పెల్లుబికిన ఆగ్రహం | - | Sakshi
Sakshi News home page

పెల్లుబికిన ఆగ్రహం

Oct 8 2026 3:30 AM | Updated on Oct 8 2026 3:30 AM

ఏపీ ఎన్జీవో నేతల మద్దతు

300 మంది సిబ్బంది హాజరు

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): ఏళ్ల తరబడి సేవలందిస్తున్న తమను రెగ్యులరైజ్‌ చేయాలని, నిత్యావసర ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని కాంట్రాక్ట్‌ ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. వారు తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ కాంట్రాక్ట్‌ ఎంప్లాయీస్‌ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం చేపట్టిన నిరవధిక సమ్మె తీవ్ర రూపం దాల్చింది. రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా చిత్తూరులోని గంగినేని చెరువు పార్క్‌ ప్రాంగణంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఇందులో జిల్లా వ్యాప్తంగా ఉన్న దాదాపు 300 మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగులు పాల్గొన్నారు. వారికి ఏపీ ఎన్జీవో చిత్తూరు జిల్లా అధ్యక్షుడు రాఘవులు, కార్యదర్శి రమేష్‌ మద్దతు ప్రకటించారు. వారు మాట్లాడుతూ కాంట్రాక్ట్‌ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. వారి ఉద్యోగాల రెగ్యులరైజేషన్‌ ప్రక్రియను త్వరితగతిన చేపట్టి, వారి కుటుంబాలకు భరోసా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. జేఏసీ చైర్మన్‌ నరేష్‌ మాట్లాడుతూ 15 ఏళ్లుగా కాంట్రాక్టు వ్యవస్థ అనే బానిసత్వంలోనే విధులు నిర్వర్తిస్తున్నామని వాపోయారు. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, తమ జీతాలు మాత్రం పెరగడం లేదన్నారు. క్రమబద్ధీకరణ ఊసే ఎత్తడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమంలో భాగమైన విద్యా, వైద్యం ప్రాథమిక హక్కులని ప్రభుత్వం చెబుతోందని పేర్కొన్నారు. ఉపాధ్యాయులకు రెగ్యులర్‌ పద్ధతిలో నోటిఫికేషన్లు ఇస్తూ నియామకాలు చేపడుతోందని, వైద్య విభాగంలో రాత్రింబవళ్లు శ్రమిస్తున్న స్టాఫ్‌ నర్సులు, ఫార్మసిస్టులు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఇతర పారామెడికల్‌ సిబ్బందిని మాత్రం ఒప్పందాల పేరిట తీవ్ర శ్రమ దోపిడీకి గురిచేస్తోందని విమర్శించారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి కాంట్రాక్టు ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

గంగినేని చెరువు పార్క్‌ వద్ద కాంట్రాక్ట్‌ ఉద్యోగుల నిరసన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement