ఆటలో సాఫ్ట్‌..సాధనలో హార్డ్‌! | - | Sakshi
Sakshi News home page

ఆటలో సాఫ్ట్‌..సాధనలో హార్డ్‌!

Oct 15 2026 8:48 AM | Updated on Oct 15 2026 8:48 AM

బంతి విసిరారు.. బహుమతులు పట్టారు

కష్టాలను అధిగమిస్తూ లక్ష్యం వైపు అడుగులు

సర్కారు బడి నుంచి జాతీయ స్థాయి వరకు

మైదానంలో మెరుస్తున్న నిరుపేద ప్రతిభ

సాఫ్ట్‌బాల్‌ క్రీడలో రాణిస్తున్న సర్కారు బడి విద్యార్థులు

యంగ్‌ టాలెంట్‌

సర్కారు బడికే గర్వకారణం

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు చదువులోనే కాదు, ఆటల్లోనూ ఎవరికీ తీసిపోరని ఈ విద్యార్థులు నిరూపిస్తున్నారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహించి ప్రతిష్టాత్మక పతకాలను సాధిస్తున్నారు. జాతీయ స్థాయి ఎంపికల్లో సైతం స్థానం దక్కించుకోవడం విశేషం. పీసీఆర్‌ పాఠశాలకు దక్కిన ఈ గౌరవంపై ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

పట్టుదల, కృషి ఉంటే సాధ్యం కానిది లేదని ఆ పేద విద్యార్థులు నిరూపిస్తున్నారు. కనీస వసతులు లేకపోయినా, పేదరికం వెంటాడుతున్నా... సర్కారు బడిలో చదువుకుంటూనే ‘సాఫ్ట్‌బాల్‌’ క్రీడలో అద్భుత ప్రతిభ కనబరుస్తున్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు సాధిస్తూ తమ గ్రామానికి, చదువుతున్న బడికి పేరు తెస్తున్నారు.

చిత్తూరు కలెక్టరేట్‌ : సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు క్రీడా సదుపాయాలు లభించడం చాలా అరుదు. కార్పొరేట్‌ స్కూళ్లలో లభించే కోచింగ్‌, ప్రైవేట్‌ అకాడమీల సౌకర్యాలు వీరికి అందని ద్రాక్షే. ఆ ప్రతిబంధకాలేవీ ఆ విద్యార్థుల క్రీడా ఉత్సాహాన్ని అడ్డుకోలేకపోయాయి. సరైన క్రీడా సామగ్రి లేకపోయినా, పట్టుదలతో సాధన చేసి సాఫ్ట్‌బాల్‌ క్రీడలో మెరికల్లా తయారయ్యారు. పాఠశాల ఫిజికల్‌ డైరెక్టర్‌ (పీడీ) దేవా ప్రోత్సాహం, సొంత క్రమశిక్షణతో ఆటలో నైపుణ్యం సాధించి నేడు అగ్రశ్రేణి క్రీడాకారులుగా నిలుస్తున్నారు.

అన్నాచెల్లెళ్ల అరుదైన మైలురాయి

చిత్తూరు నగరంలోని భరత్‌ నగర్‌, కాజూరు, అలాగే నగరికి చెందిన అన్నాచెల్లెళ్లు పేద కుటుంబానికి చెందిన వారు. ఇంట్లో పేదరికం తాండవం చేస్తున్నా, తల్లిదండ్రుల రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితుల్లో ఉన్నా వీరు కుంగిపోలేదు. క్రీడల్లో ప్రతిభ చూపుతున్నారు. వీరు మైదానంలోకి దిగారంటే ప్రత్యర్థులకు వణుకు పుట్టాల్సిందే. అన్నను చూసి చెల్లెలు, చెల్లెలికి అండగా అన్న నిలుస్తూ రోజూ ఉదయాన్నే సాధన చేస్తున్నారు. జిల్లా స్థాయి నుంచి మొదలైన వీరి పతకాల వేట, రాష్ట్ర స్థాయి మీదుగా ఏకంగా జాతీయ స్థాయి పోరు వరకు చేరింది.

ప్రభుత్వం, దాతలు ప్రోత్సహిస్తే మరిన్ని అద్భుతాలు

కష్టపడే తత్వం, గెలవాలనే తపన ఉన్న ఇలాంటి నిరుపేద క్రీడాకారులకు కొద్దిగా ప్రోత్సాహం లభిస్తే అంతర్జాతీయ స్థాయిలో కూడా మెరిసే అవకాశం ఉంది. నిరుపేద కుటుంబాలకు చెందిన ఈ విద్యార్థులకు మెరుగైన క్రీడా పరికరాలు అందించడం, పౌష్టికాహారం, ప్రయాణ ఖర్చులకు ఆర్థిక సహాయం అందిస్తే, మరింత మంది సర్కారు బడి పిల్లలు క్రీడల్లో రాణించే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా వైఫల్యాలకు పేదరికాన్ని సాకుగా చూపకుండా, పట్టుదలే ఆయుధంగా ముందుకు సాగుతున్న ఈ సాఫ్ట్‌బాల్‌ నిరుపేద మెరికలు నేటి తరానికి నిజమైన స్ఫూర్తిప్రదాతలు.

సాఫ్ట్‌బాల్‌లో శిక్షణ పొందుతున్న సర్కారు బడి విద్యార్థులు

ఒక ఇల్లు.. ఇద్దరు ఛాంపియన్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement