మాజీ నక్సలైట్ పేరుతో డబ్బులు డిమాండ్
అరెస్టు చేసిన పోలీసులు
చిన్నశంకరంపేట(మెదక్): మాజీ నక్సలైట్ అంటూ డబ్బులు డిమాండ్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి, కేసు నమోదు చేశారు. నార్సింగి ఎస్‌ఐ సృజన వివరాల మేరకు... సోమవారం భద్రాద్రి కొత్తగూడెం సన్యాసి బస్తీకి చెందిన కుర్మ సాంబమూర్తి అలియాస్ శ్యామ్‌కుమార్ తాను మాజీ నక్సలైట్‌నని, డబ్బులు ఇవ్వాలని నార్సింగి సర్పంచ్ ఆకుల సుజాతగౌడ్ ఇంటికి వెళ్లి డిమాండ్ చేశాడు. తనకు రాష్ట్ర కమిటీ, కేంద్ర కమిటీ నక్సలైట్లతో పరిచయాలు ఉన్నాయని చెప్పాడు. దీంతో సుజాతగౌడ్ భర్త మల్లేశంగౌడ్‌కు ఫోన్ చేసి విషయం చెప్పగా తాను వచ్చేవరకు ఉండాలన్నారు. అక్కడి నుంచి మరో వ్యక్తి వద్దకు వెళ్లి ఇదే విషయం చెప్పడంతో వారికి అనుమానం వచ్చి పోలీసులకు చెప్పారు. ఎస్‌ఐ సృజన వెంటనే వచ్చి సాంబమూర్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. సాంబమూర్తి ఇదివరకు కూడా జనగామలో ఇలాగే డబ్బుల వసూళ్లకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైందని తెలిపారు.


