
అప్పనపల్లికి పోటెత్తిన భక్తులు
మామిడికుదురు: అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామి ఆలయం శనివారం భక్తులతో పోటెత్తింది. స్వామివారి పాత గుడితో పాటు కొత్త గుడి కిటకిటలాడింది. పవిత్ర వైనతేయ గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు శ్రీదేవి, భూదేవి సమేతుడైన బాల బాలాజీ స్వామివారిని దర్శించుకుని తన్మయత్వం చెందారు. స్వామివారికి ముడుపులు, మొక్కుబడులు చెల్లించారు. ఆలయానికి వివిధ సేవల ద్వారా రూ.2,78,173 ఆదాయం వచ్చిందని ఆలయ ఈఓ వి.సత్యనారాయణ తెలిపారు. స్వామివారి నిత్య అన్నదానానికి రూ.77,978 విరాళాలుగా వచ్చాయన్నారు. స్వామి వారిని ఐదు వేల మంది భక్తులు దర్శించుకోగా, 2,800 మంది అన్న ప్రసాదం స్వీకరించారు. హైదరాబాద్‌కు చెందిన వేగిరౌతు లక్ష్మీపవన్, నాగతులసి దంపతులు రూ.10,116, తాటిపాకకు చెందిన మొల్లేటి శ్రీనివాసరావు, శ్రీవరహలక్ష్మి దంపతులు రూ.10,116 అన్నదానం ట్రస్టుకు విరాళంగా అందించారు. వారికి అర్చకులు స్వామివారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు.
సమన్వయంతో పుష్కర ఏర్పాట్లు
● విజయవాడ డీఆర్‌ఎం మోహిత్ సోనాకియా
● రాజమండ్రి, గోదావరి,
కొవ్వూరు సెక్షన్ల తనిఖీ
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): గోదావరి నదికి 2027వ సంవత్సరంలో జరగనున్న పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని విజయవాడ రైల్వే డీఆర్‌ఎం మోహిత్ సోనాకియా శనివారం రాజమండ్రి–గోదావరి–కొవ్వూరు సెక్షన్‌లను సంబంధిత అధికారులతో కలసి తనిఖీలు చేశారు. పుష్కరాలకు సుమారు 40 లక్షలకు పైగా ప్రయాణికులు వస్తారనే అంచనాతో రాజహేంద్రవరం స్టేషన్‌లోని తూర్పు, పశ్చిమ ప్రవేశ ద్వారాలు, స్టేషన్ యార్డులు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను పరిశీలించారు. జరుగుతున్న స్టేషన్ అభివృద్ధి పనులను పరిశీలించి యాత్రికులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రవేశ ద్వారాలు, సర్క్యులేటింగ్ ప్రాంతాలు, ప్రజలకు అందించే సౌకర్యాలపై అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. అనంతరం డీఆర్‌ఎం మాట్లాడుతూ పుష్కర యాత్రికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, రద్దీని నియంత్రించేందుకు ఆయా స్టేషన్‌లలో ప్రత్యేక కార్యాచరణ చేపట్టనున్నట్లు తెలిపారు. స్టేషన్‌లో అదనపు లిఫ్ట్‌లు, ఎస్క్యులేటర్లు, టికెట్ బుకింగ్ పాయింట్‌లు, పార్కింగ్ స్థలాల ఆధునికీకరణ, సెల్‌ఫోన్ చార్జింగ్ పాయింట్‌లు, సిట్టింగ్ ప్రదేశాలు, షెల్టర్లు, ప్రయాణికులకు మౌలిక సదుపాయాలతో అప్‌గ్రేడ్ చేయనున్నట్లు తెలిపారు. ఈ పనులను సకాలంలో పూర్తిచేసేందుకు అధికారులు సమన్వయంతో కృషిచేయాలని వివరించారు. కార్యక్రమంలో పలు విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

అప్పనపల్లికి పోటెత్తిన భక్తులు