బెయిల్‌ ఇప్పిస్తాడు... స్నాచింగ్స్‌ చేయిస్తాడు!

Police Arrested A Man Encourage Snatching And Give Bail - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు శనివారం అరెస్టు చేసిన ఘరానా స్నాచర్‌ మహ్మద్‌ ఫైజల్‌ షా అలీ జాబ్రీ విషయంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఇతడి వెనుక ఉండి కథ నడిపేది మహ్మద్‌ ఖలీల్‌గా తేలింది. వీరిద్దరినీ జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించిన శాలిబండ పోలీసులు తదుపరి విచారణ నిమిత్తం తమ కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు. ఆసిఫ్‌నగర్‌ ప్రాంతానికి చెందిన ఫైజల్‌ సోదరుడు పేరున్న వైద్యుడు.

ఇంటర్మీడియట్‌ మధ్యలో మానేసిన ఇతగాడు కొన్నాళ్లు పంజగుట్టలోని ఓ బ్యాంక్‌లో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పని చేశాడు. వ్యసనాలకు బానిసగా మారి తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం 2006 నుంచి చైన్‌ స్నాచింగ్స్‌ చేయడం మొదలెట్టి ఇప్పటి వరకు 138 గొలుసులు తెంపాడు. రెండుసార్లు పీడీ యాక్ట్‌ కూడా నమోదైంది.  ఇతడు జైల్లో ఉండగా మరో ఘరానా స్నాచర్‌ ఖలీఫాతో పరిచయమైంది. ఇలా ఖలీఫాను కలవడానికి వచ్చే అతడి సోదరుడు ఖలీల్‌తోనూ స్నేహం చేశాడు. సింగిల్‌గా చైన్‌ స్నాచింగ్స్‌ చేసే ఫైజల్‌ విషయం తెలిసిన ఖలీల్‌ అతడిని అడ్డు పెట్టుకుని తేలిగ్గా డబ్బు సంపాదించాలని పథకం వేశాడు. దీనిని అమలులో పెట్టడం కోసం అతడికి బెయిల్‌ ఇప్పించి బయటకు తీసుకువచ్చాడు.  

ఇప్పటి వరకు ఫైజల్‌కు రెండుసార్లు బెయిల్‌ ఇప్పించిన ఖలీల్‌ అతడికి ఆశ్రయం ఇవ్వడంతో పాటు చైన్‌ స్నాచింగ్స్‌ చేసేలా ప్రోత్సహించాడు. ఇలా తెచ్చిన గొలుసులను అమ్మగా వచ్చిన డబ్బును ఇద్దరూ పంచుకోవడం మొదలెట్టాడు. గతంలో సుల్తాన్‌బజార్‌ పోలీసులు ఫైజల్‌ను అరెస్టు చేసినప్పుడు కొన్ని నేరాలు చెప్పకుండా చేసి ఆ సొత్తు కాజేశాడు. ఖలీల్‌ పైనా రెండు స్నాచింగ్‌ కేసులు ఉన్నాయి. ఒంటరిగా బైక్‌పై సంచరిస్తూ స్నాచింగ్స్‌ చేసే ఫైజల్‌ మహిళల మెడలోని గొలుసులు లాగడంలో సిద్ధహస్తుడు.

బాధితురాలికి ఏమాత్రం గాయం కాకుండా గొలుసు తెంపేస్తాడు. నేరం చేయడానికి వెళ్లేప్పుడే తనతో మరో షర్ట్‌ తీసుకువెళ్తాడు. స్నాచింగ్‌ చేసిన తర్వాత అనువైన ప్రాంతంలో ఆగి చొక్కా మార్చుకుంటాడు. సీసీ కెమెరాల ద్వారా దర్యాప్తు చేసినా చిక్కకుండా ఉండేందుకు వీలున్నంత వరకు ప్రధాన రహదారిని వాడడు. రెక్కీ లేకుండా నేరం చేయడం, చొక్కా మార్చుకోవడంతో పాటు గల్లీల్లో తిరుగుతూ తప్పించుకునే ఇతడి ఆచూకీ కనిపెట్టడానికి పోలీసులు ముప్పతిప్పలు పడాల్సి వస్తుంది. ఇటీవల శాలిబండ, నారాయణగూడ, సరూర్‌నగర్‌ల్లో మూడు స్నాచింగ్స్‌ చేసిన ఫైజల్‌తో పాటు సహకరించిన ఖలీల్‌ను సౌత్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ చాకచక్యంగా పట్టుకుని 120 గ్రాముల బంగారం రికవరీ, నేరాలకు వాడే పల్సర్‌ బైక్‌ రికవరీ చేసింది.  

(చదవండి: 12 సీసీకెమెరాలు పెట్టినా...రూ.40 లక్షలు స్వాహా)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top