పనులు చేసి నెలలు గడుస్తున్నా విడుదల చేయని కూటమి ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు రూ.54.50 కోట్లు లబోదిబోమంటున్న కాంట్రాక్టర్లు
జిల్లాలో పల్లెపండుగ 2.0 నిధుల విడుదలలో జాప్యం నెలకొంది. కూటమి ప్రభుత్వం గత ఏడాది ఆగస్టు వరకు మాత్రమే నిధులు విడుదల చేసింది. అప్పటి నుంచి ఒక్క పైసా విడుదల చేయలేదు. ఇప్పటికే చాలా చోట్ల పనులు చేసి.. నిధుల కోసం కాంట్రాక్టర్లు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూడాల్సి వస్తోంది. అప్పు చేసి.. వడ్డీలు కట్టలేక.. బిల్లులు రాక ఆపసోపాలు పడాల్సిన దుస్థితి ఏర్పడింది.
ఆగస్టు వరకు చేసిన పనులకే బిల్లులు
చిత్తూరు కార్పొరేషన్: కాంట్రాక్టర్లు కూటమి ప్రభుత్వ హామీలు నమ్మారు. వడ్డీలకు అప్పు చేసి పల్లెల్లో రోడ్ల పనులు పూర్తి చేశారు. అధికారులకు క్యాడర్ వారీగా ఇవ్వాల్సిన మామూళ్లూ ఇచ్చేశారు. తీరా బిల్లులు రాక అష్టకష్టాలు పడుతున్నారు. జిల్లాలో జరిగిన పల్లెపండు 2.0 పనులకు సంబంధించి గత ఏడాది ఆగస్టు వరకు మాత్రమే బిల్లులు చెల్లింపులకు ఉత్తర్వులు వచ్చాయి. మిగిలిన ఎనిమిది నెలల బిల్లులు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి.
జిల్లాలో జరిగిన పనులు
జిల్లాలో గత ఆర్థిక సంవత్సరం సీసీ రోడ్లు, అప్రోచ్‌రోడ్లు, బీటీరోడ్డు, కాంపౌండ్‌వాల్స్, బీటీరోడ్డు పనులన్నీ కలిపి మొత్తం 1,763 పనులు మంజూరయ్యాయి. వీటికి రూ.184.93 కోట్ల మేర మంజూరు చేశారు. ఇందులో 479 పనులు పూర్తవ్వగా వాటి కోసం రూ.50.02 కోట్లు ఖర్చు చేశారు. వివిధ దశ ల్లో 138 పనులు ఉన్నాయి. వాటి కోసం రూ.14.48 కోట్లు ఖర్చు చేశారు. ఆ లెక్కన మొత్తం రూ.64.50 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో ఆగస్టు వరకు జరిగిన పనులు రూ.10 కోట్లు వరకు ఉన్నాయి. మంజూరైన మొత్తంలో ఆమోదం తెలిపినవి రూ.36.29 కోట్లు పనులు ప్రారంభం కాలేదు. సీసీ రోడ్లు 24.40 కి.మీకి 1,462 పనులు మంజూరు అవ్వగా రూ.9.85 కోట్లు మంజూరు చేశారు. అలాగే సీసీ అప్రోచ్‌రోడ్లు 55.19 కి.మీ గాను 115 పనులకు రూ.28.73 కోట్లు, బీటీరోడ్లు 106.27 కి.మీ 148 పనులకు రూ.68.43 కోట్లు, కాంపౌండ్ వాల్స్ 3 కి.మీ 32 పనులకు రూ.2.72 కోట్లు, బీటీరోడ్లు(ఆర్‌అండ్‌బీ) 4.75 కి.మీ 6 పనులకు రూ.2.16 కోట్లు మంజూరు చేశారు. ఈ లెక్కన 184.93 కోట్లు పనులకు మంజూరు కాగా అందులో రూ.50 కోట్ల పనులు పూర్తయ్యాయి. ఇంకా రూ.14.48 కోట్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. రూ.36.29 కోట్లు పనులు ఇంకా ప్రారంభం కాలేదు.
ఉపాధి సాఫ్ట్‌వేర్‌తో ఇబ్బందులు
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును వీబీజీ రాంజీగా మార్పు చేశారు. సాఫ్ట్‌వేర్‌ను కూడా అందుకు అనుగుణంగా మారుస్తున్నారు. దీనివల్ల ఉపాధి పనులకు సంబంధించి పాత బిల్లులకు ఇబ్బంది కలగవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఎంజీఎన్‌ఆర్‌ఈఎస్‌లో మెటీరియల్ కాంపోనెంట్ కింద కేంద్ర ప్రభుత్వం 75 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 25 శాతం భరిస్తోంది. అలాగే లేబర్ కాంపోనెంట్ వందశాతాన్ని కేంద్రమే భరిస్తోంది. ప్రస్తుతం పేరు, సాఫ్ట్‌వేర్ మారుస్తున్న నేపథ్యంలో మెటీరియల్ కాంపోనెంట్, లేబర్ కాంపోనెంట్ 60 శాతం కేంద్రం, రాష్ట్రం 40 శాతాన్ని భరించాలి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభ్తుత్వం తన వాటాను నిర్ణీత సమయంలోగా విడుదల చేయకపోతే, పాత బిల్లులు వీబీజీ రాంజీ సాఫ్ట్‌వేర్‌లో మెర్జ్ అయితే మెటీరియల్ కాంపోనెంట్ శాతం తగ్గే ప్రమా దం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పల్లెపండుగ 2.0 నిధుల విడుదలలో జాప్యం
డబ్బులు రావాల్సి ఉంది
ఎన్‌ఆర్‌జీఎస్ ద్వారా జరిగిన పనులకు సంబంధించి డబ్బులు రావాల్సి ఉంది. గత ఏడాది ఆగస్టు వరకు జరిగిన పనులకు బిల్లులు ఆప్‌లోడ్ చేయాలని ఆదేశాలొచ్చాయి. దీనికి తోడు ఉపాధి సాఫ్ట్‌వేర్ మారడం వల్ల కొంత ఆలస్యం అవుతోంది. బిల్లులు విడతల వారీగా నిధులు వచ్చిన వెంటనే విడుదల అవుతాయి.
– చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్‌ఈ , పీఆర్
2025 ఆగస్టు వరకు చేసిన పనులకే బిల్లుల అప్‌లోడ్ చేయాలని కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అంటే అంతవరకు దాదాపు రూ.10 కోట్లు వరకు మాత్రమే పనులు చేశారు. మొత్తం రూ.64.50 కోట్ల పనులు జరిగితే పది కోట్ల పనులకు మాత్రమే బిల్లులను ఆప్‌లోడ్ చేయాలని ఆదేశాలు రావడంతో కాంట్రాక్టర్లు లబోదిబోమంటున్నారు. జిల్లాలో ఆగస్టు తర్వాతనే పనులు ఎక్కువగా జరిగాయి. ఆ పనులకు బిల్లుల చెల్లింపునకు సంబంధించి ఎటువంటి ఉత్తర్వులు రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.


