
బోధనేతర పనులు అప్పగించొద్దు
ఎమ్మెల్సీ గోపిరాజు, ఫ్యాప్టో రాష్ట్ర చైర్మన్ సాయి శ్రీనివాస్
అమలాపురం టౌన్: ఉపాధ్యాయులకు బోధనేతర పనులు అప్పగించొద్దని, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన పలు బకాయిలను తక్షణమే చెల్లించాలని, పీ–4 కార్యక్రమాల్లో ఉపాధ్యాయులను నిర్బంధించవద్దని ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ బొర్రా గోపిరాజు, ఫ్యాప్టో రాష్ట్ర చైర్మన్ లంకలపల్లి సాయిశ్రీనివాస్ డిమాండ్ చేశారు. పలు డిమాండ్ల సాధన కోసం అమలాపురం నల్లవంతెన కూడలిలో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) ఆధ్వర్యంలో శనివారం చేపట్టిన ధర్నాలో వారు మాట్లాడారు. ఉదయం ధర్నా చేసిన ఉపాధ్యాయులు మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్‌కు ప్రదర్శనగా వెళ్లి తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టరేట్ ఏఓ కె.విశ్వేశ్వరరావుకు అందించారు. 19 డిమాండ్లపై ధర్నాలో వక్తలు చర్చించారు. ఉపాధ్యాయులు తరగతి గదుల్లో కేవలం బోధన బాధ్యతలు చేపడితే విద్యా ప్రమాణాలతో పాటు మెరుగైన ఉత్తీర్ణత సాధించవచ్చని వక్తలు అన్నారు. 12వ వేతన సవరణ సంఘాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని, 30 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) ప్రకటించాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని నినాదాలు చేశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ప్రతి ఆరు నెలలకోసారి డీఏ ప్రకటించాలన్నారు. ఽఈ ధర్నాకు సీపీఐ, సీపీఎం, పలు ప్రజా సంఘాలు సంఘీభావం తెలిపాయి. ప్రభుత్వ పెన్షనర్లు కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు. జిల్లా ఫ్యాప్టో చైర్మన్ ఎంటీవీ సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి పోతంశెట్టి దొరబాబు ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో ఫ్యాప్టో ఆర్థిక కార్యదర్శి కె.రామచంద్రం, డిప్యూటీ సెక్రటరీ సరిదే సత్య పల్లంరాజు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పి.వెంకటేశ్వరరావు, ఎస్‌ఎన్ మునేశ్వరరావు, జీవీవీ సత్యనారాయణ, అబ్దుల్ రహీమ్, ఏఐటీయూసీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కె.సత్తిబాబు, సీపీఎం జిల్లా కన్వీనర్ కారెం వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.