ప్రకృతి పచ్చ సంపద | - | Sakshi
Sakshi News home page

ప్రకృతి పచ్చ సంపద

May 8 2026 11:08 AM | Updated on May 8 2026 11:08 AM

ఇసుక, గ్రావెల్‌, మట్టి తరలింపునకు

అనధికారిక అనుమతులు

ఒక్కో అనుమతికి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల మామూళ్లు

తరలించే ప్రతి వాహనానికీ ఓ మంత్రికి రూ.వెయ్యి మామూలు

రోజూ వందల సంఖ్యలో వాహనాల్లో అక్రమ రవాణా

తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో ఇసుక, గ్రావెల్‌, మట్టి బంగారమైంది. ఇవి అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. అనధికారికి అనుమతులతో రేయింబవళ్లు యథేచ్ఛగా పొరుగునే ఉన్న తమిళనాడుకు తరలించేస్తున్నారు. అయినా అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారు. ఈ నెలవారీ మామూళ్లలో ఓ పచ్చ మంత్రికీ వాటాలు వెళుతున్నట్లు సమాచారం. ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు గండి పడడంతోపాటు ప్రకృతి విధ్వంసం అవుతోంది.

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: ప్రకృతి సంపదను అక్రమంగా అమ్మి సొమ్ము చేసుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వంలోని ఓ మంత్రి ఆదేశాలతో అధికార బృందం అనుమతులు ఇచ్చింది. అధికారుల అండతో చిత్తూరు, తిరుపతి జిల్లాలో మైనింగ్‌ దొంగలు చెలరేగిపోతున్నారు. అక్రమంగా తవ్వి విక్రయించే సొమ్ము నుంచి నాలుగు శాఖల అధికారులకు నెలనెలా మామూళ్లు వెళ్తున్నట్లు సమాచారం. అలాగే ఆ మంత్రికి కూడా అక్రమ సంపాదనలో నెలనెలా డబ్బుల పంపుతున్నట్టు కూటమికి చెందిన ఓ నాయకుడు తన అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి నియోజక వర్గం నుంచి ఇసుక, మట్టి, గ్రావెల్‌, మైనింగ్‌ అక్రమ సంపాదనలో మామూళ్లు తీసుకెళ్లి ఇవ్వాల్సిందేనని చెప్పడం విశేషం. తిరుపతి, చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తి, సత్యవేడు, సూళ్లూరుపేట, చంద్రగిరి, నగరి, గంగాధనెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు నియోజక వర్గాల పరిధిలో గత రెండేళ్లుగా విచ్చలవిడిగా ఇసుక, మట్టి, గ్రావెల్‌, మైనింగ్‌ అక్రమ తవ్వకాలు జరిపి తమిళనాడుకు తరలిస్తున్న విషయం తెలిసిందే. ఈ అక్రమాల విషయం ప్రతి రోజూ ఏదో ఒక పత్రిక, మీడియాలో ప్రసారం అవుతున్నా.. రెండు రోజులు ఆపి, మళ్లీ యథావిధిగా కొనసాగిస్తున్నారు. అలా కొనసాగించడానికి కారణం ఏమిటని కూటమి నేతలను ఆరా తీస్తే.. ‘మాదేం లేదు. నెలనెలా ఆ మంత్రికి తీసుకెళ్లి ఇవ్వాలి. ఇవ్వకపోతే ఏమైంది, ఈ నెల రాలేదు’ అని అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.

అధికారులు అడ్డుకోవడం మర్చిపోయారు

ప్రకృతి సంపదను అక్రమంగా తవ్వి, తరలించే వారిపై అధికారులు ఉక్కుపాదం మోపేవారు. కేసులు పెట్టడం, అపరాధ రుసుములు వసూలు చేయడం చేసేవారు. అందుకే అక్రమార్కులు ఆ పనులకు వెళ్లాలంటే భయపడేవారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఆ ప్రయత్నాలే చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమ తవ్వకాలు, రవాణా గురించి అధికారులకు సమాచారం ఉన్నా.. స్థానికులు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేసినా పట్టించుకునే అధికారి కరువయ్యారు. అక్రమాలకు అధికారే అనధికారిక అనుమతులు ఇవ్వడమే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.

