కొంపముంచిన కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యం.. 

Road Accident Tragedy In Warangal - Sakshi

సాక్షి, ఖానాపురం(వరంగల్‌) : జాతీయ రహదారి పనుల్లో ఎడతెగని జాప్యం, కాంట్రాక్టర్‌ నిర్లక్షం వెరసి ఓ కుటుంబాన్ని పోషించే యువకుడు మృత్యువాత పడ్డాడు. తండ్రి లేని లోటు తీరుస్తూ హమాలీగా పనిచేస్తూ కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్న యువకుడు మృతి చెందడం వి షాదాన్ని నింపింది. వరంగల్‌ రూరల్‌ జిల్లా ఖానా పురం మండలంలోని బుధరావుపేట శివారులో బుధవారం రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 

బంధువు మృతి చెందడంతో...
మహబూబాబాద్‌ పత్తిపాకకు చెందిన ఎల్పుగొండ సాయిరాం(22) వ్యవసాయ మార్కెట్‌లో హమాలీగా పని చేస్తున్నాడు. వరంగల్‌లో తమ బంధువు మృతి చెందగా తన స్నేహితులు శరత్, సుమంత్‌తో కలిసి బుధవారం ఉదయం వెళ్లిన ఆయన దహన సంస్కార కార్యక్రమంలో పాల్గొన్నాక ద్విచక్ర వాహనంపై తిరుగు పయనమయ్యారు. ఖానాపురం మీదుగా రాత్రి 7 గంటల సమయంలో మహబూబాబాద్‌కు వెళ్తున్నారు. కాగా, బుధరావుపేట శివారులో జాతీయ రహదారి పనుల్లో భాగంగా సుమారు రెండేళ్లుగా కల్వర్టు(బ్రిడ్జి) నిర్మాణ పనులు జరుగుంతడగా, ఎలాంటి హెచ్చరిక, సూచిక బోర్డులు ఏర్పాటు చేయలేదు.

దీంతో పనులను గుర్తించని యువకులు కల్వర్టును ఢీకొని గుంతలో పడిపోయారు. దీంతో సాయిరాం అక్కడికక్కడే మృతి చెందగా శరత్, సుమన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అయితే, ఎవరూ చూడకపోవడంతో రాత్రంతా అదే గుంతలో అపస్మారక స్థితిలో ఉన్నారు. గురువారం ఉదయం స్థానికులు గుర్తించి శరత్, సుమన్‌ను నర్సంపేట ఆస్పత్రికి తరలించి వెళ్లిపోయారు. అయితే అదే గుంతలో మరొకరు ఉన్నారని తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకునేసరికి సాయిరాం మృతి చెంది ఉన్నాడు.

బంధువులు, గ్రామస్తుల రాస్తారోకో
కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యంతోనే సాయిరాం మృతి చెందాడని ఆరోపిస్తూ మంగళవారిపేట, బుధరావుపేట గ్రామాలకు చెందిన గ్రామస్తులతో పాటు మృతుడి బంధువులు జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఎలాంటి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయనందునే ప్రమాదం జరిగినందున, యువకుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. రూరల్‌ సీఐ సతీష్‌బాబు, ఎస్సైలు సాయిబాబు, బండారి వెంకటేశ్వర్లు చేరుకొని బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వెనక్కి తగ్గారు. కాంట్రాక్టర్లు శ్రీనివాసరావు, సందీప్‌రావుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మృతుడి సోదరుడు సందీప్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. 

చదవండి: కేంద్ర కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణపై కసరత్తు

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top