
వైకుంఠవాసా.. శ్రీవేంకటేశా..
● మార్మోగిన వాడపల్లి క్షేత్రం
● ఒక్క రోజే రూ.60.47 లక్షల ఆదాయం
కొత్తపేట: కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వర స్వామివారి క్షేత్రానికి శ్రావణమాసం శనివారం సందర్భంగా భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచే రద్దీ నెలకొంది. గౌతమీ గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. క్యూ లైన్లలో బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. ముడుపులు, మొక్కుబడులు చెల్లించారు. ఏడు శనివారాల వెంకన్న దర్శనం నోము ఆచరించే భక్తులు మాడ వీధుల్లో ఏడు ప్రదక్షిణలు చేశారు. వైకుంఠవాసా.. శ్రీవేంకటేశా.. గోవిందా.. గోవిందా నామస్మరణతో ముందుకు సాగారు. దేవదాయ – ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో తెల్లవారుజామున ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంతశ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు, వేదపండితులు సుప్రభాత సేవతో ప్రారంభించి స్వామివారికి వివిధ సేవలు నిర్వహించారు. అభిషేకాలు, అర్చనల అనంతరం రంగురంగుల సుగంధ భరిత పుష్పాలతో స్వామివారిని కన్నుల పండువగా అలంకరించారు. దేవస్థానం నిర్వహించిన అన్న సమారాధనలో భక్తులు అన్న ప్రసాదం స్వీకరించారు.
ఎండ బారిన పడకుండా..
ఎండ తీవ్రతతో భక్తులు ఇబ్బందులు పడకుండా ఈఓ చక్రధరరావు ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లను పర్యవేక్షించి భక్తులకు మంచినీటి ప్యాకెట్లు అందజేశారు. స్నాన ఘట్టం, తలనీలాల విభాగానికి వెళ్లే భక్తుల కోసం టెంట్లు, మ్యాట్లు ఏర్పాటు చేశారు. మెడికల్ క్యాంపులను వైద్య సిబ్బంది నిర్వహించారు. ఈ ఒక్కరోజు సాయంత్రం 5 గంటల వరకూ విశిష్ట, ప్రత్యేక దర్శనాలు, వేదాశీర్వచనం, ఆన్‌లైన్, నిత్య, శాశ్వత అన్నదానం విరాళాలు, లడ్డూ విక్రయం తదితర రూపాల్లో దేవస్థానానికి రూ.60,46,652 ఆదాయం వచ్చిందని ఈఓ తెలిపారు. రావులపాలెం సీఐ సీహెచ్ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఆత్రేయపురం ఎస్‌ఐ ఎస్.రాము శాంతిభద్రతలను పర్యవేక్షించారు. ఏపీఎస్ ఆర్టీసీ వివిధ ప్రాంతాల నుంచి వాడపల్లి ఆలయానికి బస్సు సర్వీసులను నడిపింది.