సబ్బం హరి ఆస్తులు సీజ్‌! | Sakshi
Sakshi News home page

సబ్బం హరి ఆస్తులు సీజ్‌!

Published Fri, Sep 9 2022 4:34 AM

TDP Leader Sabam Hari assets seized - Sakshi

సీతమ్మధార (విశాఖ ఉత్తర): మాజీ ఎంపీ, దివంగత టీడీపీ నాయకుడు సబ్బం హరి తీసుకున్న రుణాన్ని చెల్లించకపోవడంతో విశాఖ కో–ఆపరేటివ్‌ బ్యాంకు అధికారులు ఆయన ఆస్తులను సీజ్‌ చేసినట్లు సమాచారం. ఆస్తులు తనఖా పెట్టి తీసుకున్న రుణం, వడ్డీ, ఇతర ఖర్చులతో కలిపి రూ.9 కోట్లకు పైగా బకాయి ఉన్నట్లు సమాచారం. విశాఖ మద్దిలపాలెం ప్రాంతంలో ఉన్న డెక్కన్‌ క్రానికల్‌ భవనాన్ని కోటక్‌ మహీంద్ర బ్యాంకు 2014లో రూ.17.80 కోట్లకు వేలం వేయగా సబ్బం హరి వేలంలో దాన్ని దక్కించుకున్నారు.

ఆ సమయంలో తన ఆస్తులను తనఖా పెట్టి విశాఖ కో–ఆపరేటివ్‌ బ్యాంకు నుంచి రూ.8.50 కోట్లు రుణం తీసుకున్నారు. వేలం నిబంధనల మేరకు నిర్వహించలేదంటూ డెక్కన్‌ క్రానికల్‌ యాజమాన్యం డెట్‌ రికవరీ అప్పిలేట్‌ అథారిటీలో కేసు వేసింది. అప్పిలేట్‌ అథారిటీ ఆ వేలాన్ని రద్దు చేసి, సబ్బం హరి డిపాజిట్‌ చేసిన రూ.17.80 కోట్లను వడ్డీతో సహా చెల్లించాలని ఆదేశించింది. ఈ తీర్పుపై కోటక్‌ మహీంద్ర బ్యాంక్‌ అప్పీల్‌కు వెళ్లింది. ప్రస్తుతం ఈ కేసు నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో ఉంది.

విశాఖ కోఆపరేటివ్‌ బ్యాంకు నుంచి తీసుకున్న రుణాన్ని చెల్లించకపోవడంతో అధికారులు సబ్బం హరికి 2018లోనే నోటీసులు జారీ చేశారు. 60 రోజుల్లో రుణం చెల్లించని పక్షంలో సీతమ్మధారలోని 1,622 చదరపు గజాల స్థలంలోని నివాసంతోపాటు మాధవధార వుడా లేఅవుట్లోని 444.44 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న విష్ణు వైభవం గ్రూప్‌ హౌస్‌లోని అపార్ట్‌మెంట్, రుషికొండ దగ్గరలో ఉన్న 800 చదరపు గజాల స్థలాన్ని స్వాధీనం చేసుంటామని నోటీసుల్లో స్పష్టం చేశారు. దీనిపై ఆయన కోర్టుకు వెళ్లారు. కోర్టు ఉత్తర్వుల మేరకు బ్యాంకు అధికారులు మాధవధార విష్ణు వైభవంలోని అపార్ట్‌మెంట్‌ను సీజ్‌ చేసినట్లు సమాచారం. ఈ నెల 12న సీతమ్మధారలో ఉన్న నివాసాన్ని కూడా స్వాధీనం చేసుకునేందుకు ఆయన కుటుంబ సభ్యులకు నోటీసులు అందించినట్లు తెలిసింది.  

Advertisement
Advertisement