్యాపకులకు శిక్షణ ఇచ్చారని చెప్పారు. అలాగే వచ్చే డిసెంబర్ వరకూ వృక్ష, జంతు, భౌతిక, రసాయన శాస్త్రాల్లో కూడా వృత్యంతర శిక్షణ తరగతులు ప్రతి నెలలోనూ జరుగుతాయన్నారు. దీనివల్ల అధ్యాపకులు సిలబస్‌లో వస్తున్న మార్పులు, ప్రశ్నపత్రాల మోడల్స్‌పై విద్యార్థులకు వివరించే విధానం మొదలైందని వివరించారు. దీనివల్ల అంశాల వారీగా చర్చించి నాణ్యమైన బోధన పద్ధతులను ఎంపిక చేసుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని డీఐఈఓ చెప్పారు.
పీఎంశ్రీ పాఠశాలలకు
పంద్రాగస్టు నిధులు
విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
రాయవరం: ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (పీఎంశ్రీ)లో భాగంగా జిల్లాలో ఎంపిక చేసిన పాఠశాలల్లో స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమాలకు కేంద్రం నుంచి ప్రత్యేకంగా నిధులు మంజూరయ్యాయి. జిల్లాలో మూడు విడతల్లో 28 పాఠశాలలను పీఎంశ్రీ పథకంలో ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ పాఠశాలల్లో పంద్రాగస్టు వేడుకలను నిర్వహించేందుకు ఒక్కో పాఠశాలకు రూ.25 వేల చొప్పున విడుదల చేశారు. దీనికి సంబంధించి సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఫేజ్–1, 2 పీఎంశ్రీ పాఠశాలలకు ఈ నిధులు కేటాయించారు. ఇలా జిల్లాలో 26 పీఎంశ్రీ పాఠశాలలకు రూ.6.50 లక్షల నిధులు విడుదలయ్యాయి. ఈ నిధులతో విద్యార్థుల్లో స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని నింపేందుకు పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలి. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ కార్యక్రమాలు జరపాలి.
రత్నగిరి కిటకిట
సత్యదేవుని దర్శనానికి 30 వేల మంది
అన్నవరం: రత్నగిరి శనివారం వేల సంఖ్యలో వచ్చిన భక్తులతో కిటకిటలాడింది. ఆలయప్రాంగణం, వ్రతమండపాలు, విశ్రాంత మండపాలు భక్తులతో నిండిపోయాయి. స్వామివారి దర్శనా నికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. సుమారు 30 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి వ్రతాలు రెండు వేలు నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షలు ఆదాయం సమకూరింది. ఐదు వేల మంది భక్తులు స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు. ఉదయం పది గంటలకు స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా తూర్పు రాజగోపురం వద్దకు తీసుకువచ్చి తిరుచ్చి వాహనంపై ప్రతిష్ఠించి పూజల అనంతరం ప్రాకార సేవ నిర్వహించి స్వామి, అమ్మవార్లను తిరిగి ఆలయానికి చేర్చారు. కాగా, రత్నగిరి ఆలయ ప్రాకారంలో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి టేకు రథంపై సత్యదేవుడు, అమ్మవారిని ఊరేగించనున్నారు.
వేలం ఖరారు
రత్నగిరికి వచ్చే భక్తుల సెల్‌ఫోన్లు, కెమేరాలు భద్రపరచేందుకు శనివారం నిర్వహించిన టెండర్ కం బహిరంగ వేలంపాట నెలకు రూ.8.11 లక్షలు చొప్పున ఏడాదికి రూ.97.32 లక్షలకు రికార్డు స్థాయిలో ఖరారైంది. సెల్‌ఫోన్ భద్రపర్చడానికి ఇప్పటి వరకు రూ.ఐదు మాత్రమే వసూలు చేయాలనే నిబంధన ఉండగా దానిని రూ.పదికి పెంచడంతో వేలంపాట భారీగా పెరిగింది. రూ.ఐదు వసూలుకు రెండేళ్ల క్రితం వేలం పాట నిర్వహించగా నెలకు రూ.3.31 లక్షలకు ఖరారైంది. కాగా ఆ వసూలు రూ.పది పెంచగా వేలం రెట్టింపు అంటే రూ.6.62 లక్షలు కావాలి. కానీ అంతకంటే ఎక్కువ మరో రూ.1.49 లక్షలు పెరిగింది. ఇలా ఏడాదికి ఖరారైన వేలం రూ.97.32 లక్షలపై 18 శాతం జీఎస్టీ కూడా వసూలు చేస్తారు. అంటే దాదాపు రూ.17.46 లక్ష లు జీఎస్టీ చెల్లించాలి. అంటే ఏడాదికి సుమారు రూ.1.15 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది.

ఇంటర్ విద్యలో సంస్కరణలపై అవగాహన