వివాహేతర సంబంధం.. మాజీ నక్సలైట్‌ దారుణ హత్య

Ex Naxalite Assassinated By Friends Nalgonda - Sakshi

సాక్షి, నల్గొండ: మాజీ నక్సలైట్‌ దారుణ హత్యకు గురయ్యాడు. స్నేహితులే హంతకులయ్యారు. శరీరం నుంచి తలను వేరుచేసి అతి కిరాతకంగా హత్య చేసి గోతిలో పూడ్చిపెట్టారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా పీఏపల్లి మండలం, వద్దిపట్లకు చెందిన నామ శ్రీనివాస్‌(38), ఆదిబట్ల మున్సిపల్‌ సమీపంలోని బొంగ్లూర్‌ వద్ద మెట్రోసిటీ కాలనీలో నివాసం ఉంటున్నాడు.

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శ్రీనివాస్‌ భార్య కవిత 16 ఏళ్ల క్రితమే మృతిచెందింది. ప్రస్తుతం ఆయన మరో మహిళతో సహజీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో శ్రీనివాస్‌ రెండు నెలలుగా కనిపించకకుండా పోయాడు. ఈ విషయాన్ని సదరు మహిళ తమ బంధువులకు సమాచారం ఇచ్చింది. డిసెంబర్‌ 14న శ్రీనివాస్‌ తండ్రి, కుటుంబ సభ్యులు ఆదిబట్ల పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు.

నవంబర్‌ 12న హత్య 
రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసే శ్రీనివాస్‌కు ఎల్‌బీనగర్‌లో స్నేహితులు ఉన్నారు. వీరిలో బ్రహ్మచారి, నరేష్, రాజమ్మ (ట్రాన్స్‌జెండర్‌)తో ఎక్కువగా కలిసి ఉండేవాడు. బ్రహ్మచారి నకిలీ బంగారం వ్యాపారం చేస్తుండే వాడు. అతనిపై ఎల్‌బీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు ఉంది. బ్రహ్మచారి పోలీసుల కంట పడకుండా.. శ్రీనివాస్‌ మెట్రోసిటీలో ఓ గది అద్దెకు ఇప్పించి దాచిపెట్టాడు. బ్రహ్మచారితో ఉంటున్న స్వాతి ఫోన్‌ నంబర్‌ తెలుసుకుని శ్రీనివాస్‌ స్నేహం చేశాడు.

ఎలాగైనా ఆమెను లోబర్చుకోవాలని భావించాడు. బ్రహ్మచారి ఉంటున్న సమాచారాన్ని ఎల్‌బీనగర్‌ పోలీసులకు అందజేశాడు. వారు బ్రహ్మచారిని అరెస్టు చేయించి, జైలుకు పంపించారు. ఆ తర్వాత స్వాతికి దగ్గరైన శ్రీనివాస్‌ ఆమెతో సహజీవనం సాగించాడు. జైలుకు వెళ్లిన 18 రోజుల తర్వాత బ్రహ్మచారి బయటకు వచ్చాడు. అతనికి స్వాతి జాడ తెలియలేదు. శ్రీనివాస్‌ వద్ద ఉందని నరేష్, రాజమ్మ చెప్పారు. అప్పటికే స్వాతి బంగారాన్ని బ్రహ్మచారి దొంగిలించాడని శ్రీనివాస్‌ అతనిపై మరో కేసు పెట్టించాడు. బ్రహ్మచారి జైల్లో ఉన్న సమయంలో నరేష్‌తో మద్యం తాగిన శ్రీనివాస్‌ ఎలాగైనా బ్రహ్మచారిని హత్యచేస్తానని నరేష్‌తో చెప్పాడు. ఈ విషయాన్ని నరేష్‌.. బ్రహ్మచారితో చెప్పాడు. దీంతో రగిలిపోయిన అతడు శ్రీనివాస్‌ హత్యకు పథకం వేశాడు. 

మద్యం తాగించి..
నవంబర్‌ 12న నరేష్, బ్రహ్మచారి, రాజమ్మ కలిసి శ్రీనివాస్‌ని మట్టుబెట్టాలని చూశారు. హైదరాబాద్‌ నుంచి శ్రీనివాస్‌ కారులో బయలుదేరారు. బీఎన్‌రెడ్డి వద్దకు వచ్చి వైన్స్‌లో మద్యం కొనుగోలు చేసి మెట్రోసిటీకి వచ్చి తాగారు. ఔటర్‌ పక్కన ఆటవీ ప్రాంతం వద్దకు రాగానే.. కారులో కూర్చున్న శ్రీనివాస్‌ మెడకు వెనక సీటు నుంచి బ్రహ్మచారి క్లచ్‌వైర్‌ బిగించాడు. నరేష్, రాజమ్మ కాళ్లూ చేతులు పట్టుకున్నారు. శ్రీనివాస్‌ చనిపోగానే మృతదేహాన్ని ఆడవిలోపలికి తీసుకెళ్లి, గుంత తవ్వి కప్పేశారు.

అంతకు మందు బ్రహ్మచారి.. శ్రీనివాస్‌ తలను కత్తితో నరికి వేరు చేశాడు. తలను తీసుకెళ్లిన నరేష్‌ ఎక్కడో పాతిపెట్టాడు. హత్య జరిగిన 45 రోజులకు విషయం వెలుగులోకి వచ్చింది. బ్రహ్మచారి పాత కేసులో అరెస్టు కాగా ఎల్‌బీనగర్‌ పోలీసుల విచారణలో నేరం ఒప్పుకున్నాడు.  గోతిలో పాతి పెట్టిన శ్రీనివాస్‌ మొండాన్ని బయటకు తీశారు.  పంచనామా అనంతరం తిరిగి పూడ్చివేశారు. బ్రహ్మచారి ఇప్పటికే పోలీసుల అదుపులో ఉండగా నరేష్, రాజమ్మ పరారీలో ఉన్నట్లు ఏసీపీ బాలకృష్ణారెడ్డి తెలిపారు. కాగా, తన తండ్రి హత్య ఘటనలో బల్వంతయ్య అనే సీఐపై అనుమానం ఉందని, ఆయన్ని విచారించాలని శ్రీనివాస్‌ కుమారుడు గోపీ, కుటుంబ సభ్యులు చెప్పారు.

చదవండి: ఏడాది సహజీవనం.. మోజు తీరాక.. ప్లేటు ఫిరాయించి..

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top