‘కోటా’కు ఊపిరి.. మళ్లీ ‘ఆల్‌ ఇండియా ‍ప్రభంజనం’? | Kota Coaching Hub Sees Strong Comeback as Admissions Rise | Sakshi
Sakshi News home page

‘కోటా’కు ఊపిరి.. మళ్లీ ‘ఆల్‌ ఇండియా ‍ప్రభంజనం’?

Mar 31 2026 9:49 AM | Updated on Mar 31 2026 10:00 AM

Kota Coaching Hub Sees Strong Comeback as Admissions Rise

కోటా: దేశంలోనే అత్యుత్తమ కోచింగ్ హబ్‌గా పేరుగాంచిన రాజస్థాన్‌లోని కోటా నగరం తిరిగి పూర్వ వైభవాన్ని సంతరించుకుంటోంది. గత రెండేళ్లుగా కొంత మందగించిన ఐఐటీ-జేఈఈ (IIT-JEE), నీట్ (NEET) కోచింగ్ అడ్మిషన్లు.. 2026-27 విద్యా సంవత్సరంలో ఏకంగా 20 నుంచి 30 శాతం మేర పెరిగాయి. దీంతో నగరమంతా మళ్ళీ విద్యార్థులు, తల్లిదండ్రుల సందడితో కళకళలాడుతోంది.

సంక్షోభం నుంచి గట్టెక్కి..
2023 నుంచి 2025 మధ్య కాలంలో కోటా కోచింగ్ పరిశ్రమ తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంది. గతంలో సుమారు 2.5 లక్షల మంది విద్యార్థులతో ఏడాదికి రూ. 6,500–7,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిన ఈ నగరం.. ఆ తర్వాత విద్యార్థుల సంఖ్య 85 వేల నుంచి లక్షకు పడిపోవడంతో ఆదాయం రూ.3,500 కోట్లకు తగ్గిపోయింది. అయితే మార్చి 25 నుంచి ప్రారంభమైన కొత్త బ్యాచ్‌లకు అనూహ్య స్పందన లభించింది. ఏప్రిల్ రెండు వరకు అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగనుంది.

విజయాల పరంపర.. తగ్గని క్రేజ్
ఎన్ని విమర్శలు ఎదురైనా, ఫలితాల విషయంలో కోటా తన మార్కును నిలబెట్టుకుంటోంది. ఈ ఏడాది జనవరిలో జరిగిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో 100 పర్సంటైల్ సాధించిన 12 మందిలో ఎనిమిది మంది కోటా విద్యార్థులే కావడం విశేషం. గత రెండేళ్లుగా ఐఐటీ-జేఈఈ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు ఇక్కడి విద్యార్థులే కైవసం చేసుకున్నారు. ఈ అద్భుతమైన ట్రాక్ రికార్డే తల్లిదండ్రులను మళ్లీ కోటా వైపు నడిపిస్తోంది. మణిపూర్, బీహార్, మహారాష్ట్ర లాంటి సుదూర ప్రాంతాల నుండి కూడా విద్యార్థులు ఇక్కడికి తరలివస్తున్నారు.

అండగా స్థానికులు.. అద్దె పెంపునకు నో
పెరుగుతున్న విద్యార్థుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని, కోటా హాస్టల్ అసోసియేషన్ అధ్యక్షుడు నవీన్ మిట్టల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. డిమాండ్ పెరిగినప్పటికీ హాస్టల్ అద్దెలను పెంచవద్దని ఆపరేటర్లకు సూచించారు. నగరంలోని 4,000 హాస్టళ్ళు, 45,000 పీజీ సెంటర్లు విద్యార్థుల కోసం సిద్ధంగా ఉన్నాయి. స్థానిక ఎంపీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ.. విద్యార్థుల సంక్షేమానికి స్థానికులు కూడా తోడ్పడాలని పిలుపునిచ్చారు. చదువుతో పాటు ఒత్తిడి మేనేజ్‌మెంట్, మోటివేషన్ క్లాసులపై కూడా కోచింగ్ సెంటర్లు ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. అడ్మిషన్ల పెరుగుదలతో అటు కోచింగ్ రంగం, ఇటు స్థానిక ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడిలో పడుతుందని నగర వాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

ఇది కూడా చదవండి: ‘ఎయిర్‌ ఇండియా’లో ‘పాన్‌ పాన్‌’ కాల్‌... ప్రయాణికులు బెంబేలు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement