Kuppam: బరి తెగించిన టీడీపీ నేతలు.. అంతా వారి కనుసన్నల్లోనే..

TDP Leaders Illegal Sand Sales In Kuppam - Sakshi

కుప్పంలో యథేచ్ఛగా కృత్రిమ ఇసుక విక్రయాలు

నియోజకవర్గంలోని 56 ప్లాంట్లు టీడీపీ నేతలవే 

మట్టిని శభ్రంచేసి ఇసుక తయారీ

నిత్యం 70 ట్రాక్టర్లలో అక్రమ రవాణా

ఒక్కో ట్రాక్టర్‌ నుంచి నెలకు రూ.12వేల వసూలు

మామూళ్ల మత్తులో అధికారులు

కుప్పం(చిత్తూరు జిల్లా): తెలుగుదేశం పార్టీ నాయకుల అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. మట్టిని నీటితో శుభ్రం చేయడం ద్వారా కృత్రిమ ఇసుకను తయారు చేసి అమ్మేసుకుంటున్నారు. నాణ్యత లేని ఈ ఇసుకతో కట్టిన నిర్మాణాలు కుప్ప కూలడం ఖాయమని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. గత టీడీపీ ప్రభుత్వంలో ఇసుక కొరత ఏర్పడడంతో ఆ పార్టీ నేతలే విచ్చలవిడిగా  కృతిమ ఇసుక తయారీ కేంద్రాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు కూడా ఆయా కేంద్రాల్లో యథేచ్ఛగా ఇసుక తయారు చేస్తుండడం గమనార్హం. టీడీపీ స్థానిక నేతల కనుసన్నల్లోనే దందా సాగుతున్నట్లు ఆయా ప్రాంత ప్రజలు వెల్లడిస్తున్నారు.
చదవండి: టీడీపీకి ఊపిరి పోయాలనుకోవడం పవన్‌ అవివేకం

ట్రాక్టర్‌ ఇసుక రూ.3 వేలు 
పట్టణంలో ఒక్క ట్రాక్టర్‌ కృత్రిమ ఇసుకను రూ.2 వేల నుంచి 3 వేల వరకు విక్రయిస్తున్నారు. అక్కమార్కులు పగటి సమయంలో రోడ్డు మార్గాలను పరిశీలించుకుంటారు. ఉదయం 4 నుంచి 9 గంటల్లోపు ఎక్కడికి చేర్చాలో అక్కడికి గుట్టుచప్పుడు కాకుండా తరలించేస్తారు. ప్రతి రోజూ రాత్రి వేళల్లో ఇసుక తయారు చేసుకోవడం, తెల్లవారు జామున అనుకున్న మార్గంలో తరలించేయడం కొన్నేళ్లుగా సాగిస్తున్నారు.

రవాణాకు 70 వాహనాలు 
కృత్రిమ ఇసుక రవాణా చేసేందుకు కుప్పంలో 70 వరకు ట్రాక్టర్లను వినియోగిస్తున్నట్లు తెలిసిది.  ఈ వాహనాల యజమానులు పట్టణంలోని గుడుపల్లె క్రాస్, విజలాపురం క్రాస్, మల్లానూరు క్రాస్, దళవాయి కొత్తపల్లి క్రాస్‌లో నిలబడి రవాణాను పర్యవేక్షిస్తుంటారు. ఒక్కో ట్రాక్టర్‌ యాజమాని మామూళ్ల కింద అధికారులకు నెలకు రూ.12 వేలు చొప్పున చెలిస్తున్నట్లు సమాచారం. 70 ట్రాక్టర్లకు మొత్తం కలిపి ఇసుక రవాణాకు ఇబ్బంది కలగకుండా పోలీస్, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులకు వాటాలు అందిస్తున్నట్లు వారే బహిరంగంగా చెబుతున్నారు. ప్రధానంగా రాత్రి వేళ గస్తీకి వెళ్లే పోలీసు సిబ్బంది అక్రమ రవాణాకు సహకరిస్తున్నట్లు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.   

