‘స్మార్ట్‌’ బెట్టింగ్‌.. ఐపీఎల్‌ మ్యాచ్‌లపై పందేల జోరు 

Cricket Betting IPL Matches In Chittoor District - Sakshi

యథేచ్ఛగా కాయ్‌ రాజా కాయ్‌

నిత్యం రూ.కోట్లలో లావాదేవీలు

స్మార్ట్‌ఫోన్లతో సాగుతున్న వ్యవహారం

కర్ణాటక ముఠాలదే ఆధిపత్యం

మాఫియా మాయలో యువత

పలమనేరు(చిత్తూరు జిల్లా): ఐపీఎల్‌ మ్యాచ్‌లను చిన్నాపెద్దా తేడా లేకుండా వీక్షిస్తున్నారు. ఫలితం తేలే వరకు టీవీలు, స్మార్ట్‌ ఫోన్లకు అతుక్కుపోతున్నారు. ఈ తరుణంలోనే జిల్లావ్యాప్తంగా బెట్టింగ్‌ రాయుళ్లు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఆయాచిత సొమ్ముకు ఆశపడి పందేలు కాస్తున్నారు. బెట్టింగ్‌ మాఫియా వలలో సులువుగా చిక్కుకుంటున్నారు.

మ్యాచ్‌ ప్రారంభానికి ముందు టాస్‌ గెలవడం నుంచి బాల్‌ బై బాల్, ఓవర్‌ బై ఓవర్‌ అంటూ తుది విజేత తెలిసే వరకు వివిధ రకాలుగా బెట్టింగ్‌కు దిగుతున్నారు. దీనికితోడు సెల్‌ఫోన్లలో అందుబాటులోకి వచ్చిన క్రికెట్‌ బెట్టింగ్‌ యాప్‌ల ద్వారా మరికొందరు యథేచ్ఛగా జూదాలకు పాల్పడుతున్నారు. సులువైన సంపాదనే లక్ష్యంగా పందేలకు అలవాటు పడి చేతి చమురు వదిలించుకుంటున్నారు. చివరకు తమ కుటుంబాలను వీధిన పడేయడమే కాకుండా, ప్రాణాలు తీసుకునే దుస్థితి చేరుకుంటున్నారు.

చదవండి: ఆ కోర్సులకు గిరాకీ.. ‘డిగ్రీ’ వైపు మళ్లీ చూపు..

మూడేళ్ల క్రితం బైరెడ్డిపల్లె మండలంలో ఓ యువకుడు బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
పెద్దపంజాణి మండలంలో ఓ యువకుడు ఆన్‌లైన్‌ యాప్‌ బెట్టింగ్‌ ద్వారా తీవ్రంగా నష్టపోయి ఉరేసుకొని ప్రాణం తీసుకున్నాడు.
పుంగనూరుకు చెందిన ఓ విద్యార్థి బెట్టింగులో డబ్బు పోగొట్టుకుని ఊరు నుంచి పరారై బెంగళూరులో కూలి పనులు చేసుకుంటున్నాడు
కుప్పంలో ఓ ఆటోడ్రైవర్‌ క్రికెట్‌ బెట్టింగుల్లో ఓడి తనకు  జీవనాధారమైన ఆటోను తెగనమ్ముకోవాల్సి వచ్చింది.
కాలేజీలో ఫీజు కట్టాలంటూ తల్లిదండ్రుల వద్ద డబ్బు తీసుకున్న పలువురు విద్యార్థులు బెట్టింగ్‌ మోజులో సొమ్ము పోగొట్టుకొని ఇబ్బంది పడుతున్నారు.
​​​​​​​జిల్లాలో ఇలాంటి ఘటనలు అధిక సంఖ్యలో జరుగుతున్నా పోలీసుల వరకు వచ్చేవి కొన్నే.. 

పల్లె.. పట్టణం తేడా లేకుండా జనం ఐపీఎల్‌ మ్యాచ్‌లను చూసేందుకు ఎగబడుతున్నారు. ప్రజల్లో ఆసక్తిని అనుకూలంగా మలుచుకొని కొన్ని ముఠాలు బెట్టింగ్‌కు తెరతీశాయి. మ్యాచ్‌ ప్రారంభం నుంచి ముగిసే వరకు ప్రతి నిముషానికి పందేలు కట్టించుకుంటున్నారు. బెట్టింగ్‌ ఆట కట్టించేందుకు పోలీసులు శతవిధాలా ప్రయతిస్తున్నా ప్రయోజనం లేకుండా పోతోంది. ముఖ్యంగా యువత బెట్టింగ్‌కు బానిసలుగా మారి ఉజ్వల భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారు. వీరికి తోడు ఆటో డ్రైవర్లు, రోజువారీ కూలి పనులు చేసుకునేవారు సైతం పందేల మోజులో కొట్టుమిట్టాడుతున్నారు. మార్చి 26వ తేదీన ప్రారంభమైన ఐపీఎల్‌ మ్యాచ్‌లు మే 22 వరకు కొనసాగనున్న నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టంగా నిఘా పెట్టినా ఫలితం శూన్యంగా మారుతోంది. పందేల రూపంలో రూ.కోట్లు చేతులు మారుతున్నా చూస్తూ ఉండక తప్పని పరిస్థితి ఏర్పడింది.

