చిత్తూరు కలెక్టరేట్ : బాల్య వివాహాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ హెచ్చరించారు. ఆయన బుధవారం జిల్లా పరిషత్ స్పెషల్ ఆఫీసర్ కార్యాలయంలో పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడు తూ సమాజంలో బాల్య వివాహాల నిర్మూలనపై జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. గ్రామస్థాయి బాల్య వివాహ నిషేధ, పర్యవేక్షణ కమిటీలు క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించాలన్నారు. ఈ కమిటీల పనితీరును మండల అధికారులు పర్యవేక్షించి క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టాలని ఆదేశించారు. స్వయం సహాయక సంఘా లు, గ్రామసభల్లో బాల్య వివాహాల దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. బాల్య వివాహాల చట్టాలు, నైతిక విలువలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ప్రతి వారం ఒక పిరియడ్‌ను కేటాయించాలన్నారు.
డ్రాపౌట్స్‌పై నిఘా.. చట్టాలపై అవగాహన
జీవో 31 పీసీఎంఏ చట్టాలపై సీఎంపీఓలు, కీలక భాగస్వాములతో పాటు గ్రామస్థాయి కమిటీలకు వారి బాధ్యతలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని సూచించారు. మధ్యలోనే చదువు మానేసిన పిల్లలను తిరిగి పాఠశాలల్లో చేర్పించే బాధ్యత తీసుకోవాలన్నారు. విద్యాసంస్థలు, ప్రముఖ ప్రజా ప్రదేశాల్లో పీసీఎంఏ, ఫోక్సో చట్టంలో నమోదయ్యే శిక్షా నిబంధనలు, బాలల ఉచిత టోల్‌ఫ్రీ నంబర్ 1098 సమాచారంతో కూడిన పోస్టర్లను ప్రదర్శించాలన్నారు. సమావేశంలో ఐసీడీఎస్ పీడీ శ్యామసుగుణకుమారి, డీఎంహెచ్‌వో నాగశశిభూషన్‌రెడ్డి, డీఈవో లక్ష్మీనారాయణ, సమగ్రశిక్ష ఏపీసీ వెంకటరమణ, డీఆర్‌డీఏ పీడీ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.