ఫిర్యాదులకు దిక్కులేదు 
ఎన్నో ఏళ్ల తర్వాత జలకళ సంతరించుకున్న చెరువులను ఇసుక మాఫియా వదలడంలేదు. ఇసుక తయారీ కోసం ఇష్టారాజ్యంగా నీరు తోడేస్తోంది. దీనిపై స్థానికులు ఎన్నిసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండా పోతోంది. పోలీసులు తమకు ఫిర్యాదు చేసిన వారిని రెవెన్యూ అధికారుల దగ్గరకు, వారు విద్యుత్‌ శాఖకు అక్కడి సిబ్బంది గనుల శాఖను సంప్రదించాలని వంతులు వేసుకుని పంపేసి చేతులు దులిపేసుకుంటున్నారు. 20 రోజుల క్రితం గుడపల్లె గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేసేందుకు వెళితే వారికి ఎదురైన అనుభవమే ఇది. 

ఇష్టారాజ్యంగా విద్యుత్‌ చౌర్యం 
ఇసుక తయారీకి విద్యుత్‌ అవసరం. వ్యవసాయ బోర్లకు త్రీ ఫేజ్‌ విద్యుత్‌ ఉంటేనే మోటార్లు పనిచేస్తాయి. అయితే ఆధునిక పద్ధతులను వినియోగించుకుని సింగిల్‌ ఫేజ్‌ విద్యుత్‌తో నడిచే మోటార్లు అమర్చుకున్నారు. కరెంటు తీగలకు రాత్రి వేళల్లో కొక్కీలు తగిలించి విద్యుత్‌ చౌర్యానికి పాల్పడుతున్నారు.

గుండ్లసాగరం వద్ద అక్రమంగా విద్యుత్‌ తీగలకు కోక్కీలు తగిలించిన దృశ్యం 

ఇవే కీలకం 
కుప్పం పట్టణ పరిధిలోని లక్ష్మీపురంలో టీడీపీ క్లస్టర్‌ ఇన్‌చార్జి ఇసుక తయారీ కేంద్రాలను నడుపుతున్నారు. కృష్ణదాసన పల్లె పంచాయతీ టీడీపీ యువత అధ్యక్షుడికి గొల్లపల్లె, యానాదనపల్లె, కృష్ణదాసనపల్లెల్లో తయారీ కేంద్రాలు ఉన్నాయి. పరమసముద్రం, వరమనూరు, గట్టప్పనాయపల్లి, డీకే పల్లె, పీబీనత్తం గ్రామాల్లో టీడీపీ నాయకులే తయారీ కేంద్రాలు నడిపిస్తున్నారు. గుడుపల్లె మండలం గుండ్లసాగరం పంచాయతీ టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎంపీటీసీ, క్రియాశీల కార్యకర్త ముగ్గురూ కలసి దర్జాగా దందా నడుపుతున్నారు. అగరంలో టీడీపీ బూత్‌ కన్వీనర్లు, యామనూరు, పీబీవాడ, శెట్టిపల్లె, కంచి బందార్లపల్లె గ్రామాల్లో స్థానికంగా ఉన్న టీడీపీ కేడర్‌ కృత్రిమ ఇసుక దందా సాగిస్తోంది.

పెద్దసంఖ్యలో తయారీ కేంద్రాలు
కుప్పం నియోజకవర్గంలో సుమారు 56కు పైగా కృత్రిమ ఇసుక తయారీ కేంద్రాలు ఉన్నాయి. వీటిని నడిపేది ఆయా ప్రాంతాల్లోని టీడీపీ నాయకులే. వ్యవసాయ బోర్లు, చెరువులు, బావులు అందుబాటులో ఉన్న ప్రదేశాలను ఎంపిక చేసుకుని అక్కడకు మట్టిని తోలుకుంటారు. అక్కడ మోటార్లతో మట్టిని శుభ్రం చేసి వచ్చే ఇసుకను వేల రూపాయలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇసుక తయారీని ప్రభుత్వం నిషేధించినా కుప్పంలో మాత్రం యథేచ్ఛగా దందా సాగుతోంది.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top