కారుతో ఢీకొట్టి.. కత్తులతో పొడిచి..

Crime News: Advocate Stabbed To Death In Mulugu District - Sakshi

ములుగు జిల్లా పందికుంట స్టేజీ వద్ద న్యాయవాది దారుణ హత్య

ములుగు రూరల్‌: మైనింగ్‌ వ్యాపారం చేసే ఓ న్యాయవాది దారుణంగా హత్యకు గురయ్యాడు. కొందరు దుండగులు నడిరోడ్డుపై వెంబడించి మరీ కత్తులతో పొడిచి చంపేశారు. ములుగు జిల్లా భూపాల్‌నగర్‌ (పందికుంట) స్టేజీ వద్ద సోమవారం రాత్రి 7 గంటల సమయంలో ఈ దారుణ ఘటన జరిగింది.  మైనింగ్‌కు సంబంధించిన భూ వివాదాలే ఈ హత్యకు కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కారును వెనుక నుంచి ఢీకొట్టి..
జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రానికి చెందిన మాడగుండ్ల మల్లారెడ్డి (54) కొన్నేళ్లుగా హనుమకొండ బాల సముద్రం ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ఆయనకు ములుగు జిల్లా మల్లంపల్లిలో పెట్రోల్‌ బంక్, మైనింగ్‌ వ్యాపారం ఉన్నాయి. వ్యాపార పనుల నిమిత్తం ఆయన తరచూ మల్లంపల్లికి వచ్చి వెళ్తుంటారు. సోమవారం సాయంత్రం ఆయన ఇన్నోవా వాహనంలో ములుగుకు వచ్చి తిరిగి హనుమకొండకు బయల్దేరారు.

పందికుంట స్టేజీ వద్ద ఆయన వాహనాన్ని వెనుక నుంచి స్విఫ్ట్‌ డిజైర్‌ కారులో వచ్చిన దుండగులు ఢీకొట్టారు. దీంతో మల్లారెడ్డి తన వాహనం దిగి ఆ కారులోని వ్యక్తులతో వాదనకు దిగాడు. ఈ క్రమంలోనే కారులోని ఐదుగురు వ్యక్తులు మల్లారెడ్డిపై కత్తులతో దాడికి దిగారు. అది చూసి మల్లారెడ్డి పరుగుపెట్టినా దుండగులు వెంబడించి మరీ కత్తులతో విచక్షణా రహితంగా పొడిచారు.

ఈ ఘటనలో మల్లారెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. తర్వాత దుండగులు వచ్చిన కారులోనే పరారయ్యారని మల్లారెడ్డి వాహన డ్రైవర్‌ సారంగం వివరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మల్లారెడ్డికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

భూవివాదాలే కారణం!
మల్లంపల్లి పరిసర ప్రాంతాల్లో మైనింగ్‌ కార్యకలాపాలు నిర్వహిస్తున్న మల్లారెడ్డికి అక్కడి భూముల విషయంగా కొందరితో వివాదాలు ఉన్నాయి. ఈ క్రమంలో మల్లారెడ్డి హత్యకు పాత కక్షలు, మైనింగ్‌కు సంబంధించి భూవివాదాలే కారణమై ఉండవచ్చని మల్లంపల్లి వాసులు చర్చించుకుంటున్నారు. దీనికి సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, త్వరలో అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు వెల్లడించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top