స్థానిక సమర శంఖం! | - | Sakshi
Sakshi News home page

స్థానిక సమర శంఖం!

Oct 15 2026 8:48 AM | Updated on Oct 15 2026 8:48 AM

● జిల్లాలో 621 పంచాయతీల్లో 10,26,821 మంది ఓటర్లు ● 11,388 మహిళా ఓటర్లే అత్యధికం

చిత్తూరు కార్పొరేషన్‌: రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. నవంబర్‌ 3న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించి 5న ఫలితాలు వెల్లడించనున్నారు. జిల్లాలోని 27 మండలాల్లో 27 జెడ్పీటీసీ, 370 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. 1,236 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇదివరకే జెడ్పీ ఎన్నికల పరంగా రిజర్వేషన్లను ప్రకటించారు. గ్రామ స్థాయిలో కీలకమైన పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఎన్నికల రిజర్వేషన్‌ ప్రక్రియ తుదిదశకు చేరుకుంది. రెండు రోజులుగా జెడ్పీ కార్యాలయంలో సీఈఓ, డీపీఓ, ఆర్డీఓలు, ఎంపీడీఓలు, డిప్యూటీ ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది వీటిపై కసరత్తు చేస్తున్నారు.

11,388 మహిళా ఓటర్లు అధికం

జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో మొత్తం 10,26,821 మంది ఓటర్లు ఉండగా అందులో పురుషులు 5,07,703 మంది, మహిళలు 5,19,091 మంది ఉన్నారు. పురుషుల కంటే మహిళలు 11,388 మంది ఎక్కువగా ఉన్నారు. వీరిలో ఎస్టీ ఓటర్లు 29,639 మంది, ఎస్సీలు 2,47,964 మంది, బీసీలు 4,72,150 మంది, జనరల్‌ 2,77,068 మంది ఉన్నారు.

మూడుదశల్లో పంచాయతీ ఎన్నికలు

పంచాయతీలకు 3 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి దశ నవంబర్‌ 26, రెండో దశ 29, మూడో దశ డిసెంబర్‌ 2న నిర్వహించనున్నారు. అదే రోజు ఓట్లను లెక్కించనున్నారు. జిల్లాలో మొత్తం 27 మండలాల్లో 621 పంచాయతీలు ఉండగా పలు కారణాలతో రామకుప్పం, పులిచెర్లలోని మొత్తం 3 పంచాయతీల్లో ఎన్నికలు జరగడం లేదు. ఆ లెక్కన 619 పంచాయతీల పరంగా 5,882 పోలింగ్‌ కేంద్రాలను సిద్దం చేశారు. వీటి సంబంధించి 3,881 బ్యాలెట్‌ బాక్స్‌లు ఉన్నాయి. జెడ్పీ ఎన్నికలు పూర్తయ్యాక వారి వద్ద నుంచి బాక్స్‌లు తీసుకోనున్నారు. సర్పంచ్‌ ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్‌ పేపర్‌ పింక్‌ రంగులో, వార్డు మెంబర్‌ ఎన్నికకు తెలుపు రంగులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఎన్నికల కోసం కమిటీలను ఏర్పాటు చేశారు. జిల్లా కమిటీకి జేసీ చైర్మన్‌గా, ఏఎస్పీ కన్వీనర్‌గా, నలుగురు జిల్లా అధికారులు సభ్యులుగా ఉంటారు. డివిజన్‌ స్థాయి కమిటీకి ఆర్డీవో చైర్మన్‌, డీఎస్పీ కన్వీనర్‌గా, ఇద్దరు డివిజన్‌ స్థాయి అధికారులు సభ్యులుగా ఉంటారు. 2021 ఫిబ్రవరిలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కోర్టు కేసుల వల పులిచెర్ల, రామకుప్పంలో ఎన్నికలు నిర్వహించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement