రామకుప్పంలో మరీ దారుణం వైద్యం వికటించి మూడేళ్ల బిడ్డ మృతి టాస్క్‌ఫోర్స్ సమావేశంలో వెల్లడి విస్తుపోయిన అధికారులు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలో కొందరు ఆర్‌ఎంపీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వైద్యం అందిస్తున్నారు. ప్రథమ చికిత్స వదిలి.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. పసి పిల్లలకు సైతం వైద్యం చేస్తూ ప్రాణాలు తీస్తున్నారు. ఇలాంటిదే రామకుప్పం మండలంలో వెలుగులోకి వచ్చింది.
నిర్లక్ష్యమే కారణమా?
రామకుప్పం ప్రాంతంలో ఓ ఆర్‌ఎంపీ వైద్యు డు మూడేళ్ల బిడ్డకు వైద్యం అందించాడు. ఆ తర్వాత వైద్యం వికటించడంతో ఆ బిడ్డ మృత్యువాత పడ్డాడు. నిర్లక్ష్య వైద్యమే తమ బిడ్డ మృతికి కారణమని బాధిత కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపించింది. ఈ విషయం చిత్తూరులోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమీక్షలో టాస్క్‌ఫోర్స్ టీం వెల్లడించింది. ఆర్‌ఎంపీ వైద్యులపై మండిపాటుకు గురైంది. క్షేత్ర స్థాయిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం, పట్టించుకోకపోవడమే కారణమని తేల్చింది. దీనికారణంగానే శిశుమరణాలు జరుగుతున్నాయని పేర్కొంది.
కఠిన చర్యలు తీసుకోవాలి
మూడేళ్ల బిడ్డ మృతికి కారణమైన ఆర్‌ఎంపీపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబంతోపాటు పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి వారిని శిక్షించకపోతే మరిన్ని పసిప్రాణాలు బలయ్యే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. జిల్లా అధికారులు వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
ఇష్టారాజ్యం
ఇటీవల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇందులో కొంతమంది ఆర్‌ఎంపీలు నకిలీ సర్టిఫికెట్లు కలిగి ఉన్నట్టు తేలింది. ఇలా పట్టుబడ్డ వారిలో కొంతమందిని వదిలిపెట్టేశారు. వారిలో చాలా మంది డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో సిబ్బందికి నెలవారీ మామూళ్లు ఇస్తున్నారనే ఆరోపణలున్నాయి. జిల్లాలో దాదాపు రెండు వేల మంది ఆర్‌ఎంపీలు ఉండగా.. అందులో 700 మంది నకిలీ సర్టిఫికెట్లు కలిగి ఉన్నారని సమాచారం.


