రెమ్‌డెసివిర్‌ మాఫియా ముఠా గుట్టు రట్టు

Eluru police have nabbed another gang who was bypassing Remdesivir injections - Sakshi

10 మంది ఆస్పత్రి సిబ్బంది అరెస్టు

ఏలూరు టౌన్‌: కోవిడ్‌ బాధితుల అత్యవసర వైద్యానికి వినియోగిస్తున్న రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లను పక్కదారి పట్టిస్తున్న మరో ముఠాను ఏలూరు పోలీసులు పట్టుకున్నారు. ఇప్పటికే నాలుగు ముఠాలను అరెస్టు చేయగా తాజాగా ఏలూరులోని ఆశ్రం కోవిడ్‌ ఆస్పత్రికి చెందిన 10 మంది సిబ్బందిని బుధవారం అరెస్టు చేశారు. ఏలూరు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఎస్పీ కె.నారాయణనాయక్‌ బుధవారం వివరాలు వెల్లడించారు. ఏలూరు ఆశ్రం కోవిడ్‌ హాస్పిటల్‌లో ముగ్గురు స్టాఫ్‌ నర్సులు, నలుగురు టెక్నీషియన్లు, ముగ్గురు సిబ్బంది ముఠాగా ఏర్పడి రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లను దారి మళ్లిస్తున్నారు.

బయట మార్కెట్‌లో ఒక్కో ఇంజెక్షన్‌ను రూ.15 వేలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ కేసులో ఏలూరు కొత్తపేట నూకాలమ్మ గుడి ప్రాంతానికి చెందిన స్టాఫ్‌నర్స్‌ వేల్పూరి రేఖాదేవి, పెదవేగికి చెందిన స్టాఫ్‌నర్స్‌ గారపాటి సులోచన, దెందులూరుకు చెందిన స్టాఫ్‌నర్స్‌ చిగురుపల్లి అరుణ, ఏలూరు వెంకటాపురం చెంచుకాలనీకి చెందిన వార్డ్‌బాయ్‌ నకినాల రమేష్, ఏలూరు తంగెళ్లమూడి బీడీ కాలనీకి చెందిన డయాలసిస్‌ టెక్నీషియన్‌ గూడపాటి రాజేష్, ఏలూరు వెంకటాపురం రామానగర్‌ కాలనీకి చెందిన డయాలసిస్‌ టెక్నీషియన్‌ కెల్లా పూర్ణచంద్రరావు, ఏలూరు జాలిపూడికి చెందిన డయాలసిస్‌ టెక్నీషియన్‌ డొల్ల సుధాకర్, ఏలూరు తంగెళ్లమూడికి చెందిన కార్డియాలజీ టెక్నీషియన్‌ గూడపాటి సురేష్, ఏలూరు కంకణాలవారి వీధికి చెందిన సెక్యూరిటీ గార్డ్‌ కడగాల అనురాధ, ఏలూరు పవర్‌పేట గంగానమ్మగుడి ప్రాంతానికి చెందిన శీలవలస రమణను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 27 రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లు, రెమ్‌డెసివిర్‌ ఖాళీ వయల్స్‌ 15, రూ.1.45 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top