తిరుపతి సిటీ: బీఈడీ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న ఏపీ ఎడ్‌సెట్–2026 శుక్రవారం జరగనుంది. కుప్పం ద్రావిడ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పరీక్షకు తిరుపతి జిల్లాలో రెండు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 12.30 నుంచి 2.30 గంటల వరకు రెండు సెషన్లలో జరగనున్న ఈ పరీక్షకు తిరుపతి జాపార్క్ సమీపంలోని అయాన్ డిజిటల్ సెంటర్‌లో 800 మంది, పుత్తూరు వెంకటేశ పెరుమాళ్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో 160 మంది పరీక్షకు హాజరుకానున్నారని వెల్లడించారు. నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రాల్లోనికి అనుమతి ఉండదని సూచించారు.
బస్సుల్లో చోరీలు.. కుప్పం దొంగ అరెస్టు
కృష్ణరాజపురం (బెంగళూరు): బస్సుల్లో వెళ్తూ ప్రయాణికుల దృష్టి మరల్చి బంగారు నగలను దొంగిలించడంలో పేరుగాంచిన, ఆంధ్రప్రదేశ్‌లోని కుప్పంకు చెందిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను బెంగళూరు రూరల్‌లోని హొసకోట పోలీసులు అరెస్టు చేశారు. చిన్నపిల్లలు వాంతులు చేసుకుంటున్నారని చెప్పి మహిళల నగలను కొట్టేశారు. ఇదే మాదిరిగా ఓ వృద్ధురాలి మెడలో ఉన్న 74 గ్రాముల బంగారు గొలుసును దొంగిలించి పారిపోయారు. ఆమె ఫిర్యాదు మేరకు హొసకోట పోలీసులు దర్యాప్తు నిర్వహించి, ముఠాలో ప్రధాన నిందితుడైన దివాకర్‌ను అరెస్టు చేశారు. మిగిలిన నిందితులు మోనిషా, గాయత్రి, ఇంద్ర కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. దివాకర్ నుంచి రూ.12 లక్షల విలువైన బంగారం, రూ.3.50 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


