ఏ కేసులోనూ అరెస్టు చేయొద్దని ఎలా ఆదేశిస్తారు ?

High Court Asking How To Order Not To Be Arrested In Any Case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పలువురిని మోసం చేశాడంటూ నమోదైన కేసుల్లో శ్రీధర్‌ కన్వెన్షన్‌ ఎండీ ఎస్‌.శ్రీధర్‌రావు ఆయన భార్య సంధ్యలను హైదరాబాద్, సైబరాబాద్‌ పరిధిలో నమోదైన ఏ కేసులోనూ అరెస్టు చేయరాదంటూ సింగిల్‌ జడ్జి జారీచేసిన ఉత్తర్వులపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌ చంద్ర నేతృత్వంలోని ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. తమను మోసం చేశాడంటూ అనేక మంది వీరిపై ఫిర్యాదు చేస్తున్నారని, ఇటువంటి ఉత్తర్వులు జారీ చేయడం పోలీసుల దర్యాప్తును అడ్డుకోవడమేనని వ్యాఖ్యానించింది.

శ్రీధర్‌రావు, సంధ్యలపై ఎన్ని కేసులు నమోదయ్యాయి, దర్యాప్తు పురోగతి ఏంటో తెలియజేస్తూ నివేదిక సమర్పించాలని హోంశాఖను ఆదేశించింది. క్రిమినల్, సివిల్, వాణిజ్య వివాదాల్లో శ్రీధర్‌రావు, సంధ్యలను అరెస్టు చేయరాదంటూ సింగిల్‌ జడ్జి జారీ చేసిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ మణికొండకు చెందిన ఖుషిచంద్‌ వడ్డె దాఖలు చేసిన అప్పీల్‌ను ధర్మాసనం సోమవారం విచారించింది. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని శ్రీధర్‌రావు, సంధ్యలను గతంలో ఆదేశించినా స్పందించకపోవడంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. వివరణ ఇచ్చేందుకు గడువు కావాలని వీరి తరఫు సీనియర్‌ న్యాయవాది ఎంఎస్‌ ప్రసాద్‌ అభ్యర్థించడంతో ఒక రోజు గడువునిస్తూ విచారణను ధర్మాసనం మంగళవారానికి వాయిదా వేసింది.     

(చదవండి: ఆఫ్‌లు ఆఫయ్యాయి!)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top