టమాట బాక్సు ధర రూ.350 | - | Sakshi
Sakshi News home page

టమాట బాక్సు ధర రూ.350

May 8 2026 11:08 AM | Updated on May 8 2026 11:08 AM

● రూ.400 అమ్మితేనే గిట్టుబాటు ● అయోమయంలో రైతులు

పలమనేరు: పలమనేరు టమాటా మార్కెట్‌లో గురువారం 15 కిలోల బాక్సు రూ.350 దాకా పలకింది. భారీ పెట్టుబడులు పెట్టి సాగుచేసిన రైతులకు నష్టాలు తప్పవేమోనని పలువురు ఆవేదన చెందుతున్నారు. ఇలాగే కొనసాగితే అప్పుల ఊబిలో కూరుకుపోవాల్సి వస్తుందని పలువురు పేర్కొంటున్నారు. బాక్సు రూ.400 విక్రయిస్తే కొంత మేర గిట్టుబాటు అవుతుందని చెబుతున్నారు.

ఎకరానికి పెట్టుబడి రూ.3లక్షలు

ప్రస్తుతం ఈ ప్రాంతంలో హైబ్రిడ్‌ రకాలైన పవర్‌అప్‌, సాహో, జయహో, ప్రభాకర్‌ సీడ్స్‌, సింజెంటా కంపెనీలకు చెందిన రకాలను ఎక్కువగా సాగుచేస్తున్నారు. ఎకరంలో టమాట సాగుకు రూ.3 లక్షల దాకా పెట్టుబడి అవుతున్నట్టు రైతులు పేర్కొంటున్నారు.

రైతుకు తప్ప అందరికీ లాభమే

పంట కోసం వచ్చే కూలీలకు రోజుకు రూ.400, ర వాణా చేసే వారికి, మండీలోని కూలీలు, వ్యాపారు ల కమీషన్‌ ఇలా అందరికీ గ్యారెంటీ లాభాలుండగా కేవలం రైతుకు మాత్రమే నష్టాలు తప్పడం లేదు.

1000 బాక్సులైతే

పంట దిగుబడి బాగా వచ్చి 1000 బాక్సులు కోస్తే ఇప్పుడున్న ధర రూ.350తో రూ.3.5 లక్షలు, బాక్సు ధర రూ.200 అయితే రూ.2 లక్షలు, సగటున రూ.250 అయితే రూ.2.5 లక్షలు మాత్రమే గిట్టు బాటు అవుతుంది. బాక్సు ధర రూ.400గా ఉంటేనే గిట్టుబాటు గా ఉంటోంది.

కష్టంగా మారింది

ప్రస్తుతం రోజుకు 50 బాక్సుల టమాటా మార్కెట్‌కు వేస్తున్నా. ఎకరా పొలంలో పంటసాగుకు రూ.2.7 లక్షలు ఖర్చుపెట్టా. ఇప్పు డున్న ధరలుంటే పెట్టుబడి దక్కుతుంది. ధరలు తగ్గుముఖం పడితే మా పరిస్థితి గోవిందా. అందుకే ప్రభుత్వం మద్దతు ధరను పెట్టాలి.

– కృష్ణారెడ్డి, టమాట రైతు,

పెద్దవెలగటూరు, పెద్దపంజాణి మండలం

Advertisement
 
Advertisement
Advertisement