చిన్నారుల్ని విక్రయించే ఆస్పత్రి గుట్టు రట్టు

Hospital is Selling babies in Visakhapatnam - Sakshi

విశాఖ కేంద్రంగా పసికందుల విక్రయం

ఆస్పత్రి ఎండీ, మరో డాక్టర్, ఇద్దరు ఆశా వర్కర్లు సహా 8 మంది అరెస్ట్‌  

సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం కేంద్రంగా పసికందులను విక్రయిస్తున్న ఆస్పత్రి గుట్టును నగర పోలీసులు రట్టు చేశారు. నగరంలోని జిల్లా పరిషత్‌ జంక్షన్‌ ప్రాంతంలో యూనివర్సల్‌ సృష్టి ఆస్పత్రి ఎండీ పచ్చిపాల నమ్రత ప్రధాన సూత్రధారిగా గుర్తించారు. నమ్రతను ఆమెకు సహకరించిన మరో వైద్యురాలు తిరుమల,  ఆశా వర్కర్లు కోడి వెంకటలక్ష్మి, బొట్టా అన్నపూర్ణ, పసికందును కొనుగోలు చేసిన తల్లిదండ్రులతోపాటు మరో ఇద్దరిని ఆదివారం అరెస్ట్‌ చేశారు. దీనికి సంబంధించి నగర పోలీస్‌ కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ తెలిపిన వివరాలివీ.. (ఆస్పత్రి మాటున అరాచకం)

► విశాఖ జిల్లా వి.మాడుగుల మండలం కానికారమాత కాలనీకి చెందిన జలుమూరి సుందరమ్మ(34) అనే మహిళకు భర్త చనిపోయాడు. మరొకరితో సంబంధం కారణంగా ఆమె గర్భం దాల్చింది.
► ఈ విషయం తెలుసుకున్న అదే మండలానికి చెందిన ఆశా కార్యకర్తలు, ఏజెంట్‌ అర్జి రామకృష్ణ  సుందరమ్మను కలిసి ఉచితంగా డెలివరీ చేయిస్తామని, పసికందును ఇచ్చేస్తే కొంత డబ్బు కూడా ఇస్తామని చెప్పారు.
► సుందరమ్మ అంగీకరించడంతో ఆమెను ఈ ఏడాది మార్చి 9న యూనివర్సల్‌ సృష్టి హాస్పిటల్‌లో చేర్చగా.. అదే రోజు మగబిడ్డకు జన్మనిచ్చింది.  
► ఆమెను డిశ్చార్జ్‌ చేసి ఇంటికి పంపించేసిన తరువాత ఆస్పత్రి ఎండీ నమ్రత ఆ బిడ్డను పశ్చిమ బెంగాల్‌కు చెందిన దంపతులకు విక్రయించారు.
► సుందరమ్మ గర్భవతిగా ఉండగా వి.మాడుగుల మండలంలో ఐసీడీఎస్‌ ద్వారా పౌష్టికాహారం పొందేది. అక్కడి అంగన్‌వాడీ టీచర్‌ సరోజినికి సుందరమ్మ బిడ్డ విషయమై అనుమానం వచ్చి మార్చి 14న చైల్డ్‌లైన్‌కు సమాచారం ఇచ్చింది. 
► చైల్డ్‌లైన్‌ సిబ్బంది విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడింది. దీంతో ముఠా సభ్యులు విక్రయించిన పసికందును మార్చి 20న వెనక్కి తీసుకొచ్చి శిశు గృహలో చేర్పించారు. 
► అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయగా పసికందుల విక్రయాల వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
► డాక్టర్‌ నమ్రతను కర్ణాటక రాష్ట్రంలోని దేవనగిరిలో అరెస్ట్‌ చేశామని, ఏజెంట్‌ అర్జి రామకృష్ణ, బిడ్డను కొనుగోలు చేసిన దంపతులతోపాటు ముఠాలో మిగిలిన నలుగురినీ అరెస్ట్‌ చేశామని పోలీస్‌ కమిషనర్‌ చెప్పారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top