ఇంజక్షన్లు విక్రయిస్తున్న నలుగురి అరెస్ట్‌

Four arrested for selling Fake Remdesivir injections - Sakshi

రెమ్‌డెసివిర్‌ అసలు, నకిలీవి అమ్ముతున్న నిందితులు

వీరిలో ఒకరు మంగళగిరి ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రి వైద్యుడు

విజయవాడ స్పోర్ట్స్‌: కరోనా చికిత్సకు ఉపయోగించే రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లను అమ్ముతున్న ఇద్దరిని, నకిలీ రెమ్‌డిసివిర్‌ను విక్రయిస్తున్న ఇద్దరిని విజయవాడ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను నగర పోలీస్‌ కమిషనర్‌ బత్తిన శ్రీనివాసులు వెల్లడించారు. సూర్యారావుపేటలోని యూనియన్‌ ఆస్పత్రి కోవిడ్‌ వార్డులో టెక్నీషియన్‌ షేక్‌ నజీర్‌బాషా, స్టాఫ్‌ నర్స్‌ పుష్పలత ఆస్పత్రిలో మిగిలిన రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లను చిట్టినగర్‌ మిల్క్‌ ప్రాజెక్ట్‌ వద్ద విక్రయిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. వీరు పనిచేస్తున్న ఆస్పత్రిలో తెనాలికి చెందిన వ్యక్తి కోవిడ్‌ చికిత్స పొందుతూ మృతిచెందాడని, అతడి చికిత్సకు తీసుకురాగా మిగిలిన మూడు ఇంజక్షన్లను అక్రమమార్గంలో రూ.1.10 లక్షలకు అమ్ముతుండగా పట్టుకున్నట్లు చెప్పారు. వీరిని విచారణ కోసం టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించినట్లు తెలిపారు. నిందితుడు షేక్‌ నజీర్‌బాషా అజిత్‌సింగ్‌నగర్‌లో ఆర్‌ఎంపీ వైద్యుడుగా పనిచేస్తున్నట్లు చెప్పారు.

నకిలీ ఇంజక్షన్లు కొని అమ్ముతున్న వైద్యుడు
రెమ్‌డెసివిర్‌ను పోలిన ఇంజక్షన్‌ను సితార సెంటర్‌ వద్ద విక్రయిస్తున్న డాక్టర్‌ ఆత్మకూరి భానుప్రతాప్, పసుపులేటి వీరబాబులను అరెస్టు చేసినట్లు సీపీ తెలిపారు. ఈ కేసులో మరో నిందితుడు పవన్‌ను అరెస్ట్‌ చేయాల్సి ఉందన్నారు. హైదరాబాద్‌లో ఉండే పవన్‌ నుంచి మంగళగిరి ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రిలో డ్యూటీ డాక్టర్‌ భానుప్రతాప్‌ నాలుగు నకిలీ రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లను రూ.52 వేలకు కొనుగోలు చేసి, విద్యాధరపురానికి   చెందిన మెడికల్‌ రిప్రజెంటేటివ్‌ వీరబాబుకు రూ.1.08 లక్షలకు విక్రయించాడని చెప్పారు. వీరబాబు ఈ మందులను సితార సెంటర్‌ వద్ద రూ.1.44 లక్షలకు విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. నిందితులను భవానీపురం పీఎస్‌కు తరలించినట్లు చెప్పారు. నిందితులను అరెస్ట్‌ చేసిన టాస్క్‌ఫోర్స్‌ ఏడీసీపీ కె.శ్రీనివాసరావు, ఏసీపీలు జి.వి.రమణమూర్తి, వి.ఎస్‌.ఎన్‌.వర్మ, సీఐ కృష్ణమోహన్‌లను సీపీ అభినందించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top