ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం
అమల్లోకి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్
అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు
సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా
కొత్త అభివృద్ధి పనులకు బ్రేక్
కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ,
ఎస్పీ తుషార్ డూడీ
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ వెల్లడించారు. ఆయన బుధవారం కలెక్టరేట్లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేశామన్నారు. జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్) అమల్లోకి వచ్చిందని తెలిపారు. మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మొత్తం 168 వార్డులకు మొదటి దశలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అర్బన్ లోకల్ బాడీ (యూఎల్బీ) ఎన్నికల పరిధిలో మొత్తం 2,79,904 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. వారిలో 1,35,799 మంది పురుషులు, 1,44,067 మంది మహిళలు, 38 మంది ఇతరులు ఉన్నారని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు చేసి గెజిట్ ప్రచురించినట్లు తెలిపారు. పంచాయతీల రిజర్వేషన్ ప్రక్రియ బుధవారం అర్ధరాత్రికి పూర్తికానుందన్నారు. నామినేషన్లు స్వీకరించే వరకు దరఖాస్తు చేసుకునే కొత్త ఓటర్లను కూడా పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. పోలింగ్ కేంద్రాలను ఇప్పటికే ఖరారు చేశామని, ఆర్వో, ఏఆర్వోలకు శిక్షణ పూర్తి చేసినట్లు వెల్లడించారు. గుర్తించిన లొకేషన్ల వారిగా మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు స్వీకరిస్తామని తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ప్రిసైడింగ్ అధికారితో పాటు మరో నలుగురు సిబ్బంది విధులు నిర్వహిస్తారని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా అర్బన్, రూరల్ ప్రాంతాలను కలుపుకుని మొత్తం 13,06,725 మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు. ఇందులో పురుషులు 6,43,502 మంది, మహిళలు 6,63,158 మంది, ఇతరులు 65 మంది ఉన్నారని వెల్లడించారు. రూరల్ ప్రాంతాల్లోని 27 మండలాల పరిధిలోని 622 గ్రామ పంచాయతీల్లో 10,26,821 మంది ఓటర్లు ఉన్నారన్నారు. కులాల వారిగా ఎస్టీ ఓటర్లు అర్బన్‌లో 3,704 మంది, రూరల్‌లో 29,639(మొత్తం 33,343) మంది, ఎస్సీ ఓటర్లు అర్బన్‌లో 42,586 మంది, రూరల్‌లో 2,47,964 (మొత్తం 2,90,550) మంది, బీసీ ఓటర్లు రూరల్‌లో 1,70,232 మంది, అర్బన్‌లో 4,72,150 (మొత్తం 6,42,382) మంది, ఇతర కులాల వారు అర్బన్‌లో 63,382 మంది, రూరల్‌లో 2,77,068 (మొత్తం 3,40,450) మంది ఉన్నట్లు స్పష్టం చేశారు.
కొత్త అభివృద్ధి పనులకు బ్రేక్
జిల్లా వ్యాప్తంగా అర్బన్, రూరల్ ప్రాంతాల్లో కొత్త అభివృద్ధి పనులు చేపట్టడానికి వీలు లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రారంభోత్సవాలు చేయాల్సి వస్తే ఎన్నికల సంఘం (ఈసీ) అనుమతి తీసుకోవాలని తెలిపారు. ఎన్నికల కోడ్‌లో భాగంగా జిల్లాలో రాజకీయ ప్రచార బ్యానర్లు తొలగించనున్నట్లు తెలిపారు. రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు వేయాలని ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా రాజకీయ ర్యాలీల్లో పాల్గొంటే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు
జిల్లాలో ఎవరైనా అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తుషార్ డూడీ హెచ్చరించారు. ఎన్నికలను పూర్తిగా నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. 1500 మంది పోలీసులను నియమించామని తెలిపారు. జిల్లాలో మొత్తం 556 లైసెన్స్ తుపాకులు ఉండగా, అందులో ఇప్పటికే 421 తుపాకులను సంబంధిత పోలీస్ స్టేషన్లలో డిపాజిట్ చేయించుకున్నట్లు తెలిపారు. సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా పెట్టామని తెలిపారు. ఫేక్ పోస్టులు, రెచ్చగొట్టే సందేశాలు పెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 88, పలమనేరులో 12, నగరిలో 18, కుప్పం మున్సిపాలిటీ పరిధిలో 11 చొప్పున సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. తమిళనాడు, కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లోని చెక్‌పోస్టుల వద్ద ఏఆర్ (ఏఆర్) ఫోర్స్‌ను నియమిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికలు సజావుగా ముగిసేందుకు ప్రజలు, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు పూర్తిగా సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో ట్రైనీ కలెక్టర్ వెంకటేష్, చిత్తూరు నగరపాలక కమిషనర్ నరసింహప్రసాద్, పలమనేరు కమిషనర్ లోకేశ్వరవర్మ తదితరులు పాల్గొన్నారు.


