పుట్టు మచ్చలతో జాతకాలు మారుస్తామంటూ.. నగ్న చిత్రాలు సేకరించిన ముఠా | Sakshi
Sakshi News home page

పుట్టు మచ్చలతో జాతకాలు మారుస్తామంటూ.. నగ్న చిత్రాలు సేకరించిన ముఠా

Published Wed, Feb 22 2023 5:07 AM

Jadcherla Police Accused Two In Custody Over Taking Nude Pictures - Sakshi

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: ‘హస్తరేఖ­లు, పుట్టు మచ్చల ఆధారంగా ఉన్నది ఉన్న ట్లు చెబుతాం.. మీరు కోరినట్లుగా జా­త­కం మారుస్తాం.. ఆ తర్వాత మీరు అను­కున్నది జరుగుద్ది.. కనకవర్షం కురిపిస్తాం’ అంటూ మహిళలకు పలువురు జ్యోతిష్కులు మాయ మాటలు చెప్పి  నగ్న చిత్రాలు సేకరించారు. ఈ ఉదంతం మహబూబ్‌నగర్‌ జిల్లాలో వెలుగు చూడగా.. తవ్విన కొద్దీ వారి  లీలలు బయటకు వస్తున్నాయి.

ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో..
మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల, నాగర్‌క­ర్నూల్‌ జిల్లా తిమ్మాజిపేట మండలంలోని కోడుపర్తి, వికారాబాద్‌ జిల్లా ఆమన్‌గల్, రంగారెడ్డి జిల్లాలో కొందరు జ్యోతిష్కులు జ్యోతిష్యకేంద్రాలు తెరిచారు. తమ దగ్గరికి వస్తే మంచి జరుగుతుందంటూ తెలిసిన వారి నుంచి విస్తృత ప్రచారం చేపట్టారు. పూలు, పండ్లు, కూరగాయలు విక్రయించే  మహిళలకు వల వేశారు.

శరీరంపై పుట్టుమచ్చలను తాము స్వయంగా చూసి గుర్తిస్తే జాతకం పక్కాగా ఉంటుందని చెప్పారు. ఫొటోలను పైకి పంపిస్తామని.. అక్కడ అమ్మ వారికి పూజలు చేస్తారని.. మీకు అమ్మవారి పూనకం వస్తుందని.. ఆతర్వాత కనక వర్షం కురుస్తుందనీ.. అప్పుడే మాకు కొంత ముట్టజెప్పాలని మాయమాటలు చెప్పి నమ్మబలికారు. అలా కొంతమంది మహిళల వద్ద న్యూడ్‌ ఫొటోలను సేకరించినట్లు సమాచారం.  బాధితుల్లో కొందరు మగవారు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

బ్లాక్‌ మెయిల్‌తో బయటికొచ్చిన బాగోతం
జాతకం పేరిట న్యూడ్‌ఫొటోలు సేకరించి­న అక్రమార్కులు చివరికి బ్లాక్‌మెయి­లిం­గ్‌కు పాల్పడిన క్రమంలో వారి బాగో­తం బట్టబయలైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేయ­గా, విచారణ చేపట్టిన  ఖాకీలు జైను­ద్దీన్, రాములు అనే ఇద్దరిని అదుపులోకి తీసు­కు­న్నట్లు సమాచారం. వారిని విచారించిన క్రమంలో తిరుపతి, శంకర్‌ పేర్లు వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. వీరిని పట్టుకునేందుకు ఓ పోలీస్‌ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. పూర్తి విచారణ తర్వాతే వివరాలు వెల్లడిస్తామని పోలీసు అధికారులు చెబుతున్నారు. 

Advertisement
 
Advertisement