హిడెన్‌ యాప్‌లే కీలకం 
ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్లలో క్రికెట్‌ బెట్టింగ్‌ యాప్‌లు ఉన్నాయి. వీటిలో రూ.10వేల నుంచి బెట్టింగ్‌ చేసే వెసులుబాటు ఉంది. ఇవి చాలా వరకు హిడెన్‌ మోడ్‌లోనే ఉంటాయి. పోలీసులు తనిఖీ చేసినా ఈ యాప్‌లు కనిపించవు. ఒకప్పుడు పెద్ద నగరాలకు మాత్రమే బెట్టింగ్‌ విధానం ఉండేది. ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ల పుణ్యమా అని అన్ని ప్రాంతాలకు విస్తరించింది. ముఖ్యంగా జిల్లాలోని కుప్పం, పలమనేరు, చిత్తూరు, పుంగనూరు నియోజకవర్గాల్లో బెట్టింగులు అధికంగా సాగుతున్నట్లు సమాచారం.

ఆయా పట్టణాల్లోని శివారు ప్రాంతాలు, పొలాల వద్ద ఫామ్‌హౌస్‌లతోపాటు పందెంరాయుళ్లు కొన్ని లాడ్జీల్లో రూములు, అపార్ట్‌మెంట్‌లలో ప్లాట్లు అద్దెకు తీసుకుని యథేచ్ఛగా బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్లు తెలిసింది. హైవేల్లో దాభాల్లో సైతం పందెంరాయుళ్లు మకాం వేస్తున్నట్లు వినిపిస్తోంది. ఇక గ్రామాల్లో అయితే పొలాలు, చెరువు గట్లు, కొందరు ఇళ్లలోనే కాయ్‌ రాజా కాయ్‌ అంటున్నట్టు తెలుస్తోంది.

కోడ్‌లతో లావాదేవీలు 
ఐపీఎల్‌ మ్యాచ్‌లు రోజూ సాయంత్రం 7 నుంచి రాత్రి 11 గంటల వరకు జరుగుతుంటాయి. శని, ఆదివారాల్లో రెండేసి మ్యాచ్‌లు ఉంటాయి కాబట్టి మధ్యాహ్నం నుంచే బెట్టింగ్‌లు ప్రారంభమవుతుంటాయి. చాలా వరకు పందేలు కోడ్‌లతోనే నిర్వహిస్తుంటారు. గెలిచే జట్టును ఫ్లయింగ్‌ , ఓడిన జట్టును ఈటింగ్‌ , రూ.వెయ్యిని ఫింగర్‌ , రూ.10 వేలను బోన్, రూ.లక్షను లెగ్‌ అని పిలుస్తుంటారు. ఫోన్‌ పే, గూగు ల్‌ పే ద్వారా నగదు లావాదేవీలు సాగిస్తుంటారు.

కర్ణాటక ముఠాలదే హవా 
కర్ణాటకలోని  శ్రీనివాసపుర, ముళబాగల్, నంగళి, కోలార్, కేజీఎఫ్, హోసకోట్‌లకు చెందిన కొన్ని బెట్టింగు గ్యాంగుల హవాలే జిల్లాలో నడుస్తోంది. వీరు కేవలం స్మార్ట్‌ఫోన్ల ద్వారా బెట్టింగులు నిర్వహిస్తున్నట్టు సమాచారం. మ్యాచ్‌కు ముందు బెట్టింగ్‌ రేట్‌ నిర్ణయించి ఆన్‌లైన్‌లో సొమ్మ జమచేయించుకుంటారు. అనంతరం గెలిచిన వారికి డబ్బు చెల్లిస్తారు. ఇందులో 10 నుంచి 15శాతం కమీషన్లు వసూలు చేస్తుంటారు.

పలమనేరులో పందేల జోరు 
పలమనేరులోని రొంటకుంట్ల రోడ్డు, డిగ్రీ కళాశాలకు వెనుకవైపు, నీళ్లకుంట, గొబ్బిళ్లకోటూరు చెరువలు, వారపుసంత, నాగమంగళం, రంగాపు రం, మార్కెట్‌ యార్డు గదులు, ఆర్టీసీ డిపో వెనుక బెట్టింగ్‌కు అడ్డాలుగా మారినట్లు సమాచారం.

ప్రత్యేకంగా నిఘా పెట్టాం 
పలమనేరు సబ్‌డివిజన్‌పరిధిలో బెట్టింగులపై ఇప్పటికే బ్లూకోల్ట్స్‌ ద్వారా నిఘా పెట్టాం. అనుమానిత ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నాం.  బెట్టింగులకు పాల్పడితే కేసులు తప్పవు. ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రులు దీనిపై దృష్టి పెట్టాలి. చిన్న క్లూ దొరికినా ప్రధాన ముఠాను పట్టుకుంటాం. బెట్టింగ్‌ మాఫియా ఆటకట్టించేందుకు ప్రత్యేకంగా చర్యలు చేపట్టాం.
– గంగయ్య, డీఎస్పీ, పలమనేరు   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top