సదరంలో కాసుల పర్వం! | - | Sakshi
Sakshi News home page

సదరంలో కాసుల పర్వం!

Oct 8 2026 3:30 AM | Updated on Oct 8 2026 3:30 AM

రూ.17 వేల నుంచి రూ.20 వేల వరకు వసూలు దివ్యాంగులనూ వదలని దళారులు హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌ ఉద్యోగే సూత్రధారి స్పందించిన కలెక్టర్‌.. బాధ్యుడిపై వేటు

●

ఇటీవల ప్రభుత్వం కొత్త పింఛన్లకు దరఖాస్తులు ఆహ్వానించింది. గడువు ముగిసి దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ కూడా పూర్తి చేసింది. ఈ క్రమంలో కొంతమంది ఆశావహులు మరొకసారి గడువు ఇస్తుందని భావించి సర్టిఫికెట్ల కోసం ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా దివ్యాంగ పింఛన్ల కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. సదరం సర్టిఫికెట్లు పొందడానికి దళారులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదును భావించిన దళారులు ఒక్కో సర్టిఫికెట్‌కు రూ.వేలు వసూలు చేస్తున్నారు. దీనిపై అధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తడంతో చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు.

కాణిపాకం: దివ్యాంగ పింఛన్లు పొందాలంటే సదరం సర్టిఫికెట్‌ ఉండాలి. దీనికోసం సదరం క్యాంపునకు వెళ్లాలి. అక్కడ వైద్యులు పరిశీలించి శారీరక వైకల్య శాతాన్ని నిర్ధారించి సర్టిఫికెట్‌ మంజూరుకు సిఫార్సు చేస్తారు. తర్వాత వారికి ప్రభుత్వం పింఛను ఇస్తుంది. చిత్తూరు జిల్లాలో ఒక జిల్లా ఆస్పత్రి, 4 ఏరియా ఆస్పత్రులు, 7 సీహెచ్‌సీల్లో సదరం క్యాంపులు నిర్వహిస్తారు. వీటి పరిధిలో ప్రభుత్వం స్లాట్‌ బుకింగ్‌ అవకాశం ఇచ్చినప్పుడల్లా సదరం పరీక్షలు చేపడతారు. ఈ పరీక్షల కోసం వందలాది మంది స్లాట్‌ బుక్‌ చేసుకుంటున్నారు. ఈ పరీక్షల్లో 40 శాతం వైకల్యం ఉంటే పింఛను వస్తుంది. ఈ నేపథ్యంలో శారీరక వైకల్యం లేని వారు కూడా ఎలాగైనా సర్టిఫికెట్‌ పొందాలని చూస్తున్నారు. ఇందుకోసం దళారులను ఆశ్రయిస్తున్నారు.

అడ్డదారులు.. అడ్డగోలు దోపిడీ

సదరం సర్టిఫికెట్‌ పొందాలని చూస్తున్న వారు అడ్డదారులు తొక్కుతున్నారు. ఇందుకు ఎంత ఖర్చయినా వెనుకాడడం లేదు. ఇదే అదునుగా భావించిన దళారులు, వైద్య ఆరోగ్య శాఖలోని కొందరు సిబ్బందితో చేతులు కలిపి దందాకు తెరలేపారు. ఒక్కో సర్టిఫికెట్‌కు రూ.17 వేల నుంచి రూ.20 వేల వరకు వసూలు చేస్తున్నారు. చివరికి నిజమైన దివ్యాంగులను కూడా వదలకుండా వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని సొమ్ము చేసుకుంటున్నారు.

రూ.20 వేల భాగోతం

సర్టిఫికెట్‌ తీసిస్తామని చెప్పి ఒక వ్యక్తి నుంచి డబ్బు తీసుకున్న విషయం గత నెలలో చిత్తూరు నగరంలోని సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. పూతలపట్టు మండలం బండపల్లికి చెందిన ఒక వ్యక్తి నుంచి సదరం సర్టిఫికెట్‌ ఇప్పిస్తానని చెప్పి ఓ ఆస్పత్రి సిబ్బంది రూ.20 వేలు నొక్కేశాడు. ఈ వ్యవహారం బయటపడడంతో ఆస్పత్రి అధికారులు విచారణ చేపట్టారు. రాతపూర్వకంగా ఫిర్యాదులు వస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

పింఛన్ల ఆశ చూపి నిలువుదోపిడీ

కలెక్టర్‌కు ఫిర్యాదు

జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి సదరం సర్టిఫికెట్‌ కోసం రూ.17 వేల నుంచి రూ.18 వేలు వసూలు చేస్తున్నాడని పూతలపట్టు మండలానికి చెందిన బాధితులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్‌ విచారణ చేయాలని డీసీహెచ్‌ఎస్‌, డీఎంహెచ్‌ఓలను ఆదేశించారు. విచారణలో వెలుగులోకి వచ్చిన ఆధారాల ఆధారంగా డీఎంహెచ్‌ఓ సోమవారం రాత్రి ఆ సిబ్బందిని కలెక్టర్‌కు సరెండర్‌ చేశారు. మూడు నెలల క్రితం కూడా ప్రైవేటుగా పనిచేస్తున్న ఇద్దరు సిబ్బందిపై వేటు పడినప్పటికీ, శాఖలోని కొందరి తీరు మారలేదని ఇతర ఉద్యోగుల విమర్శిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement