చిత్తూరు అర్బన్: మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో ఆస్తిపన్ను వసూలు చేయడానికి మంగళవారంతో గడువు ముగిసింది. చివరి రోజున జిల్లాలోని ఓ కార్పొరేషన్‌తో పాటు మూడు మునిసిపాలిటీలలో రూ.2.08 కోట్ల ఆస్తిపన్నులు వసూలయ్యాయి. ఆస్తి పన్నుపై 50 శాతం వడ్డీ మాఫీ చేస్తూ ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం, మార్చి 31వ తేదీలోపు ఒకేసారి బకాయిలు చెల్లించిన వాళ్లకు మాత్ర మే అది వర్తిస్తుందని షరతు పెట్టడం తెలిసిందే. అయితే మొండి బకాయిలు పెద్దగా వసూ లు కాలేదు. మొత్తంగా చివరి రోజున చిత్తూరు కార్పొరేషన్‌కు రూ.1.3 కోట్లు, కుప్పం మునిసిపాలిటీకి రూ.50 లక్షలు, పలమనేరు రూ.16 లక్షలు, నగరిలో రూ.13 లక్షలు చొప్పున ఆస్తి పన్ను వసూలైంది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఆస్తిపన్నుల వసూళ్లలో 9.47 శాతం పెరుగుదల కనిపించింది.
ఇంజినీరింగ్ కాలేజ్
వ్యాన్ బోల్తా
ఐరాల: మండలంలోని పొలకల సమీపంలోని టీటీడీ కల్యాణ మండపం వద్ద మంగళవారం సాయంత్రం పీలేరుకు చెందిన ఓ ఇంజినీరింగ్ కాలేజ్ వ్యాన్ బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ విద్యార్థికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల కథనం మేరకు.. మండల పరిధిలోని పలు గ్రామాలకు చెందిన విద్యార్థులు పీలేరు సమీ పంలోని ఓ ఇంజినీరింగ్ కాలేజ్‌కి వెళ్తుంటారు. రోజూ మాదిరిగానే ఉదయం విద్యార్థులు వ్యాన్‌లో కాలేజ్‌కి వెళ్లారు. తిరిగి సాయంత్రం వ్యాన్‌లో వస్తుండగా టీటీడీ కల్యాణ మండపం వద్దకు రాగానే వ్యాన్ అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో వ్యాన్‌లో కూర్చున్న మండలంలోని నెల్లిమందపల్లెకు చెందిన యువరాజుకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
గుట్కా ప్యాకెట్ల స్వాధీనం
గుడిపాల: మండలంలో అక్రమంగా తరలుతున్న 16 గుట్కా ప్యాకెట్ల బస్తాలను స్వాధీనం చేసుకున్నట్లు గుడిపాల ఎస్‌ఐ రామ్మోహన్ తెలిపారు. గుడిపాల మండలం, బొమ్మసముద్రం క్రాస్‌కు చెందిన సురేష్, మంజునాఽథ్, కిరణ్ మంగళవారం ఆటోలో చిత్తూరు నుంచి బొమ్మసముద్రంకు గట్కా ప్యాకెట్లు తీసుకొస్తున్నట్టు సమాచారం అందిందన్నారు. ఈ నేపథ్యంలో నరహరిపేట క్రాస్ నుంచి పశుమంద క్రాస్ మధ్యలో తనిఖీ చేయగా వారు పట్టుబడ్డారన్నారు. వీరిని విచారించగా బొమ్మసముద్రంలో చిల్లర అంగడికి తీసుకువెళ్తున్నట్టు చెప్పారన్నారు. ఇందులో 16 గుట్కా ప్యాకెట్ల బస్తాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. వీటి విలువ సుమారు రూ.1,80,000 ఉంటుందన్నారు. దీనిపై సేల్స్‌ట్యాక్స్ అధికారులకు నివేదికలు పంపినట్టు వెల్లడించారు.
ఒంటరి ఏనుగు హల్‌చల్
చంద్రగిరి: మండలంలోని ఎగువ కూచివారిపల్లిలో సోమవారం అర్ధరాత్రి ఒంటరి ఏనుగు స్థ్వైర్య విహారం చేసింది. అరటి, వరి పంటలతోపాటు ఫెన్సింగ్ రాళ్లు, మోటార్లను ధ్వంసం చేసింది. నెల రోజులుగా ఏనుగు పొలాలపై దాడులు చేస్తుండటంతో సర్వం కోల్పోతున్నా మని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా స్థాయి అధికారులు ప్రత్యేక చర్యలు చేప ట్టి, గజదాడులను అడ్డుకోవాలని కోరుతున్నారు.
నలుగురిపై క్రిమినల్ కేసులు
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలో వక్ఫ్ భూములను అక్రమంగా విక్రయించడంపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఆడిటర్ మహ్మద్‌రియాజ్ ఫిర్యాదు చేయడంతో నలుగురిపై కేసు నమోదు చేశారు. నగరంలోని మండీ వీధిలో ఉన్న వక్ఫ్ భూము లు ఆక్రమించి, తప్పుడు పత్రాలతో విక్రయించారని, ఇందులో నలుగురు వ్యక్తులు మోసాల కు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై ఎస్‌కె.హుస్సేన్, ఎస్.సత్రాజ్, ఎస్.ఫరీదా, బి.సుజాతపై వన్‌టౌన్ సీఐ మహేశ్వర కేసు నమోదు చేశారు.
కోచింగ్‌కు దరఖాస్తుల ఆహ్వానం
వెంకటగిరి రూరల్: ఏపీ జోన్–4 పరిధిలో ఏపీ మోడల్ స్కూళ్ల విద్యార్థులకు ఏపీ మోడల్ స్కూల్ ద్వారా ఐఐటీ, జేఈఈ, ఈఏపీ సెట్ కోచింగ్‌కు దరఖాస్తు చేసుకోవాలని ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ తులసిజ్యోతి పేర్కొన్నారు. మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఏపీ జోన్–4 పరిధిలోని చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, కడప, అనంతపురం, సత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాల పరిధిలోని విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏప్రిల్ ఒకటి నుంచి 30వ తేదీ వరకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్క్రీనింగ్ ద్వారా ఎంపిక చేసిన వంద మంది బాలురకు శిక్షణ తరగతులు ప్రారంభించనున్నట్లు చెప్పారు.


