
హైదరాబాద్: మూసాపేట మెట్రో స్టేషన్‌లో ఓ బాలుడి వద్ద బుల్లెట్ దొరకడంతో కలకలం రేగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఓ బాలుడు (12) మూసాపేట పరిధి ప్రగతినగర్‌లో తల్లితో పాటు ఉంటూ స్థానిక పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. బాలుడి తల్లి.. తండ్రితో విడిపోయి గత ఆరేళ్లుగా బిహార్‌కు చెందిన మహమ్మద్ ఆలంతో కలిసి ఉంటోంది. అతను మూసాపేటలోని ప్రగతినగర్‌లో నివాసముంటూ ఫ్యాబ్రికేషన్ పనులు చేస్తుంటాడు.
ఈ క్రమంలో బాలుడిని బాగా చదువుకోవాలని, ఆటలాడవద్దని తండ్రి మందలించటంతో ఇంటి నుంచి పారిపోవాలని, ఇంట్లో ఉన్న బ్యాగులో బట్టలు, డబ్బు తీసుకుని బయటకు వచ్చాడు. మూసాపేట మెట్రో స్టేషన్ వద్ద ఉండగా బాలుడి బ్యాగ్‌ను తనిఖీ చేయగా బుల్లెట్ కనిపించింది. సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై వెంటనే కూకట్‌పల్లి పోలీసులకు సమాచారం ఇవ్వటంతో పోలీసులు బాబును స్టేషన్‌కు తీసుకువెళ్లారు.
అక్కడ సమాచారం రాబట్టగా ఇళ్లు వదిలి పెట్టి బయటకు వెళ్లిపోతున్నానని, బ్యాగులో బట్టలు, డబ్బులు తీసుకుని వెళుతున్నానని, తనకేమీ తెలియదన్నాడు. తల్లిదండ్రుల వివరాలు చెప్పటంతో ప్రగతినగర్‌కు వెళ్లి విచారించగా... మహమ్మద్ ఆలం తాత అన్సారీ ఆర్మీలో పనిచేసే వారని, తను చనిపోయినప్పటికి ఆయన బుల్లెట్ అలాగే ఉందని, ఇటీవల బిహార్‌కు వెళ్లినప్పుడు బుల్లెట్‌ను శుభ్రం చేసి జ్ఞాపకంగా పర్సులో దాచుకున్నానని తెలిపాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 9 ఎంఎం కేట్రిడ్జ్ బుల్లెట్‌గా పోలీసులు అనుమానిస్తున్నారు.