ఇళ్లకు పంపుతాం | - | Sakshi
Sakshi News home page

ఇళ్లకు పంపుతాం

Oct 8 2026 3:30 AM | Updated on Oct 8 2026 3:30 AM

● లాంగ్‌ స్టాండింగ్‌ విద్యాశాఖ అధికారులు, సిబ్బందిపై కలెక్టర్‌ ఫోకస్‌ ● ఏళ్ల తరబడి పాతుకుపోయిన ఉద్యోగుల జాబితా పంపాలని డీఈవోకు ఆదేశాలు ● యూడైస్‌, ముడుపుల ఆరోపణలపై ప్రభుత్వానికి ఏఎస్వో సరెండర్‌ ● కలెక్టర్‌ హెచ్చరికతో విద్యాశాఖ అధికారుల గుండెల్లో గుబులు

లంచం అడిగితే

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లా విద్యాశాఖ కార్యాలయం అవినీతి, అక్రమాలకు, ముడుపుల పర్వాలకు నిలయంగా మారిందన్న ఆరోపణలపై కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌గాంధీ సీరియస్‌ అయ్యారు. కార్యాలయంలో ఏళ్ల తరబడి పాతుకుపోయి సొంత సామ్రాజ్యాలను ఏలుతున్న లాంగ్‌ స్టాండింగ్‌ అధికారులు, సిబ్బంది ప్రక్షాళనకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆఫీసులో ఎవరు ఎన్నాళ్ల నుంచి ఉన్నారు? ఏఏ సెక్షన్‌లో ఎన్నేళ్ల నుంచి పనులు వెలగబెడుతున్నారో సమగ్ర నివేదిక ఇవ్వాలని డీఈవో లక్ష్మీనారాయణను ఆదేశించారు. దీంతో డీఈవో కార్యాలయంతో పాటు, క్షేత్రస్థాయిలోని డీవైఈవో, ఎంఈవోల గుండెల్లో గుబులు పుట్టింది.

ఏఎస్‌వో ఆనంద తాండవానికి చెక్‌

డీఈవో కార్యాలయంలో అవినీతి ఏ స్థాయిలో శృతిమించిందో చెప్పడానికి ఏఎస్‌వో (అసిస్టెంట్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌) ఆనందుడు వ్యవహారమే నిదర్శనం. యూడైస్‌ ప్రక్రియ పేరుతో ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలను, కరస్పాండెంట్లను పీడించుకు తినడం, వారిని చులకనగా చూడటం, ముడుపులు పిండుకోవడమే పనిగా పెట్టుకున్న ఈ ఆఫీసర్‌ ఆగడాలపై ఆధారాలు లభించడంతో కలెక్టర్‌ కొరడా ఝుళిపించారు. ఆయనను బాధ్యతల నుంచి తప్పించి ప్రభుత్వాన్ని సరెండర్‌ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్‌ తీసుకున్న ఈ సంచలన నిర్ణయం మిగతా అవినీతి తిమింగలాల గుండెల్లో దడ పుట్టిస్తోంది.

లంచం అడిగితే నేరుగా సరెండరే

క్షేత్రస్థాయి స్కూళ్ల నుంచి డీఈవో ఆఫీస్‌ వరకు విద్యాశాఖలో ఎక్కడైనా లంచం తీసుకున్నట్లు ఫిర్యాదులొచ్చినా వెనుకాడేది లేదని, విచారణలు ఉండవని,. నేరుగా సరెండర్‌ చేస్తానంటూ ఇటీవల జరిగిన సమావేశంలో కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. మండల స్థాయి విద్యావ్యవస్థలో ఎలాంటి అక్రమాలు జరిగినా సంబంధిత ఎంఈవోలనే బాధ్యులను చేస్తామని హెచ్చరించారు.

ఎవరో ఉంటారో? ఎవరు పోతారో?

డీఈవో కార్యాలయ ప్రక్షాళనపై కలెక్టర్‌ దృష్టి పెట్టడంతో ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది. దశాబ్దాలుగా ఒకే సెక్షన్‌లో తిష్టవేసి, పైసలు పిండుకోవడమే పనిగా పెట్టుకున్న అధికారులంతా ఇప్పుడు తమ కుర్చీలు ఎక్కడ ఊడిపోతాయోనని వణుకుతున్నారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఏళ్ల తరబడి ఒకే చోట పనిచేస్తున్న వారి నివేదికలు సిద్ధం చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ ప్రక్షాళనతోనైనా డీఈవో కార్యాలయానికి పట్టిన అవినీతి పీడ విరగడవుతుందో లేదో చూడాలి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement