జరిమానా చెల్లించేందుకు కోర్టులోనే చోరీ | Sakshi
Sakshi News home page

జరిమానా చెల్లించేందుకు కోర్టులోనే చోరీ

Published Wed, Sep 27 2023 2:37 AM

Stealing in court to pay fine - Sakshi

సంగారెడ్డి అర్బన్‌: కోర్టు విధించిన జరిమానా చెల్లించేందుకు అదే కోర్టులో గంజాయిని దొంగతనం చేసిన నిందితుడి నిర్వాకమిది. సంగారెడ్డి డీఎస్పీ రమేష్‌ కుమార్‌ కథనం మేరకు.. ఈ నెల 19వ తేదీన కోర్టు హాలులోని న్యాయమూర్తి చాంబర్‌లో ఓ కేసుకు సంబంధించిన గంజాయి సంచిని సీజ్‌ చేసి ఉంచారు. గుర్తు తెలియని వ్యక్తులు తాళం పగులగొట్టి గంజాయి సంచిని ఎత్తుకెళ్లారు. దీనిపై కోర్టు సీనియర్‌ సూపరింటెండెంట్‌ విజయ్‌ కుమార్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీ, షూ గుర్తుల ఆధారంగా నిందితుడు మగ్దూమ్‌నగర్‌కు చెందిన షేక్‌ మహబూబ్‌గా గుర్తించారు.

అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా నేరం ఒప్పుకున్నాడు. నిందితుడు ఇదివరకు ఒక దొంగతనం, యాక్సిడెంట్‌ కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చాడు. 14 ఏళ్లుగా స్థానిక జిల్లా కోర్టు ఆవరణలో ఎవరైనా నిందితులకు బెయిల్‌ జామీను కావాలంటే డబ్బులు తీసుకొని పూచీకత్తు ఇస్తుంటాడు. అందులో భాగంగా సంగారెడ్డి టౌన్‌ పీఎస్‌ పరిధిలో జరిగిన ఓ ఏటీఎం దొంగతనం కేసులో నిందితులకు జామీను ఇచ్చాడు.

అయితే వారు కోర్టుకు రానందున మహబూబ్‌ రూ.30వేలు కట్టాల్సి వచ్చింది. ఈ డబ్బు ఎలా కట్టాలో తెలియక కోర్టు హాలులో ఉన్న గంజాయి మూటను అమ్మి డబ్బు చేసుకోవాలని భావించి దొంగతనం చేశాడు. గంజాయి మూటను స్వాదీనం చేసుకుని నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement