
చిన్నపాటి గొడవలు.. ఆపై క్షణికావేశ హత్యలు. దీనికి అన్నింటికీ కారణం అహం. మనలోని అహం మనల్ని మనిషిగా నాశనం చేయడమే కాదు.. మన కోసం వచ్చిన వారిని కూడా దూరం చేస్తుంది. సర్దుకుపోదాం.. ఉన్నంతలో బతుకుదాం అనే ఆలోచన నేటి తరంలో చాలా అరుదుగా కనిపిస్తున్నట్లే ఉంది. భర్త చెప్పిన మాట వినలేదని భార్య, తన మాట భర్త వినలేదని భార్య.. ఇలా ఏదొక సందర్భాన్ని ఆసరాగా ఘర్షణలు పడటం జీవితాలను చిన్నాభిన్నం చేసుకోవడం ఇప్పుడు పరిపాటిగా మారిపోయింది.
ఇలా భార్యతో గొడవపడిన ఓ వ్యక్తి ప్రస్తుతం ఊచలు లెక్కపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. అది అర్థం పర్థం లేని గొడవ. కొడుకు బర్త్ డే గిఫ్ట్ విషయంలో గొడంపడ్డ భర్త.. భార్యను హత్య చేశాడు. ఆపై తన అత్తను కూడా పొట్టనుపెట్టుకున్నాడు.
ఢిల్లీలోని రోహిణి సెక్టార్-17లో యోగేష్ సెహగాల్ అనే వ్యక్తి.. తన కుమారుడు బర్త్ డే విషయంలో భార్య ప్రియా సెహగాల్(34)తో గొడవ పడ్డాడు. కుమారుడు బర్త్ డే ముందస్తు ఏర్పాట్లులో భాగంగా భార్యతో ఘర్షణ పడ్డాడు. దాన్ని సర్దిచెప్పడానికి అత్త కుసుమ్ సిన్హా(63) కూతురి ఇంటికి వచ్చింది. ఆమెతో పాటు కొడుకు, అంటే యోగేష్‌కు బావమరిది మేఘ్ సిన్హా కూడా వచ్చాడు.
అక్కడ అల్లుడిని ఏదో రకంగా ఒప్పించింది అత్త. అయితే అక్కడ మేఘ్ ఉండటంతో ఆ సమయంలో యోగేష్ పెద్దగా ఏమీ మాట్లాడకుండానే రాజీ పడ్డాడు. మనసులో మాత్రం అక్కసును పెట్టుకున్నాడు. మేఘ్ సిన్హా వెళ్లిపోవడంతో మళ్లీ గొడవ ప్రారంభించాడు. ఈ క్రమంలోనే భార్య కూడా తల్లిని వెనకేసుకొచ్చింది. దాంతో భార్యను, అత్తను చంపేశాడు.
మేఘ్.. తల్లితో మాట్లాడదామని ఫోన్ చేశాడు. తల్లి ఫోన్ ఎత్త లేదు.. అక్కకు చేశాడు.. అక్క కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దాంతో అనుమానం వచ్చిన మేఘ్.. తిరిగి మళ్లీ ఘటనా స్థలికి వచ్చేసరికి తలుపులు లాక్ చేసి ఉన్నాయి. అనుమానంతో పోలీసులకు కాల్ చేయడంతో వారు డోర్స్ ఓపెన్ చేశారు. తల్లి, అక్క ఒక రూమ్‌లో పడి ఉండటంతో బావ హత్య చేశాడనే విషయం అర్థమైంది. దీనిపై ఫిర్యాదుతో యోగేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. చిన్నపాటి బర్త్ డే గొడవతో ఇలా జంట హత్యలు చేశాడని పోలీసులు పేర్కొన్నారు. ప్రస్తుతం యోగేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన రెండురోజుల క్రితం జరగ్గా ఆలస్యంగా వెలుగుచూసింది.