ఇప్పటి వరకు చేసిందేమీ లేదు
తాజాగా జియో టాగింగ్, డీఎన్‌ఏ పరీక్షలట
ఎలిఫెంట్ క్యాప్చరింగ్ లేకుండా అన్నీ
వృథాప్రయాసే
కుంకీలున్నా కట్టడి కాని గజరాజుల దాడులు
పలమనేరు: చిత్తూరు జిల్లాలోని పలమనేరు, కుప్పం, పూతలపట్టు, పుంగనూరు నియోజకవర్గాల పరిధిలో ని కౌండిన్య అభయారణ్యం 250 కిలోమీటర్లకు విస్తరించి ఉంది. ఈ అడవితోపాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని అడవుల్లో ఏనుగులు సంచరిస్తున్నాయి. మొత్తం 105 ఏనుగులు ఉన్నాయి. కౌండిన్య ఎలిఫెంట్ శాంక్చురీలోనే 56 వరకు ఏనుగులు గుంపులుగా ఉన్నాయి. ఇవేగాక పక్కరాష్ట్రాల నుంచి ఏనుగులు ఇక్కడికి వస్తుంటాయి. ఈ ఏనుగులు పంట పొలాలపై దాడులు చేస్తున్నాయి. అడవి నుంచి బయటకు రాకుండా కట్టడి చేసేందుకు అటవీశాఖ అధికారులు సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటుచేశారు. అలాగే కందకాలు తవ్వారు. అయినా ప్రయోజనం లేదు. కూటమి ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కుంకీ ఏనుగుల ద్వారా ఏనుగులను కట్టడి చేయడానికి పలమనేరు మండలం మొసలిమడుగు వద్ద కుంకీ ఎలిఫెంట్ ప్రాజెక్టును చేపట్టింది. అయినా ఏనుగుల సమస్య ఏమాత్రం అదుపులోకి రాలేదు. పంట నష్టం, ప్రాణ నష్టం తప్పడం లేదు. కుంకీల సంరక్షణకు సైతం నిధుల సమస్య కీలకంగా మారింది.
జనం ప్రాణాలు పోతున్నా..
ఏనుగుల దాడుల్లో 2012 నుంచి ఇప్పటి వరకు మొత్తం 34 మంది ప్రాణాలను కోల్పోయారు. 25 మందికి పైగా గాయపడ్డారు. ఏనుగుల బారిన పడి 64 పశువులు మృతిచెందాయి. ఈ దాడులను ఎక్కువగా చేసింది మదపుటేనుగులేనని అధికారులు గుర్తించారు. ఇక ఏనుగుల కారణంగా 9 వేల ఎకరాల్లోని పంటలు దెబ్బతిన్నాయి. అడవిని దాటి బయటకొచ్చే సమయంలో విద్యుత్ షాక్‌తోపాటు పలు కారణాలతో ఇప్పటి వరకు 24 ఏనుగులు మృత్యువాతపడ్డాయి.
నెరవేరని కుంకీల లక్ష్యం
ఏనుగుల సమస్యను పరిష్కరించేందుకు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కొన్నేళ్లుగా కుంకీ ఆపరేషన్లు చేస్తున్నారు. అక్కడ విజయవంతం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం పలమనేరు ఎలిఫెంట్ క్యాంపునకు దుబేరా బేస్ క్యాంపు నుంచి నాలుగు కుంకీ ఏనుగులు, రామకుప్పం ననియాల నుంచి రెండు ఏనుగులను తెప్పించింది. వాటికి ఈ ప్రాంతాన్ని అలవాటు చేసి తర్వాత అడవిలోని ఏనుగులను కట్టడి చేయాలని నిర్ణయించారు. ముందుగా మదపుటేనుగులను గుర్తించి వాటికి మత్తుచ్చి కుంకీల సాయంతో క్యాంపునకు తీసుకురావాల్సి రావాలి. వాటిని ఎలిఫెంట్ క్రాల్స్‌లో బంధించి ఆరునెలలపాటు శిక్షణ ఇస్తే కుంకీలుగా మారి డాడులు చేయకుండా మాట వింటాయి. ఈ ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు. ఇలా ఉండగా ననియాల ప్రాజెక్టు నుంచి తీసుకువచ్చిన వినాయక, జయంత్ అనే రెండు ఏనుగులను మళ్లీ అక్కడికే పంపించారు. ప్రస్తుతం ఇక్కడి క్యాంపులో అభిమన్యు, క్రిష్ణ, దేవా, రంజన్ అనే నాలుగు ఏనుగులు మాత్రమే ఉన్నాయి.
