బాలాజీ నాయుడు మళ్లీ చిక్కాడు! 

Balaji Naidu Makes Fraud Again Name Of Government Schemes Caught By Police - Sakshi

తొలిసారిగా అనుచరుడిని ఏర్పాటు చేసుకుని దందా

గ్రాంట్లంటూ ఏపీ ఎంపీ, తెలంగాణ ప్రజాప్రతినిధులకు ఫోన్లు 

అడ్వాన్సులుగా రూ.లక్షలు చెల్లించాలంటూ వారికి ఎర

వలపన్ని ఇద్దరినీ పట్టుకున్న హైదరాబాద్‌ పోలీసులు

సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వ పథకాల పేరు చెప్పి ప్రజాప్రతినిధులకే టోకరా వేసే ఘరానా మోసగాడు తోట బాలాజీ నాయుడు మరోసారి చిక్కాడు. ఈసారి ఏపీలోని తిరుపతి ఎంపీ గురుమూర్తితో పాటు తెలంగాణలోని కొందరు ప్రజాప్రతినిధులకు ఎర వేశాడు. ఇప్పటి వరకు 30 మంది ఎంపీ, ఎమ్మెల్యేలకు టోకరా వేసిన ఇతగాడిపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని 30 పోలీసుస్టేషన్లలో ఇతడిపై 33 కేసులు ఉండగా..22 సార్లు జైలుకు వెళ్ళివచ్చాడు. తొలిసారిగా ఓ అనుచరుడిని ఏర్పాటు చేసుకుని నేరం చేశాడు. వీరిద్దరినీ హైదరాబాద్‌ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. 

బీటెక్‌ చదివి... ఏసీబీకి చిక్కి.. 
♦ తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడికి చెందిన తోట బాలాజీ నాయుడు కాకినాడలోని జేఎన్‌టీయూ నుంచి బీటెక్‌ పూర్తి చేశాడు. 2003లో ఎన్‌టీపీసీలో జూనియర్‌ ఇంజనీర్‌గా చేరి రామగుండం, పాల్వంచ, విశాఖపట్నంల్లో పని చేశాడు.  వైజాగ్‌లో విధులు నిర్వర్తిస్తుండగా 2008లో అప్పటి తణుకు ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడు ఆనంద్‌ నుంచి రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కాడు. ఈ కేసు కోర్టులో నిరూపితం కావడంతో ఉద్యోగం కోల్పోయాడు. విశాఖ జైలులో ఉండగా పాత నేరగాళ్లతో ఏర్పడిన పరిచయం ప్రభావంతో బయటకు వచ్చినప్పటి నుంచి మోసాలు చేయడమే వృత్తిగా మార్చుకుని విజృంభించాడు.  

ఉద్యోగాలు, పథకాల పేర్లు చెప్పి... 
♦ఇతగాడు వివిధ మార్గాల్లో ప్రజా ప్రతినిధులు, వారి పీఏల ఫోన్‌ నెంబర్లు సంగ్రహిస్తాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన పథకాలు, సంస్థల్లో ఉద్యోగాలంటూ ఎర వేస్తాడు. వారి నియోజకవర్గాలకు చెందిన అర్హులను ఎంపిక చేయాల్సిందిగా కోరి..ప్రాథమికంగా డిపాజిట్‌ చెల్లించాలంటూ బ్యాంకు ఖాతాల్లో డబ్బు వేయించుకుని మోసం చేస్తాడు. గతంలో వి.హనుమంతరావు, దేవేందర్‌ గౌడ్, పాల్వాయి గోవర్థన్, ఆకుల లలిత, రాంజగదీష్‌.. ఇలా అనేక మంది నుంచి సైతం బాలాజీ నాయుడు డబ్బు గుంజాడు. మనోహర్, లక్ష్మణ్, మల్లేష్‌ పేర్లతోనూ చెలామణి అయ్యే ఇతగాడు జైల్లో ఉండగా అభిషేక్‌ అనే యువకుడితో పరిచయమైంది. ఎల్బీనగర్‌ ఠాణా పరిధిలో ఓ అత్యాచారం కేసులో ఇతడు జైలుకు వెళ్లాడు. ఇటీవలే బయటకు వచ్చిన వీరిద్దరూ ముఠాగా ఏర్పడ్డారు.  

ఖాదీ కమిషన్‌ పేరుతో ఎంపీకి... 
♦అభిషేక్‌తో కలిసి రంగంలోకి దిగిన బాలాజీ నాయుడు ఇటీవల తిరుపతి ఎంపీ గురుమూర్తికి ఫోన్‌ చేశాడు. ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మాట్లాడుతున్నట్లు చెప్పి... కేంద్రం ఆధీనంలోని ఖాదీ అండ్‌ విలేజ్‌ ఇండస్ట్రీస్‌ కమిషన్‌ నుంచి ఆయన నియోజకవర్గానికి రూ.5 కోట్లు మంజూరయ్యాయని చెప్పాడు. ఈ మొత్తాన్ని పంపిణీ చేయడానికి 20 మంది అర్హులైన వారికి ఎంపిక చేయమని కోరాడు. చలాన్‌ చార్జీల కోసం ఒక్కో లబ్దిదారుడి పేరుతో రూ.1.25 లక్షలు చెల్లించాలంటూ ఓ బ్యాంకు ఖాతా వివరాలు అందించాడు. అనుమానం వచ్చిన గురుమూర్తి సీఎంఓలో ఆరా తీయగా అసలు విషయం తెలిసింది. దీంతో ఆయన అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. బాలాజీ ఇదే పంథాలో ఇక్కడి ఎమ్మెల్సీలకు కాల్స్‌ చేశాడు. వీరి వ్యవహారంపై సమాచారం అందుకున్న హైదరాబాద్‌ పోలీసుల వలపన్ని ఇద్దరినీ పట్టుకున్నారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top