నాటు సారా కేంద్రాల నిర్మూలనకు స్పెషల్‌ డ్రైవ్‌

SEB Special drive to eradicate Natu Sara centers - Sakshi

మరింత పటిష్టంగా ఇన్ఫార్మర్స్‌ వ్యవస్థ

నిరంతర నిఘా ద్వారా అక్రమాలకు అడ్డుకట్ట

‘సాక్షి’ కథనాలపై ఎస్‌ఈబీ కమిషనర్‌ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ స్పందన

ఎస్‌ఈబీ ఏఎస్పీలతో టెలీకాన్ఫరెన్స్‌  

సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: నాటు సారాను అరికట్టేందుకు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో(ఎస్‌ఈబీ) స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టింది. సారా తయారీ కేంద్రాలను గుర్తించేందుకు పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తోంది. ‘కాటు సారా’, ‘హద్దులు లేవు.. అక్రమాలకు కేరాఫ్‌గా ఆంధ్రా ఒడిశా బోర్డర్‌’ అనే శీర్షికలతో ‘సాక్షి’ ప్రచురించిన కథనాలపై ఎస్‌ఈబీ కమిషనర్‌ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ స్పందించారు. 18 పోలీస్‌ యూనిట్లకు చెందిన ఎస్‌ఈబీ ఏఎస్పీలతో సోమవారం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించి పలు ఆదేశాలు జారీ చేశారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఆశయం, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఆదేశాలకు అనుగుణంగా నాటు సారా, గంజాయి, మాదక ద్రవ్యాలతో పాటు ఇసుక అక్రమాలపై మరింత దృష్టి సారించాలని వినీత్‌ బ్రిజ్‌లాల్‌ ఆదేశించారు.

ప్రజల ప్రాణాలు తీస్తున్న సారాను పూర్తిగా నిర్మూలించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని.. గ్రామాల్లో ఉన్న ఇన్ఫార్మర్స్‌ వ్యవస్థను పటిష్టం చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే రాష్ట్రంలోని 191 మండలాల్లో మొత్తం 682 నాటుసారా తయారీ కేంద్రాలను గుర్తించినట్లు చెప్పారు. ఇవి కాకుండా ఇంకా ఎక్కడెక్కడ సారా తయారీ కేంద్రాలు ఉన్నాయో నిఘా వర్గాలు, ఇన్ఫార్మర్స్‌ ద్వారా జల్లెడ పట్టాలని ఆదేశించారు. ఇప్పటికే దాదాపు 10,000 మంది ఇక సారా తయారు చేయబోమని చెప్పారని.. ఇంకా ఎవరైనా ఉంటే నయానో, భయానో చెప్పి సారా తయారీని మాన్పించాలని సూచించారు. నవోదయం, పరివర్తన వంటి కార్యక్రమాల ద్వారా వారికి అవగాహన కల్పించాలని.. అప్పటికీ మారకపోతే పీడీ యాక్ట్‌ ప్రకారం కేసులు పెట్టేందుకు కూడా వెనుకాడవద్దని ఆదేశాలిచ్చారు. సారా తయారీ, రవాణాపై నిరంతరం నిఘా వేసి ఉంచాలని.. ఏ మాత్రం ఏమరుపాటు వద్దని ఆదేశించారు.
జక్కరవలసలో 1,280 లీటర్ల బెల్లం ఊట కేన్‌లను పట్టుకున్న ఎస్‌ఈబీ సిబ్బంది 

శ్రీకాకుళంలో కొనసాగిన దాడులు.. 
ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల్లో జరుగుతున్న అక్రమాలపై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం శ్రీకాకుళం జిల్లాలో చర్చనీయాంశమైంది. సరిహద్దులపై ఎస్‌ఈబీ అధికారులు మరింత దృష్టి సారించారు. దాడులు చేయడమే కాకుండా.. అవగాహన కల్పించడం ద్వారా కూడా మార్పు తీసుకొచ్చే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. పాతపట్నం మండలం బొమ్మికలో, కంచిలి మండలం పి.సాసనం గ్రామంలో ఎస్‌ఈబీ అ«ధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మరోవైపు సీతంపేట మండలం జక్కరవలస పరిసర ప్రాంతాల్లో ఎస్‌ఈబీ సిబ్బంది సోమవారం దాడులు చేసి 1,280 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. మెళియాపుట్టి మండలం సవరమర్రిపాడులో 600 లీటర్లు, కొత్తూరు మండలంలో జక్కరగూడ, బొడ్డగూడలో 750 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. పలాసలో నాటు సారాను, రాజాం, కోటబొమ్మాళి, పొందూరులో నాన్‌ పెయిడ్‌ డ్యూటీ వైన్‌ను పట్టుకుని సీజ్‌ చేశారు. ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా వేసినట్లు ఎస్‌ఈబీ ఏఎస్పీ శ్రీనివాసరావు ‘సాక్షి’కి తెలిపారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top