కేవలం హెచ్చరికలు జారీ చేస్తే సరిపోదు, క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ అవసరం.
ప్రతి మండలానికి ఒక విద్యాశాఖ అధికారిని ఇన్‌చార్జిగా నియమించి, అడ్మిషన్ తిరస్కరించిన పాఠశాలలపై వెంటనే చర్యలు తీసుకోవాలి.
ఏ పాఠశాలలో ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి, ఎన్ని భర్తీ అయ్యాయనేది బహిరంగంగా ప్రకటించాలి.
నిబంధనలు అతిక్రమించే పాఠశాలల గుర్తింపును రద్దు చేసే దిశగా అధికారులు చర్యలు చేపట్టాలి.
జిల్లాలో పేద విద్యార్థుల పాట్లు పక్కదారి పడుతున్న విద్యాహక్కు చట్టం సవాలక్ష ఆంక్షలు పెడుతున్న ప్రయివేట్ యాజమాన్యాలు పట్టించుకోని విద్యాశాఖ అధికారులు
చిత్తూరు కలెక్టరేట్ : చంద్రబాబు ప్రభుత్వం ఆర్భా టంగా ప్రకటించిన విద్యాహక్కుచట్టం (ఆర్‌టీఈ) అమలులో పెను అడ్డంకులు ఎదురవుతున్నాయి. జిల్లాలో 25 శాతం ఉచిత సీట్ల కేటాయింపు ప్రక్రియ ప్రహసనంగా మారుతోంది. లాటరీలో సీటు దక్కిందని సంతోషించిన నిరుపేద కుటుంబాలు, ప్రైవేట్ పాఠశాలల గుమ్మం తొక్కగానే తీవ్ర నిరాశకు లోనవుతున్నాయి. యాజమాన్యాలు పేద కుటుంబాల నుంచి భారీగా నగదు డిమాండ్ చేస్తున్నాయి. అడ్మిషన్ ఫీజు, పుస్తకాల యూనిఫాం, ఇతర మౌలిక సదుపాయాలు అంటూ రూ.5 వేల నుంచి రూ.15 వేల వరకు వసూలు చేస్తున్నాయి. దీనిపై కొందరు తల్లిదండ్రులు ఎంఈవో కార్యాలయల చుట్టూ తిరుగుతూ ఫిర్యాదులు చేస్తున్నా ఏమాత్రం న్యాయం జరగడం లేదు.
వేధింపులకు సరికొత్త మార్గాలు
సర్టిఫికెట్ల సమర్పణలో చిన్నపాటి వ్యత్యాసాలను కూడా సాకుగా చూపుతూ ప్రవేశాలను నిరాకరిస్తున్నారు. అద్దె ఇళ్లలో ఉండేవారికి నివాస ధ్రువీకరణ పత్రాల కోసం వేధింపులు ఎక్కువయ్యాయి. విద్యుత్ బిల్లులు, ఆధార్ కార్డు వివరాలు సరిపోవడం లేదని కొర్రీలు పెడుతున్నారు. ‘సమాచారం అందలేదు’ అనే సాకు కూడా వాడుతున్నారు. చిత్తూరు, కుప్పం, పలమనేరు, నగరి ప్రాంతాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది.
అడ్మిషన్లు దక్కక..
జిల్లా వ్యాప్తంగా మొదటి విడతలో 296 మంది విద్యార్థులు లాటరీ ద్వారా ఆర్‌టీఈ కింద ఎంపికయ్యారు. ఫోన్లకు మెసేజ్‌లు రావడంతో ఆనందంతో స్కూళ్లకు వెళ్లిన తల్లిదండ్రులకు అక్కడ చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ‘మాకు ప్రభు త్వం నుంచి ఎలాంటి లిస్టు రాలేద్ఙు, పోర్టల్ పని చేయడం లేదు’ అంటూ సాకులు చెబుతూ అడ్మిషన్లను కాలయాపన చేస్తున్నారు. ఏప్రిల్ 7వ తేదీతో గడువు ముగుస్తుండడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
పరిష్కార మార్గాలు
అధికారుల బాధ్యత
జిల్లా సమాచారం
ప్రైవేట్ ప్రాథమిక పాఠశాలలు 161
విద్యార్థులు 30,804
ప్రైవేట్ ప్రాథమికోన్నత పాఠశాలలు 85 విద్యార్థులు 13,040
ఉన్నత పాఠశాలలు 185
విద్యార్థులు 45,532
మొత్తం ప్రైవేట్ పాఠశాలలు 431
మొత్తం విద్యార్థుల సంఖ్య 89,376
హెచ్చరికలు నామమాత్రమే
విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నా, క్షేత్ర స్థాయిలో అమలు కావడం లేదు. అధికారులు కొన్ని పాఠశాలలకు నోటీసులు ఇచ్చినా, యాజమాన్యాలు ఖాతరు చేయడం లేదు. ‘మా పిల్లలకు మంచి చదువు దొరుకుతుందని ఆశించాం, కానీ ఈ వేధింపులు భరించలేకపోతున్నాం. విద్యాశాఖ అధికారులు మాకు న్యాయం చేయాలి’ అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్ మొదటి వారంలోగా ప్రక్రియ పూర్తి కావాల్సి ఉన్నా, యాజమాన్యాల మొండివైఖరి వల్ల పేద విద్యార్థుల చదువులు ప్రశ్నార్థకంగా మారాయి.


