బ్లాక్‌లో గ్యాస్‌! | - | Sakshi
Sakshi News home page

బ్లాక్‌లో గ్యాస్‌!

Mar 31 2026 8:32 AM | Updated on Mar 31 2026 8:32 AM

● ఒక్క రోజులోనే 270 కనెక్షన్లు బ్లాక్‌లో అమ్మకం ● గుడిపాల మండలంలో భారీ కుంభకోణం

– 8లో

ఓటీపీలు లేకుండానే బుకింగ్‌లు
● ఒక్క రోజులోనే 270 కనెక్షన్లు బ్లాక్‌లో అమ్మకం ● గుడిపాల మండలంలో భారీ కుంభకోణం

మంగళవారం శ్రీ 31 శ్రీ మార్చి శ్రీ 2026

యుద్ధం సాకుగా చూపి గ్యాస్‌ ఏజెన్సీలు దోపిడీకి పాల్పడుతున్నాయి. లబ్ధిదారులకు అందాల్సిన సిలిండర్లను ఏకంగా బ్లాక్‌ మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకుంటున్నాయి. ఓటీపీలు లేకుండానే గ్యాస్‌ సిలిండర్లు పంపిణీ చేస్తున్నట్టు రికార్డులు సృష్టిస్తున్నాయి. పౌరసరఫరాల శాఖ విచారణ లో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: వంట గ్యాస్‌ సరఫరాలో భారీ అక్రమాలు వెలుగు చూశాయి. వినియోగదారుల మొబైల్‌ ఫోన్లకు ఓటీపీలు రాకుండానే గ్యాస్‌ సిలిండర్లు బుకింగ్‌లు చేసి, వాటిని బ్లాక్‌ మార్కెట్‌కు మళ్లించినట్టు తేలింది. ఈ వ్యవహారం గుడిపాల మండలంలో బయటపడింది. దీనిపై సాక్షి దినపత్రికలో మూడు రోజులకు క్రితం ‘బ్లాక్‌ బండ’ శీర్షికన వార్త వెలువడింది. దీనిపై లోతుగా విచారణకు దిగిన పౌరసరఫరాల శాఖ అధికారులకు దిమ్మ తిరిగే షాక్‌ తగిలింది. ఒక్క రోజుల్లోనే 270 కనెక్షన్‌లకు ఓటీపీ లేకుండా మంగళం పాడారనే విషయం తేటతెల్లమైంది. మరింత లోతుగా విచారణ చేస్తున్నారు. త్వరలో ఓ ఏజెన్సీ నిర్వాహకుడిపై కేసు నమోదు చేసే అవకాశాలున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి.

ఓటీపీ లేకుండా బుకింగ్‌లా?

సాధారణంగా గ్యాస్‌ బుకింగ్‌ సమయంలో వినియోగదారుడి రిజిస్టర్‌ చేసిన మొబైల్‌ నంబర్‌కు ఓటీపీ పంపడం తప్పనిసరి. ఆ ఓటీపీ ద్వారా బుకింగ్‌ను ధ్రువీకరిస్తారు. కానీ గుడిపాలలో ఈ ప్రక్రియను పూర్తిగా పక్కనబెట్టి, పెద్ద ఎత్తున బుకింగ్‌లు జరిగినట్టు సమాచారం. ఇది సిస్టమ్‌లో లోపమా? లేక ఉద్దేశపూర్వక మోసమా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

‘సాక్షి’ కథనంతో కదలిక

ఈ అక్రమంపై ‘సాక్షి’లో కథనం వెలువడిన వెంటనే పౌరసరఫరాల శాఖ అధికారులు రంగంలోకి దిగారు. బాధిత వినియోగదారులను సంప్రదిస్తూ, వారి గ్యాస్‌ బుకింగ్‌ వివరాలను పరిశీలిస్తున్నారు. సాంకేతికంగా ఎలా బుకింగ్‌లు జరిగాయో తెలుసుకునేందుకు లోతైన విచారణ కొనసాగుతోంది. ప్రాథమిక ఆధారాల ప్రకారం సంబంధిత గ్యాస్‌ ఏజెన్సీపై కేసు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్రమానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.

అధికార పార్టీ ఒత్తిళ్లు?

గ్యాస్‌ ఏజెన్సీ నిర్వాహకుడిని కాపాడాలని అధికార పార్టీ నేతల నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో విచారణ ప్రక్రియపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, ఒక ఉన్నతాధికారి ఈ వ్యవహారాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం. ప్రభుత్వానికి వాస్తవాలు చెప్పకుండా తప్పుడు నివేదిక పంపించాలని ఆదేశాలు ఇచ్చారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.

భయం, అనుమానాలు

ఈ ఘటన తర్వాత స్థానిక గ్యాస్‌ వినియోగదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తమ కనెక్షన్‌ సురక్షితంగా ఉందా? తమ పేరుతో ఎన్ని బుకింగ్‌లు జరిగాయి? సబ్సిడీ దుర్వినియోగం జరిగిందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ భారీ అక్రమంపై పూర్తి నిజాలు వెలుగులోకి వస్తాయా? లేక రాజకీయ ఒత్తిళ్లతో వ్యవహారం మరుగున పడుతుందా? అన్నది ఇప్పుడు కీలకంగా మారింది. గుడిపాల గ్యాస్‌ కుంభకోణం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఒక్క రోజులోనే 270 కనెక్షన్లు?

మార్చి 23న ఒక్క రోజులోనే దాదాపు 270 మంది వినియోగదారుల గ్యాస్‌ కనెక్షన్లపై ఓటీపీ లేకుండా బుకింగ్‌లు జరిగినట్టు ప్రాథమిక విచారణలో బయటపడింది. ఇందులో చాలామంది వినియోగదారులు తమకు గ్యాస్‌ బుక్‌ అయ్యిందన్న విషయమే తెలియకపోవడం గమనార్హం. ఈ బుకింగ్‌ల వెనుక ప్రధాన ఉద్దేశం సబ్సిడీ గ్యాస్‌ను దారి మళ్లించడమే అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారికంగా వినియోగదారులకు ఇవ్వాల్సిన సిలిండర్లను అక్రమంగా విక్రయించి, అధిక ధరలకు బ్లాక్‌ మార్కెట్‌లో అమ్ముతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement