నూతన సంవత్సర వేడుకల్లో అపశ్రుతి 

Young Man Deceased Falling Into Syntex Tank At Hyderabad - Sakshi

సింటెక్స్‌ ట్యాంక్‌లో పడి యువకుడి మృతి 

మృతిపై అనుమానం లేవనెత్తుతున్న కుటుంబసభ్యులు

సాక్షి, పటాన్‌చెరు టౌన్‌ (హైదరాబాద్‌): నూతన సంవత్సర వేడుక ఓ కుటుంబంలో విషాదం నింపింది. మంచినీళ్లు తాగేందుకు సింటెక్స్‌ ట్యాంక్‌లోకి తలపెట్టి ప్రమాదవశాత్తు లోపలికి పడిపోయి ఓ యువకుడు మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పోలీసు స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. మెదక్‌ జిల్లా పెద్దశంకరంపేట గ్రామానికి చెందిన సాయిలు ఎనిమిదేళ్ల క్రితం జీవనోపాధి కోసం పటాన్‌చెరుకు వచ్చి ఇంద్రేశం గ్రామం సాయికాలనీలో వినయ్‌ టైలరింగ్‌ వద్ద పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సాయిలుకు ముగ్గురు పిల్లల్లో రెండో కుమారుడు భవానీప్రసాద్‌(20) చందానగర్‌లోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో ఇంటర్‌ పూర్తిచేసి ఇంటివద్ద ఉంటున్నాడు.

డిసెంబర్‌ 31వ తేదీ రాత్రి భవానీప్రసాద్‌ తన స్నేహితులు వెంకటరెడ్డి, అశోక్, సాయితేజ, దినేశ్‌యాదవ్, వంశీత్‌ రెడ్డి, ఆనంద్‌తో కలసి నూతన సంవత్సర వేడుకల్ని పట్టణంలోని ఎంజీ రోడ్డులో ఓ భవనంపై జరుపుకొనేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. దీంతో భవానీప్రసాద్‌ కేక్‌ కోసిన తరువాత వస్తానని ఇంటికి ఫోన్‌ చేసి చెప్పాడు. స్నేహితులతో కలసి పటాన్‌చెరు పట్టణంలో మంగలబస్తీలో శ్యామ్‌ అనే వ్యక్తి ఇంటిపై మద్యంపార్టీ చేసుకుని అందరూ పడుకున్నారు. పార్టీకి ముందు భవానీప్రసాద్‌ పక్కనే ఉన్న వాటర్‌ట్యాంకుపై సెల్ఫీ దిగే నేపథ్యంలో మద్యం సీసా ట్యాంకులో పడిపోయింది.

తర్వాత అందరూ పడుకున్నారు. భవానీ ప్రసాద్‌కు దాహం వేయడంతో నీటి ట్యాంకు పైకి ఎక్కాడు. ట్యాంక్‌లో తల పెట్టగా ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు. ఇది గమనించిన స్నేహితులు అతన్ని బయటకు తీసి 108కు సమాచారం ఇచ్చారు. సిబ్బంది వచ్చి చూసి అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పటాన్‌చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

అన్నీ అనుమానాలే... 
భవానీ ప్రసాద్‌ మంచినీళ్లు తాగేందుకు ట్యాంకుపైకి ఎక్కాడని అతడి స్నేహితులు చెబుతోన్న వాదనే అసంబద్ధంగా ఉందని, కొడుకు మృతిపై అనుమానం ఉందని తండ్రి, కుటుంబ సభ్యులు అనుమానాలు లేవనెత్తుతున్నారు. కేసు నమోదు చేసి హత్య కోణంలో కూడా దర్యాప్తు చేస్తునట్లు పోలీసులు తెలిపారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top