అంత్యక్రియలకు వెళ్లి వస్తూ..

Four police constables deceased in road accident Andhra Pradesh - Sakshi

నలుగురు పోలీసులు దుర్మరణం

లారీని ఢీకొన్న ఎస్కార్ట్‌ వాహనం

పలాసలో ఘోర ప్రమాదం

సీఎం వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి

విచారం వ్యక్తం చేసిన గవర్నర్‌

కాశీబుగ్గ/మందస/అమరావతి: ఆకస్మికంగా మరణించిన ఓ జవాన్‌ అంత్యక్రియలకు హాజరై తిరిగి వస్తుండగా చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ పోలీసులు దుర్మరణం పాలయ్యారు. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రంగోయి–సుమ్మాదేవి జంక్షన్‌ వద్ద జాతీయ రహదారిపై సోమవారం ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మందస మండలం భైరిసారంగపురం గ్రామానికి చెందిన గేదెల జయరామ్‌ కోల్‌కతాలోని ఆర్మీ రెజిమెంట్‌లో హవల్దార్‌గా పనిచేస్తూ ఆదివారం ఆకస్మికంగా మరణించారు. ఆయన మృతదేహాన్ని సోమవారం ఉదయం విశాఖకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో శ్రీకాకుళం సరిహద్దుకు తీసుకొచ్చిన భౌతికకాయానికి రక్షణగా ఏఆర్‌ ఎస్‌ఐ జమినవలస కృష్ణుడు (58), హెడ్‌ కానిస్టేబుళ్లు యెండ బాబూరావు (53), టింగ ఆంటోనీ (50), కానిస్టేబుల్‌ (డ్రైవర్‌) పైడి జనార్దన్‌ (47) బొలెరో వాహనంలో బయలుదేరారు.

మధ్యాహ్నం భైరిసారంగపురంలో జవాన్‌ కుటుంబ సభ్యులకు అతడి భౌతికకాయాన్ని అప్పగించారు. అంత్యక్రియలు ముగిసిన అనంతరం ఎచ్చెర్లకు బొలెరో వాహనంలో తిరుగు ప్రయాణం కాగా.. పలాస మండలంలోని రంగోయి–సుమ్మాదేవి జంక్షన్‌ వద్ద వాహనం ఒక్కసారిగా డివైడర్‌ను ఢీకొని అవతల రోడ్డుపైకి దూసుకుపోయింది. అదే సమయంలో చెన్నై నుంచి కోల్‌కతా వైపు వెళ్తున్న లారీ ముందు భాగాన్ని బలంగా ఢీకొంది. ఈ ఘటనలో నలుగురు పోలీసులూ అక్కడికక్కడే మరణించారు. కొన ఊపిరితో ఉన్న ఓ కానిస్టేబుల్‌ను రక్షించేందుకు స్థానికులు ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. పోలీసుల వాహనం ముందుభాగం నుజ్జునుజ్జు కావడంతో మృతదేహాలను బయటకు తీయడం కష్టమైంది. 108, నేషనల్‌ హైవే అంబులెన్స్‌ సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నలుగురి మృతదేహాలను బయటకు తీసి పలాస సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఘటనా స్థలానికి ఎస్పీ అమిత్‌ బర్దార్‌ చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

సీఎం జగన్‌ దిగ్భ్రాంతి
ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులపై ఆరా తీసిన సీఎం మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఘటనపై స్పీకర్‌ తమ్మినేని సీతారామ్, డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, హోం మంత్రి మేకతోటి సుచరిత, మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు, ఎంపీ వి.విజయసాయిరెడ్డి, డీజీపీ గౌతమ్‌సవాంగ్‌ విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంపై దర్యాప్తు జరిపి నివేదిక సమర్పించాలని డీజీపీ ఆదేశించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల కుటుంబాలకు ప్రభుత్వం, పోలీస్‌ శాఖ అండగా ఉంటాయని హోం మంత్రి సుచరిత, డీజీపీ సవాంగ్‌ భరోసా ఇచ్చారు.

గవర్నర్‌ విచారం
రోడ్డు ప్రమాదంలో నలుగురు పోలీసులు మృతి చెందడంపై గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top