‘స్కూల్ గ్యాంగ్ వార్’.. విద్యార్థి తలలోకి దిగిన బుల్లెట్‌! | Delhi Schoolboy Shot in Amar Colony Over Heated Argument Critical Condition | Sakshi
Sakshi News home page

‘స్కూల్ గ్యాంగ్ వార్’.. విద్యార్థి తలలోకి దిగిన బుల్లెట్‌!

May 27 2026 10:02 AM | Updated on May 27 2026 10:10 AM

Delhi Schoolboy Shot in Amar Colony Over Heated Argument Critical Condition

న్యూఢిల్లీ: దక్షిణ ఢిల్లీలోని అమర్ కాలనీలో మంగళవారం సాయంత్రం జరిగిన కాల్పుల ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలను సృష్టించింది. ఒక ప్రముఖ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థి, తన స్నేహితురాలితో కలిసి ఆహారం తింటుండగా, గుర్తుతెలియని వ్యక్తులు అతడి తలపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో బాలుడి మెదడులోకి ఒక బుల్లెట్ దూసుకుపోయినట్లు వైద్యులు గుర్తించారు.

చిన్నపాటి ఘర్షణతో మొదలై..
ఆహారం తీసుకుంటున్న విద్యార్థిని పక్కనే ఉన్న మరో బృందం ఉద్దేశపూర్వకంగా తాకడంతో వివాదం మొదలైంది. కొద్దిసేపు వాగ్వాదం జరిగిన తర్వాత ఆ బృందం అక్కడి నుండి వెళ్లిపోయింది. అనంతరం తిరిగి వచ్చి తుపాకీతో కాల్పులు జరపడంతో కలకలం చెలరేగింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం నిందితులు అత్యంత సమీపం నుండి కాల్పులు జరిపి, అక్కడి నుండి పరారయ్యారు.

చికిత్స కోసం ఎయిమ్స్‌కు తరలింపు
కాల్పుల అనంతరం తీవ్ర రక్తస్రావం అవుతున్న బాధితుడిని వెంటనే మూల్‌చంద్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో, మెరుగైన వైద్యం కోసం అక్కడి నుండి ఎయిమ్స్ ట్రామా సెంటర్‌కు తరలించారు. ప్రస్తుతం బాధితుడు మృత్యువుతో పోరాడుతున్నాడని వైద్యులు పేర్కొన్నారు. ఈ ఘటన వెనుక ఉన్న నిందితులు కూడా విద్యార్థులేనని, ప్రేమ వ్యవహారమే ఈ ఘర్షణకు అసలు కారణమని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.

పోలీసుల గాలింపు ముమ్మరం
ఘటన జరిగిన వెంటనే రంగంలోకి దిగిన స్థానిక పోలీసులు, ఎస్‌హెచ్ఓ,  ఏసీపీ బృందాలు ఆధారాల కోసం గాలింపు చేపట్టాయి. ఘటనా స్థలంలోని సీసీటీవీ పుటేజీలను పరిశీలిస్తున్న పోలీసులు, నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. నిందితులు పరారీలో ఉండటంతో, వారి కోసం నగరం అంతటా ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టినట్లు ఉన్నతాధికారులు ప్రకటించారు. దర్యాప్తు కొనసాగుతోంది.

ఇది కూడా చదవండి: బెంగళూరులో ఎబోలా కలకలం.. ఐసోలేషన్‌కు మహిళ తరలింపు

Advertisement
 
Advertisement
Advertisement