పోలీసుల అదుపులోకి విలేకరి హంతకులు | - | Sakshi
Sakshi News home page

పోలీసుల అదుపులోకి విలేకరి హంతకులు

May 8 2026 11:08 AM | Updated on May 8 2026 11:08 AM

● కర్ణాటక నుంచి పీటీ వారెంట్‌తో తరలింపు ● పలమనేరు కోర్టులో హాజరు ● 15 రోజుల రిమాండ్‌తో మదనపల్లి సబ్‌జైలుకు ● విచారణలో నిగ్గుతేలనున్న హత్యకు కారణాలు

పలమనేరు: చిత్తూరు జిల్లాలోని పలమనేరు నియోజకవర్గం వీకోట మండలంలో జరిగిన విలేకరి జగన్‌మోహన్‌రెడ్డి హత్య కేసులో నిందితులను వీకోట పోలీసులు కర్ణాటకలోని ఎలక్ట్రానిక్‌సిటీ పీఎస్‌ నుంచి పీటీ వారెంట్‌పై తీసుకొచ్చి స్థానిక డీఎస్పీ డేగల ప్రభాకర్‌ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం కోర్టులో హాజరుపరిచారు. ఇక్కడి జడ్జి నిందితులకు 15 రోజుల రిమాండ్‌ విధిస్తూ మదనపల్లి సబ్‌జైలుకు తరలించాల్సిందిగా ఆదేశించారు. నేడు దీనిపై మరో పిటిషన్‌ వేసి స్థానిక పోలీసులు కస్టడీకి తీసుకోనున్నారు.

కర్ణాటకలో అంత త్వరగా

ఇవ్వని పీటీ వారెంట్‌

గత నెల 29న వీకోటకు చెందిన ఆంధ్రజ్యోతి విలేకరి జగన్‌మోహన్‌రెడ్డిని ఇద్దరు వ్యక్తులు కత్తులతో దాడి చేసి చంపిన విషయం తెలిసిందే. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలం రేపింది. ఇందులో నిందితులుగా భావిస్తున్న అదే వీకోటకు చెందిన తమీమ్‌, అతని మేనత్త కొడుకు సుభాన్‌ తెలివిగా పాత కేసుల్లో కర్ణాటకలోని ఎలక్ట్రానిక్‌సిటీ పోలీసులకు హత్య జరిగిన రెండో రోజే సరెండర్‌ అయ్యారు. ఈ నేపథ్యంలో స్థానిక పోలీసులు అక్కడికి వెళ్లి పీటీ వారెంట్‌ దాఖలు చేయగా వారు తిరష్కరించారు. దీంతో మళ్లీ ఇక్కడి పోలీసులు కోర్టు ఆర్డర్‌ ద్వారా పీటీ వారెంట్‌ తీసుకున్నారు.

పలమనేరు కోర్టుకు తరలింపు

నిందితులను కర్ణాటక నుంచి కట్టుదిట్టమైన భద్రత మధ్య వీకోట సీఐ సోమశేఖర్‌రెడ్డి, ఎస్‌ఐ షేక్‌షావలి వారి సిబ్బందితో కలిసి గురువారం పలమనేరు కోర్టుకు తీసుకొచ్చారు. దీనిపై న్యాయమూర్తి వీరికి 15 రోజుల రిమాండ్‌ విధిస్తూ పలమనేరులో జైలు లేనందున మదనపల్లికి తరలించాల్సిందిగా ఆదేశించారు. నేడు పోలీసులు స్థానిక కోర్టులో పిటిషన్‌ ఫైల చేసి నిందితులను కస్టడీకి కోరనున్నట్టు స్థానిక డీఎస్పీ డేగల ప్రభాకర్‌ తెలిపారు.

తేలనున్న వాస్తవాలు

స్థానిక పోలీసులు పది రోజుల కస్టడీకీ కోర్టును కోరే అవకాశం ఉన్నా కోర్టు ఆదేశాల మేరకు ఎన్ని రోజులనే విషయం నేడు తేలనుంది. ఆపై నిందితులను సమగ్రంగా విచారించాకే విలేకరిపై హత్యకు సంబంధించిన వాస్తవాలు వెలుగుచూసే అవకాశం ఉంటుంది.

Advertisement
 
Advertisement
Advertisement