భారంగా మారిన కుంకీల సంరక్షణ
ఏనుగుల సమస్య అదుపులోకి రాలేదని రైతుల ఆవేదనవ్యక్తం చేస్తున్నారు. కుంకీలకు మేత, ఆహారం కోసం అటవీశాఖకు మరింత భారంగానే మారింది. ఇక్కడి క్యాంపు నిర్వహణకు నెలకు రూ.లక్షలు వెచ్చించాల్సి వస్తోంది. అంతేగాక ఇక్కడి అటవీ రేంజిలో పనిచేస్తున్న సిబ్బంది అడవులకు సంబందించిన పనులను పక్కనబెట్టి కుంకీ ఏనుగుల పనుల్లోనే బిజీగా మారిపోయారు.
కుంకీలతో శిక్షణ,
ట్రయల్స్‌కే పరిమితం
బయటి రాష్ట్రాల్లో క్యాప్చరింగ్ ఇలా..
మదపుటేనుగులు ప్రమాదకరమైనవి. ఇవే ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి. వీటిలో కొన్ని ఒంటరిగా సంచరిస్తుండగా మరికొన్ని గుంపుల్లో ఉన్నాయి. కుంకీలు నాలుగు దిశల్లోకి వెళ్లి గుంపులోని మదపుటేనుగులను అదుపుచేయాలి. ఆ సమయంలో మావటీలు మత్తుసూది ఇచ్చి వాటిని బంధించి క్యాంపునకు తీసుకురావాలి. తర్వాత క్రాల్స్‌లో బంధించి మూడు నుంచి ఆరు నెలలపాటు శిక్షణ ఇచ్చిన తర్వాత అవి కుంకీలుగా మారుతాయి. ఈ ప్రక్రియ కర్ణాటక, తమిళనాడులో సాగుతోంది. అదేవిధంగా ఇక్కడి మదపుటేనుగులను కట్టడి చేయాలంటే ఇంకా మూడేళ్లు పట్టే అవకాశం ఉంది. అప్పటి వరకు ఏనుగుల సమస్య పూర్తిస్థాయిలో పరిష్కారం అయ్యే పరిస్థితి కనిపించడం లేదు.
ఒరిగిందేమీ లేదు
అటవీశాఖ అధికారులు గతంలో టేకుమంద ఫారెస్ట్‌లో కుంకీ ఏనుగుల ట్రయల్ రన్ చేపట్టి విజయవంతమైందని చెప్పారు. కుంకీలు అడవిలోని ఆడ ఏనుగులను మళ్లించడం సులవే. మదపుటేనులను మళ్లించడం అంతసులువైన పనికాదు. వాటి కారణంగానే పంట, ప్రాణ నష్టం జరుగుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు. వీటిని అదుపు చేయడమే కుంకీ ఆపరేషన్ ముఖ్య ఉద్దేశం. ఇందుకోసం అత్యంత కీలకమైన ప్రక్రియ క్యాప్చరింగ్ మాత్రమే. మదపుటేనుగుల క్యాప్చరింగ్ త్వరలో చేపడతామని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇక్కడున్న కుంకీలకు మనిషి చెప్పినట్టు వినే కమాండింగ్స్ ఇచ్చి వాటి ద్వారా రకరకాల సర్కస్ ఫీట్లను చేయిస్తున్నారు. వీటిని చూసేందుకు ఎక్కువగా ప్రజలు ఎలిఫెంట్ క్యాంపుకు వెళుతున్నారు.


