శ్రీశైలం ఘాట్‌రోడ్డు: లోయలో పడిన వ్యాన్‌ 

Road Accident Van Fell Into The Valley In Nagarkurnool district - Sakshi

9 మందికి తీవ్ర గాయాలు 

ముగ్గురి పరిస్థితి విషమం 

క్షతగాత్రులంతా ఒకే కుటుంబ సభ్యులు 

శ్రీశైలం ఘాట్‌రోడ్డు కట్టమైసమ్మ గుడి వద్ద ఘటన 

సాక్షి, నాగర్‌కర్నూల్‌: నాగర్‌కర్నూల్‌ జిల్లా ఈగలపెంట శ్రీశైలం ఘాట్‌రోడ్డులో మంగళవారం రాత్రి ఓ వ్యాన్‌ లోయలో పడింది. అందులో ప్రయాణిస్తున్న 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌ ధూల్‌పేటలోని ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది క్వాలీస్‌ వాహనంలో శ్రీశైలం బయల్దేరారు. ఈగలపెంట సమీపంలో మైసమ్మగుడి మొదటి మలుపు వద్ద వాహనం అదుపుతప్పి 50 అడుగుల లోతు లోయలో పడిపోయింది. దీంతో వాహనంలో ఉన్న నమ్రతాసింగ్, హేమలత, అనిల్‌ సింగ్, అస్మిత్‌ సింగ్, ధర్మేష్, సుమన్‌లత, నీతూ సింగ్, రాజకుమారి, ధార్మిక్‌ గాయపడ్డారు. (స్పీడ్‌పోస్టు, కొరియర్లలో డ్రగ్స్‌)

క్షతగాత్రులను మూడు అంబులెన్స్‌లో ఈగలపెంట జెన్‌కో ఆస్పత్రికి తరలించారు. వీరిలో నీతూ సింగ్‌ (40), రాజకుమారి (55), ధర్మిక్‌ (8) పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రత్యేక వాహనంలో హైదరాబాద్‌కు తరలించారు. మిగతావారిని కూడా ఈగలపెంటలో ప్రాథమిక చికిత్స అనంతరం హైదరాబాద్‌కు తరలించారు. అతివేగం, డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు.  (సారు చెబితేనే చేశాం..)

స్థానికుల సహాయం  
దోమలపెంట ప్రాంత యువకులు సంఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులకు సహాయం చేశారు. కర్నూలు జిల్లా సున్నిపెంట అగ్నిమాపక కేంద్ర సిబ్బంది సహాయ కార్యక్రమాలు చేపట్టారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న శ్రీశైలం దేవస్థానం ఈఓ రామారావు దేవస్థానానికి చెందిన రెండు అంబులెన్స్‌లు, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఓ అంబులెన్స్‌ను ఈగలపెంటకు పంపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top