ఇంకెన్నాళ్లు..
చిత్తూరు నగర వాసుల డ్రీమ్ ప్రాజెక్టు అడవిపల్లె నుంచి మంచినీటిని తీసుకురావడం. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 22 నెలలు దాటుతున్నా ఈ పనులు నత్తలతో పోటీపడుతున్నాయి. జిల్లాకు ముఖ్యమంత్రి వచ్చిన ప్రతిసారీ మరో ఆర్నెళ్లల్లో చిత్తూరుకు తెలుగుగంగ నీటిని అందిస్తామని వాగ్ధానం చేసి వెళ్లిపోతుంటారు. కానీ క్షేత్రస్థాయి పనులను పట్టించుకునే దిక్కులేకుండాపోయింది.
చిత్తూరు–పెనుమూరు
క్రాస్ వద్ద
మట్టికొట్టుకుపోయిన పైపులైన్లు
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరానికి తొలుత ఒక టీఎంసీ తెలుగుగంగ నీటిని ఇవ్వడానికి అడవిపల్లె రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకొచ్చే ప్రతిపాదన 2018లో మొదలైంది. అన్నమయ్య జిల్లాలో ఉన్న కెవి.పల్లె మండలంలో అడవిపల్లె రిజర్వాయర్ ఉంది. ఇక్కడ 18 టీఎంసీ నీళ్లను ఒడిసి పట్టొచ్చు. హంద్రీ–నీవా ప్రధాన కాలువ నిర్మాణాలు పూర్తయితేనే అడవిపల్లెకు తెలుగుగంగ నుంచి నీళ్లు వచ్చి చేరుతాయి. ఈ పనులు ఇంకా పూర్తికాలేదు. ఇక అడవిపల్లె రిజర్వాయర్ నుంచి చిత్తూరు నగరానికి నీళ్లు తీసుకురావాలనే లక్ష్యంలో రూ.250 కోట్లతో ఉన్న అంచనాలు ప్రస్తుతం రూ.279 కోట్లకు చేరుకుంది. ఈ మొత్తంలో కేంద్రం వాటా రూ.62.29 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.24.51 కోట్లు, చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్ వాటాగా రూ.184 కోట్లు ఉంది. ఇందులో కేంద్రం అమృత్ 1.0 కింద రూ.46 కోట్లు విడుదల చేయగా, 2.0 కింద రూ.30 కోట్లు విడుదలయ్యాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయంలో రాష్ట్ర వాటాగా రూ.18 కోట్లు విడుదల చేశారు. ఇది కాకుండా చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్ పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి రూ.104.22 కోట్లు అప్పు చేయగా, రూ.62 కోట్లు 14వ ఆర్థిక సంఘ నిధుల నుంచి భరించింది. అయినాసరే అడవిపల్లె రిజర్వాయర్ పనులు పూర్తికాలేదు.
మోయలేని భారం
అడవిపల్లె ప్రాజెక్టు పనులను జూన్‌లోపు పూర్తిచేస్తామని ఇటీవల కుప్పంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. గతేడాది సైతం ఇలాగే చెప్పారు. కానీ పనులు మాత్రం పూర్తికాలేదు. ఎప్పుడవుతుందో కూడా స్పష్టతలేదు. ఇక ప్రతీనెలా బ్యాంకుకు రూ.1.15 కోట్ల మేర నెలవారీ వాయిదాలు చెల్లించడానికి చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్ పడుతున్న ఇబ్బందులు గుదిబండగా మారాయి. కలెక్టర్ కల్పించుకుని పబ్లిక్‌హెల్త్, జాతీయ రహదారులు, మునిసిపల్ కార్పొరేషన్ శాఖలతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించి.. వెంటపడితే తప్ప ఈ పనుల్లో పురోగతి కనిపించే అవకాశంలేదు.


