
నిజామాబాద్ ఆస్పత్రిలో ఏఆర్ కానిస్టేబుల్ తుపాకీ లాక్కొని ఫైర్ చేసే యత్నం
తప్పని పరిస్థితిలో కాల్పులు జరిపాం: సీపీ సాయిచైతన్య
మృతుడు సీసీఎస్ కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుడు
నిజామాబాద్ అర్బన్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్‌ను కత్తితో పొడిచి హత్యచేసిన పాత నేరస్తుడు షేక్‌రియాజ్ సోమవారం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో పోలీస్ కాల్పుల్లో మరణించాడు. పరారీలో ఉన్న రియాజ్‌ను ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు పోలీసులు పట్టుకున్నారు. అనంతరం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో 4వ అంతస్తులో ఖైదీల వార్డులో చికిత్స అందిస్తున్నారు. కాగా సోమవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో వార్డులోకి సాధారణ తనిఖీల్లో భాగంగా ఏఆర్ ఎస్సై, ఏఆర్ కానిస్టేబుల్ మరో ఇద్దరు సిబ్బంది వెళ్లారు.
గదిలో రియాజ్ తలుపులు, కిటికీలు పగులగొట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఏఆర్ కానిస్టేబుల్ రియాజ్‌ను బెడ్‌వద్దకు తీసుకెళ్లి పడుకోబెట్టాడు. అయితే రియాజ్ ఏఆర్ కానిస్టేబుల్ తుపాకీని లాక్కొని ట్రిగ్గర్ నొక్కే ప్రయత్నం చేశాడు. వద్దంటూ వారించినా వినలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడే ఉన్న ఏఆర్ ఎస్సై కాల్పులు జరపగా, షేక్ రియాజ్ అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచాడు.
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయిచైతన్య మీడియా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. జడ్జి సమక్షంలో పంచనామా నిర్వహించి రాత్రి 7 గంటల ప్రాంతంలో పోస్టుమార్టం పూర్తిచేసి రియాజ్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మంగళవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో జిల్లా కేంద్రంలో రియాజ్ అంత్యక్రియలు నిర్వహించారు. ఆస్పత్రిలో కాల్చివేత ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపడుతున్నట్టు సీపీ సాయిచైతన్య తెలిపారు.
కత్తితో పొడిచి తప్పించుకొని..
ఈనెల 18న పాత నేరస్తుడు షేక్‌రియాజ్ ఇంటికి వచ్చాడని సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్, ఎస్సై విఠల్, ఇతర సిబ్బందికి సమాచారం వచ్చింది. బాబాన్ సాహెబ్ పహాడ్‌లోని నిజాంసాగర్ కెనాల్ వద్ద రియాజ్ కనిపించడంతో కానిస్టేబుల్ ప్రమోద్ వెంబండించి పట్టుకున్నారు. అనంతరం బైక్‌పై తీసుకెళుండగా, రియాజ్, కానిస్టేబుల్ ప్రమోద్ ఛాతీలో కత్తితో బలంగా పొడిచి పరారయ్యాడు. చికిత్స పొందుతూ ప్రమోద్ చనిపోయాడు. అనంతరం పోలీస్ కమిషనర్ సాయిచైతన్య 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి రియాజ్ కోసం గాలింపు చేపట్టారు.
ఆదివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో సారంగాపూర్ శివారులో పాతబడిన ఓ లారీ క్యాబిన్‌లో రియాజ్ ఉన్నట్టు స్థానికులు చెప్పగా, పోలీసులు అక్కడకు చేరుకున్నారు. రియాజ్ పారిపోతుండగా, ఆసిఫ్ అనే యువకుడు రియాజ్‌ను అడ్డుకున్నాడు. ఈ క్రమంలో ఆసిఫ్ రెండు చేతులకు గాయాలయ్యాయి. అప్పటికే పోలీసులు చుట్టుముట్టి రియాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం జరిగిన పరిణామాల్లో రియాజ్ పోలీసు కాల్పుల్లో మరణించాడు.గాయపడిన ఆసిఫ్ హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రి చికిత్స పొందుతున్నాడు.