ఒక నెల.. ఒక గ్రామం.. తూతూమంత్రం! | - | Sakshi
Sakshi News home page

ఒక నెల.. ఒక గ్రామం.. తూతూమంత్రం!

May 8 2026 11:08 AM | Updated on May 8 2026 11:08 AM

● జిల్లాలో మొదటి రోజే నామమాత్రపు గ్రామ పర్యటనలు ● చుట్టపు చూపుగా వచ్చి వెళ్లిన తహసీల్దార్లు ● అధికారులు నిర్ధేశిత సమయం కంటే గంటల కొద్దీ ఆలస్యంగా హాజరయ్యారు. తహసీల్దార్లు వచ్చిన కొద్ది సేపటికే తదుపరి కార్యక్రమం ఉంది అంటూ కొంత మంది తహసీల్దార్లు జారుకోవడం ప్రధాన లోపంగా కనిపించింది. ● తహసీల్దార్లు గుడులు, రచ్చబండలు, గ్రామ కార్యాలయాలు, పాఠశాలల్లో కాసేపు కూర్చు ని వినతులు స్వీకరించి వెళ్లిపోయారు. ● పాత అర్జీలపై సమాధానం అడిగితే పరిశీలిస్తున్నాం అనే మూస సమాధానాలే తప్ప, పక్కాగా పరిష్కార తేదీ ప్రకటించలేక పోయారు. ● ప్రజలు అందజేసిన అర్జీలకు ఎలాంటి రశీదు, కంప్యూటర్‌ జనరేటెడ్‌ నెంబర్‌ ఇవ్వలేదు.

మొదటి రోజు

కనిపించిన లోపాలు

చిత్తూరు కలెక్టరేట్‌ : ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, అక్కడికక్కడే పరిష్కారం చూపాల ని తలపెట్టిన ఒక నెల..ఒక గ్రామం.. కార్యక్రమం మొదటి రోజే తూతూమంత్రంగా సాగింది. అధికారులు గ్రామాలకు వస్తున్నారా లేదా చుట్టపు చూపుగా వచ్చి వెళ్తున్నారా అన్న సందేహం వ్యక్త మైంది. గురువారం జిల్లా వ్యాప్తంగా చిత్తూరు, గంగాధరనెల్లూరు, పూతలపట్టు, కుప్పం, పలమనేరు, నగరి నియోజకవర్గాల్లోని అన్ని మండలాల్లో కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలకు ఏదో మేలు చేసేలా తలపెట్టిన ఈ కార్యక్రమం అంతా షోయింగ్‌ కోసమేనని తేలిపోయింది. తహసీల్దార్లు ఏదో నాలుగు ముక్కలు మాట్లాడి నెమ్మదిగా జారుకున్నారు.

గంట కూడా గడపలేదు!

ప్రతి గురువారం ఎంపిక చేసిన గ్రామంలో తహసీల్దార్లు, ఆర్‌ఐలు, వీఆర్‌వోలు క్షేత్ర స్థాయిలో పర్యటించి రెవెన్యూ, ఇతర సమస్యలను పరిష్కరించాల్సి ఉంటుంది. అయితే, క్షేత్ర స్థాయిలో మొదటి రోజు నిర్వహించిన కార్యక్రమంలోనే పరి స్థితి ఇందుకు భిన్నంగా కనిపించింది. కొన్ని చోట్ల సిబ్బంది కనీసం రికార్డులను కూడా తీసుకురాలేదు. మరికొన్ని గ్రామాల్లో అధికారులు గంట సేపు కూడా గడపకుండానే తిరుగుముఖం పట్టారు.

అంతా తూచ్‌!

ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం భూ సమస్యలు పరిష్కరించడం. అయితే మొదటి రోజు ఎన్ని సమస్యలు పరిష్కారమయ్యాయో వెల్లడించడానికి కలెక్టరేట్‌ అధికారులు మీనమేషాలు లెక్కపెడుతున్నారు. గణాంకాలను గోప్యంగా ఉంచడం చూస్తుంటే, క్షేత్ర స్థాయిలో ఆశించిన స్థాయిలో పని జరగలేదని స్పష్టమవుతోంది. అధికారుల నిర్లక్ష్యం, సమన్వయ లోపం వల్ల క్షేత్ర స్థాయిలో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారింది.

ప్రజా ధనం వృథాయేనా?

కార్యక్రమాల నిర్వహణ పేరిట హడావుడి చేస్తున్నారే తప్ప, సామాన్య ప్రజలకు ఒరిగేదేమీ లేదని క్షేత్ర స్థా యి పరిశీలనలో తేలుతోంది. అధికారులు కేవలం ఫొటోలకు ఫోజులు ఇచ్చేందుకే పరిమితమవుతున్నారని, పర్యవేక్షణ లోపం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని రెవెన్యూ విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement