పొలం వివాదంలో ‘సమాజ సేవకుడు’ దారుణహత్య | Social Activist Assassinated In Subhadrampeta East Godavari | Sakshi
Sakshi News home page

పొలం వివాదంలో ‘సమాజ సేవకుడు’ దారుణహత్య

Aug 9 2021 11:11 AM | Updated on Aug 9 2021 11:31 AM

Social Activist Assassinated In Subhadrampeta East Godavari - Sakshi

రంగంపేట: తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం సుభద్రంపేట గ్రామానికి చెందిన ఏలూరి శ్రీనివాస్‌(37) ఆదివారం దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సుభద్రంపేట గ్రామానికి చెందిన ఏలూరి వెంకట్రావు కుమారులకు, సాధనాల ధర్మరాజుకు గ్రామంలోని పొలం సరిహద్దు వద్ద తాటి కట్టవ కారణంగా ఏడాదికాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నెల 7వ తేదీ శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో పొలం సరిహద్దు గురించి ఏలూరి వెంకట్రావు కుమారుడు ఏలూరి శ్రీనివాస్‌కి సాధనాల ధర్మరాజుకి గొడవ జరిగి ఒకరిపైఒకరు దాడి చేసుకున్నారు.

ఆదివారం ఉదయం 11.30 గంటల సమయంలో ఏలూరి శ్రీనివాస్‌ ఇంటి వద్ద నుంచి వీరభద్రుని గుడి వైపు నడుచుకుంటూ వస్తుండగా సాధనాల ధర్మరాజు, అతని కుమారుడు సాధనాల వీరభద్రరావు అతనిపై దాడి చేశారు. కర్రతో దాడి చేసిన అనంతరం చాకుతో పొడిచాడు. దీంతో శ్రీనివాస్‌కు తీవ్రగాయాలయ్యాయి. చుట్టుపక్కల వారు 108కి ఫోన్‌ చేయగా వాహనంలో పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ డాక్టర్‌ పరీక్షించి చనిపోయినట్టుగా నిర్ధారించారు. మృతుడు చిన్నాన్న ఏలూరి గోపాలం ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంపేట ఇన్‌చార్జి ఎస్సై ఎ.ఫణికుమార్‌ కేసు నమోదు చేయగా, పెద్దాపురం సీఐ కేఎన్‌వీ జయకుమార్‌ ఘటనా స్ధలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు ప్రారంభించారు.

ఎన్నో సమాజ సేవలు
దారుణ హత్యకు గురైన ఏలూరి శ్రీనివాస్‌ మంచి సమాజ సేవకుడిగా గుర్తింపు పొందాడు. హైదరాబాద్‌లోని ప్రయివేటు సిరామిక్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తూ అమ్మ ఫౌండేషన్‌ స్థాపించి  సుభద్రంపేటలోని పాఠశాలలో చదువుల తల్లి సరస్వతి దేవీ విగ్రహం ఏర్పాటు చేసి ఏటా వసంత పంచమినాడు సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహించి విద్యార్థులకు విద్యా సామగ్రితో పాటు యూనిఫాంలను కూడా అందించేవాడు. హైదరాబాద్‌లోని బొల్లారంలో నాలుగు రోజుల కిందట జరిగిన బోనాల ఉత్సవాల్లో శ్రీనివాస్‌ను సత్కరించారు. అక్కడ నుంచి కుటుంబ సభ్యులను చూడటానికి శుక్రవారం రాత్రే గ్రామానికి వచ్చాడు. హైదరాబాద్‌లోనే ఉండిపోయినా ప్రాణాలతో మిగిలేవాడని కుటుంబ సభ్యులు భోరున విలపిస్తున్నారు. శ్రీనివాస్‌ భార్య విజయలక్ష్మీ, కుమారుడు అక్షయ్‌ హైదరాబాద్‌లోనే ఉన్నారని ఈ విషయం వారిద్దరికీ ఎలా చెప్పాలని కన్నీరుమున్నీరవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement