బెంగళూరులో ఎబోలా కలకలం.. ఐసోలేషన్‌కు మహిళ తరలింపు | Ebola Scare in Bengaluru Ugandan National Isolated at Airport | Sakshi
Sakshi News home page

బెంగళూరులో ఎబోలా కలకలం.. ఐసోలేషన్‌కు మహిళ తరలింపు

May 27 2026 9:17 AM | Updated on May 27 2026 10:04 AM

Ebola Scare in Bengaluru Ugandan National Isolated at Airport

బెంగళూరు: ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్న ఎబోలా వైరస్ ఇప్పుడు బెంగళూరును కలవరపెడుతోంది. ఉగాండా నుంచి వచ్చిన 28 ఏళ్ల మహిళకు ఎబోలా లక్షణాలు ఉన్నాయన్న అనుమానంతో అధికారులు ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో నగరంలో ఆరోగ్య శాఖ హై అలర్ట్ ప్రకటించింది.

విమానాశ్రయంలో ఏం జరిగింది?
మే 23న కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఉగాండా మహిళలో అలసట, నీరసం వంటి లక్షణాలను ఎయిర్‌పోర్ట్ హెల్త్ ఆర్గనైజేషన్ గుర్తించింది. ముందుజాగ్రత్తగా ఆమెను వెంటనే ఇందిరానగర్‌లోని ఎపిడెమిక్ డిసీజెస్ ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నప్పటికీ, వైద్యులు ఆమెను పర్యవేక్షిస్తున్నారు.

పుణె ల్యాబ్‌కు నమూనాలు
బాధిత మహిళ నుంచి సేకరించిన నమూనాలను పరీక్షల కోసం పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి (ఎన్‌ఐవీ)కి పంపారు. ఎబోలా నిర్ధారణ కోసం ప్రోటోకాల్ ప్రకారం రెండోసారి కూడా పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఆమె విమానాశ్రయం నుంచి నేరుగా ఒక హోటల్‌లో బస చేసినప్పటికీ, ఒళ్లు నొప్పులు రావడంతో వెంటనే క్వారంటైన్‌కు తరలించినట్లు సమాచారం.

హై అలర్ట్‌లో కర్ణాటక
ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వ్యాప్తి నేపథ్యంలో, కర్ణాటక ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఎబోలా ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చిన వారు 21 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండాలని సూచించింది. ఇందుకోసం బెంగళూరులోని రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చెస్ట్ డిసీజెస్, ఇందిరానగర్ ఆసుపత్రులతో పాటు మంగళూరులో ప్రత్యేక ఐసోలేషన్ కేంద్రాలను సిద్ధం చేశారు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లను రంగంలోకి దించారు.

Advertisement
 
Advertisement
Advertisement