నాగలాపురం మండలంలో ఇష్టారాజ్యంగా గ్రావెల్‌ తవ్వకాలు

గుడిపాల మండలం మంచినీళ్ల కుంట వద్ద డంప్‌చేసిన ఇసుక

అనుమతులు ఇలా..

తిరుపతి, చిత్తూరు జిల్లాలోని పలు నియోజక వర్గాల్లో భారీగా ఇసుక, మట్టి, గ్రావెల్‌ అక్రమంగా తవ్వి, తరలించాలంటే ముందుగా జిల్లా అధికారి ఒకరికి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు సమర్పించాలి. ఆ తరువాత స్థానికంగా ఉన్న నాలుగు శాఖల అధికారులకు నెలనెలా మామూళ్లు ఇచ్చేయాలి. జిల్లా, నియోజక వర్గ, మండల స్థాయిలో పంపకాలు ఇలా ఉంటే.. మంత్రి గారికి ప్రతి వాహనానికి రూ.వెయ్యి ఇచ్చేయాలి. అలా రోజుకు ఎన్ని వాహనాల ద్వారా ఇసుక, మట్టి, గ్రావెల్‌ తరలిస్తే అన్ని రూ.వేలు ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్క సత్యవేడు నియోజక వర్గంలోనే 41 క్వారీలు ఉంటే.. రోజుకి 50 వాహనాలు, నెలకు 25 వేలు ట్రిప్పులు తరలిస్తున్నాయి. ఈ లెక్కన ఒక సత్యవేడు నియోజక వర్గం నుంచే నెలకు సుమారు రూ.3 కోట్లు మామూళ్లు వెళుతున్నట్లు అంచనా. ఒక్క సత్యవేడు నియోజక వర్గం నుంచే ఇలా ఉంటే.. తిరుపతి, చిత్తూరు జిల్లాలోని మిగిలిన ఏడు నియోజక వర్గాల నుంచి నెలకు ఎంత మొత్తంలో అక్రమ రవాణా జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. ఆరు నియోజక వర్గాల్లో మాత్రం ఎక్కువ శాతం స్థానిక నాయకులే జేబులు నింపుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

అక్రమాలకు

అధికారిక అనుమతులు

రేయింబవళ్లు తరలింపు..

అక్రమ సంపాదన కోసం స్థానిక టీడీపీ నేతలు రేయింబవళ్లు ఇసుక, మట్టి, గ్రావెల్‌, మైనింగ్‌ తవ్వకాలు జరుపుతున్నారు. భారీ యంత్రాల ద్వారా తవ్వి పక్కనే ఉన్న తమిళనాడుకు తరలిస్తున్నారు. టిప్పర్ల ద్వారా తరలించి తమిళనాడులో అధిక ధరకు విక్రయించి సొమ్ముచేసుకుంటున్నారు. అక్రమ తవ్వకాల గురించి ఎవరైనా మాట్లాడితే వారిపై దాడులకు తెగబడుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్వారీల వద్దకు గుర్తు తెలియన వ్యక్తులకు అనుమతులు ఉండవు. క్వారీల సరిహద్దుల్లోనే అనుచరులను కాపాలా ఉంచుతున్నారు. ఎవరైనా కొత్త వ్యక్తి క్వారీలోకి ప్రవేశిస్తుంటే.. వెంటనే అక్రమార్కులకు సమాచారం ఇస్తారు. కొత్త వ్యక్తిని ఫాలో అవుతారు. క్వారీ వివరాల కోసమే వెళ్లి ఉంటే వారిపై దాడులకు తెగబడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. విలేకరులు ఎవరైనా వెళితే.. వారిపైనా దాడులకు యత్నిస్తున్నట్లు తెలిసింది.

Advertisement
 
Advertisement
Advertisement